ఎల్లుండి 75 రూపాయలకు సినిమా లేదు!
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) దేశంలో సెప్టెంబర్ 16న తలపెట్టిన జాతీయ సినిమా దినోత్సవాన్నిసెప్టెంబర్ 23 కి వాయిదా వేసింది. కారణం, 'బ్రహ్మస్త్ర' కి వస్తున్న బంపర్ వసూళ్ళని త్యాగం చేసుకోలేక!
సెప్టెంబర్ 16న అంటే ఎల్లుండికి, ఒక మహా సంబరానికి రంగం సిద్ధమైంది. ప్రేక్షకులు ఉత్సాహంగా ఆ రోజు దినచర్యలు మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా థియేటర్ల మీదికి దండెత్తడానికి సర్వ సన్నద్ధులైపోయారు. ఆ రోజు జరిగే జాతీయ సినిమా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. ఇంతలో నిరుత్సాహపరుస్తూ డేట్ వచ్చింది 16న కాదూ, 23న అని. దీంతో దినచర్యలు మార్చుకోవడం మొదలెట్టారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) దేశంలో సెప్టెంబర్ 16న తలపెట్టిన జాతీయ సినిమా దినోత్సవాన్నిసెప్టెంబర్ 23 కి వాయిదా వేసింది. కారణం, 'బ్రహ్మస్త్ర' కి వస్తున్న బంపర్ వసూళ్ళని త్యాగం చేసుకోలేక!
జాతీయ సినిమా దినోత్సవానికి నిర్ణయించిన టికెట్ ధర 75 రూపాయలు మాత్రమే. ఈ రేటుకి 'బ్రహ్మాస్త్ర' చూపించేస్తే ఎలా? అందుకని జాతీయ సినిమా దినోత్సవాన్ని ఒక వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. మెట్రో నగరాల్లో మల్టీ ప్లెక్స్ సగటు టికెట్ ధర సాధారణంగా రూ.150, లేదా రూ.200 ఉంటుంది. దీన్ని 75 రూపాయల ఫ్లాట్ ధరగా అందుబాటులోకి తెచ్చి, సెప్టెంబర్ 16న అన్ని షోలకూ అనుమతించాలనుకున్నారు. ఆ తేదీ 23కి మారింది.
రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్. నాగార్జున, షారూఖ్ ఖాన్‌లు పోటీ పడి నటించిన 'బ్రహ్మాస్త్ర' అన్ని భాషల్లో బాగా పోతోంది. తెలుగు`లోనైతే లాభాల్లో పడింది. వారాంతం ముగిసి మొన్న సోమవారం కూడా బాక్సాఫీసు స్ట్రాంగ్ గా ఉంది. ఇది రెండవ వారాంతంలో కూడా బలంగానే ఉంటుందని భావిస్తున్నారు. దీంతో 'బ్రహ్మాస్త్ర' ని విడుదల చేసిన డిస్నీ సంస్థ, జాతీయ సినిమా దినోత్సవాన్ని వారం పాటు వాయిదా వేయాలని కోరింది.
'బ్రహ్మాస్త్ర' టికెట్ రేట్లు పెంచుతూ విడుదల చేసినా ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. బాయ్ కాట్ ట్రెండింగ్ అట్టర్ ఫ్లాపయ్యింది. టికెట్ ధరలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు రెండవ వారాంతంలో కూడా అలాగే వస్తారని అంచనా. అందుకని ఎనిమిదో రోజున చౌక ధరకి అంటే 75 రూపాయలకి టికెట్లు విక్రయించకుండా ఉండటం మేలని నిర్ణయించారు.
ఎన్నడూ లేనిది ఈ జాతీయ సినిమా దినోత్సవం ఆలోచన ఇప్పుడెందుకు చేసినట్టు? సెప్టెంబరు 3న అమెరికాలో జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అక్కడి మల్టీ ప్లెక్స్ లు మూడు డాలర్లకే (సుమారు రూ. 240) సినిమా టికెట్లు విక్రయించాయి. దీంతో విశేష స్పందన వచ్చింది. మల్టీ ప్లెక్సులు హౌస్ ఫుల్స్ అయ్యాయి. బ్రిటన్‌లో, గల్ఫ్ లో కూడా మల్టీ ప్లెక్సులు జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకున్నాయి. జాతీయ సినిమా దినోత్సవం అన్ని వయసుల ప్రేక్షకులనూ సినిమాలు వీక్షించేందుకు ఒకచోట చేర్చుతుందని, కోవిడ్ తర్వాత థియేటర్లు విజయవంతంగా పునఃప్రారంభం కావడానికి గుర్తుగా ఈ దినోత్సవమనీ, అంతేగాక ప్రేక్షకులకి ధన్యవాదాలు చెబుతూ వారి గౌరవార్ధం ఈ వేడుకని జరుపుతున్నట్టు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఈ దినోత్సవం దీని వెనుక ఉద్దేశాన్ని స్పష్టం చేశాయి.
అమెరికాలో ఏఎమ్సీ, రీగల్ మల్టీప్లెక్స్ గ్రూపు సంస్థలు 3,000 కంటే ఎక్కువ థియేటర్లలో, 30,000 కంటే ఎక్కువ స్క్రీన్‌లపై అమెరికావ్యాప్తంగా తగ్గింపు ధరకి సినిమాలని ప్రదర్శించాయి. దీని స్ఫూర్తితో మన దేశంలో కూడా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు జాతీయ సినిమా దినోత్సవాన్ని తెరపైకి తెచ్చాయి. భారతదేశం అంతటా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సినిమా ప్రేక్షకులకి రూ. 75 సెలబ్రేటరీ అడ్మిషన్ ధరతో ఒక రోజు సినిమాలు చూసేందుకు తరలిరావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ గ్రూపు సంస్థల పేర్లు : పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, కార్నివాల్, మీరా, సిటీ ఫ్రైడ్, ఆసియన్, ముక్తా ఏ 2, మూవీ టైమ్, వేవ్, ఎం 2 కె, డిలైట్ మొదలైనవి. ఇవి 4000 పైగా స్క్రీన్స్ పై ఆ రోజు సినిమాలను ప్రదర్శిస్తాయి.
అమెరికాలో ఈ సందర్భంగా 8.1 మిలియన్ల మంది ప్రేక్షకులు సినిమాలు చూశారు. అక్కడ జరిపిన జాతీయ సినిమా దినోత్సవంలో ప్రేక్షకుల సంఖ్య 2022 లోనే అత్యధికం. మరి మన దేశంలో ప్రేక్షకుల రెస్పాన్స్ చూడాలి. ఐతే ఒకటుంది, తెలివైన ప్రేక్షకులు ఒకపని చేస్తే? ఈ వారం నాలుగైదు వందలు పెట్టి 'బ్రహ్మాస్త్ర' చూడకుండా, సెప్టెంబర్ 23న 75 రూపాయలకే సామూహికంగా తరలి వస్తే? రెండు వారాల్లో సినిమాలు ఓటీటీలో వస్తాయని థియేటర్లకి డుమ్మా కొడుతున్నారు కదా?