Telugu Global
Cinema & Entertainment

దారి తప్పి ఎటో వెళ్ళిన మలయాళ సినిమాలు!

మాలీవుడ్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ కూడా మాలీవుడ్ (మలయాళ సినిమా పరిశ్రమ) సంక్షోభంలోంచి తేరుకోవడం లేదు.

దారి తప్పి ఎటో వెళ్ళిన మలయాళ సినిమాలు!
X

మాలీవుడ్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ కూడా మాలీవుడ్ (మలయాళ సినిమా పరిశ్రమ) సంక్షోభంలోంచి తేరుకోవడం లేదు. సెప్టెంబర్ 8 వరకూ మొత్తం 164 మలయాళం సినిమాలు విడుదలైతే, మూడే హిట్టయ్యాయి. ఫిబ్రవరిలో ‘రోమాంచమ్’ (బడ్జెట్ 8 కోట్లు/బాక్సాఫీసు 75 కోట్లు), మే నెలలో ‘2018’ (25/210), ఆగస్టులో ‘ఆర్డీక్స్’ (8/80) -ఈ మూడు మాత్రమే హిట్టయి మిగిలిన 161 నష్టాల్ని మూటగట్టుకున్నాయి. 9 నెలల్లో వేలం వెర్రిగా 164 సినిమాలంటే సగటున నెలకు 18 సినిమాలు, వారానికి 4.5 సినిమాలు. 164 సినిమాలు తీయడానికి అంతంత డబ్బు పట్టుకుని చిన్న రాష్ట్రం కేరళలో నిర్మాతలు ఎక్కడ్నించి వస్తున్నారో అర్ధం గాదు. అయితే ఇప్పుడిప్పుడే తమ సినిమాలెందుకు ఆడడం లేదని ఆలోచనలు చేస్తున్నారు.

ఒకవైపు బాక్సాఫీసు వసూళ్ళు లేక, మరోవైపు ఓటీటీ కొనుగోళ్ళూ లేక నిలువునా మునిగిపోవడమే జరుగుతోంది. మలయాళ సినిమాల్ని 8-10 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే హిట్‌గా భావించినవి 15-20 కోట్లు సంపాదించేవి. ఈ పరిస్థితి ఇక లేకుండా పోయింది. ఒకవేళ అన్ని సినిమాలూ క్వాలిటీ కంటెంట్ తో తీసినా, వారానికి ఐదేసి, పదేసి సినిమాలు తీసి మీద పడేస్తే ప్రేక్షకులెలా చూస్తారు. అలాంటిది నాసి సినిమాలు తీస్తే చూసే మాటే వుండదు. మలయాళంలో తామర తంపరగా తీస్తున్నవి ఇప్పుడు నాసి రకం సినిమాలే. ఎవరెవరో కొత్త కొత్త మేకర్లు, ఎవరెవరో కొత్త నటీనటులు కలిసి ప్రేక్షకులకి వైరాగ్యం తెప్పిస్తున్నారు. అసలే కేరళలో విద్యావంతులెక్కువ. మొదట్నుంచీ వాళ్ళది ఉన్నతాభిరుచి. దీనికి తగ్గట్టు దర్శకులు ఇంతకి ముందు వుండే వారు.

ప్రేక్షకుల అభిరుచులు బాగా మారిపోయాయని, ఇతర భాషల పరిశ్రమల్లోని నిర్మాతల వలె, ఇక్కడి నిర్మాతలు ఏది వర్కౌట్ అవుతుందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారనీ, ఒక ప్రముఖ పంపిణీదారు వెల్లడించాడు. ఒక సంవత్సరం క్రితం వర్కౌట్ అయిన సినిమాలు ఈ సంవత్సరం కూడా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాయన్న నమ్మకం లేదని అన్నాడు. నాణ్యత గల సినిమాలు మారిపోతున్న ప్రేక్షకుల అభిరుచులతో సరిపోలితేనే సాధ్యమవుతాయని అన్నాడు. పఠాన్ (హిందీ), జైలర్ (తమిళం) వంటి ఇతర భాషా సినిమాలు కేరళలో కూడా బాగా ఆడాయని, సినిమాలపై ప్రేక్షకుల ఆకలి చచ్చిపోలేదనీ, వాళ్ళ ఆకలి ఏమిటో తెలుసుకోవాలనీ వివరించాడు.

నిజమే, ఈ ఆకలిని మలయాళ సినిమాలు తీర్చలేకపోతే, 100 కోట్లకు పైగా వసూలు చేసే హిందీ, తెలుగు సినిమాలు కేరళలో తిష్టవేసి మలయాళ సినిమా వ్యాపారాన్ని సమూలంగా తినేయడం ఖాయం. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే జరిగింది. అక్కడి ప్రాంతీయ సినిమాల అస్తిత్వాన్ని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు శూన్యం చేశాయి. ప్రాంతీయ సినిమాలు ఇక చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించి అవార్డులు పొందడానికి పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు మలయాళం సినిమాలకి అవార్డుల కోసం పంపుకునే యోగ్యత కూడా వుండడం లేదు.

ఇక ఓటీటీల విషయానికొస్తే, అదే ఉత్సాహంతో మలయాళ సినిమాల్ని కొనుగోలు చేయడం లేదు. రెండు లాక్ డౌన్ల సమయాల్లోనే ఇంట్లో బందీ లైన ప్రేక్షకుల కొత్త మార్కెట్ కోసం ఏదిపడితే అది కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసుకుని సొమ్ములు చేసుకున్నారు. థియేటర్లు ప్రారంభమయ్యాక ఆ నాసి సినిమాల భారం థియేటర్ల మీద వేసి తప్పుకున్నారు ఓటీటీల నిర్వాహకులు. అయితే లాక్ డౌన్స్ లో ఏది పడితే అది కొనుగోలు చేయడంతో కొత్తకొత్త మేకర్లు ఏడిపడితే అది తీసి పడేస్తూ పోయారు. దీంతో ఇప్పుడవి థియేటర్లకి వర్కౌట్ కాక మొత్తం మాలీవుడ్ నే చిక్కుల్లో పడేశారు.

మలయాళ సినిమాలు వాటి విభిన్నమైన, ప్రత్యేకమైన కంటెంట్‌ కి ప్రసిద్ధి చెందాయని, వాటిని టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లని కాపీ చేసి తీయడం ప్రారంభిస్తే, ప్రేక్షకులు తిప్పి కొడతారనీ ఒక ట్రేడ్ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. మలయాళం సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లు కూడా మాస్ సినిమాల్లో నటించ లేదు. ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించిన వూర మాస్ హీరోయిజపు సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’ అట్టర్ ఫ్లాపయ్యింది.

అంతేకాదు, మోహన్‌లాల్ నటించిన ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ వంటి చారిత్రక యాక్షన్ సినిమా కూడా ఫ్లాపయ్యింది. ఇలాంటి సినిమాలకి తెలుగు లేదా హిందీ సినిమాల భారీ బడ్జెట్‌లు అవసరం. అంత భారీ బడ్జెట్స్ ని కేరళ మార్కెట్ భరించలేదు.

ఇక మలయాళం నుంచి పానిండియా సినిమాలు తీసే స్థోమత అసలే లేదు. స్టార్ కమర్షియల్ మసాలాలు వర్కౌట్ కాక, చారిత్రకాలు కూడా వర్కౌట్ కాక, పానిండియాలూ వల్లకాక- ఏం చేయాలి మలయాళ మేకర్లు? ముందు 150-200 సినిమాలు తీయడం మానెయ్యాలి. సంఖ్యని 100 కుదించుకుని, తిరిగి స్థానిక విలువలతో ఇదివరకు తీసిన కళాత్మక సినిమాలు తీసుకోవాలి. స్థానిక విలువల్నే సినిమాల్లో ఇష్టపడతారు అక్కడి ప్రేక్షకులు. మమ్ముట్టి, మోహన్ లాల్ లు ఇలాటి సినిమాలతోనే మొదలై, కొనసాగారు.

First Published:  12 Sept 2023 9:07 AM GMT
Next Story