Telugu Global
Cinema & Entertainment

టికెట్ల ధరలు తగ్గించి థియేటర్లు నింపుదాం!

సినిమాలకి ప్రేక్షకులు రాక థియేటర్లు మూగబోతున్నాయి. మిగతా దేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

టికెట్ల ధరలు తగ్గించి థియేటర్లు నింపుదాం!
X

సినిమాలకి ప్రేక్షకులు రాక థియేటర్లు మూగబోతున్నాయి. మిగతా దేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎగ్జిబిటర్లకి సినిమాల ప్రదర్శన జీవన పోరాటంలా మారింది. ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే మామూలు హీరోల సినిమాలు సరిపోవడం లేదు. ఓ మోస్తరు స్టార్ సినిమాలు కూడా చాలడం లేదు. బిగ్ స్టార్ సినిమాలుంటేనే ప్రేక్షకులు సినిమాలకి కదులుతున్నారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’, నాని నటించిన ‘దసరా’- ఈ మూడు సినిమాలకే ఈ ఆరునెలల్లో ప్రేక్షకులు పోటెత్తారు. థియేటర్లు కళకళ లాడాయి.

ఇక ఎంతో బావుందని టాక్ వస్తేనే చిన్న హీరోల సినిమాలకి వస్తున్నారు. సాయిధరం తేజ్ ‘విరూపాక్ష’, సుహాస్ ‘పద్మాభూషణ్’, ప్రియదర్శి ‘బలగం’ సినిమాలకి అలా థియేటర్లు నిండాయి. కానీ గోపీచంద్, అల్లరి నరేష్, నాగశౌర్య, విశ్వక్ సేన్, సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోల కొత్త సినిమాలకైతే జనమే లేరు. ఇలాటి సినిమాలే ఎక్కువున్నాయి. దీంతో గరిష్ట కాలం థియేటర్లు బోసి పోయి వుంటున్నాయి. ఇక థియేటర్ల లోపల పార్కింగులు, పాన్ షాపులు, తినుబండారాల స్టాల్సు మనుగడ సంగతి చెప్పక్కర్లేదు.

రేపు 16 న బిగ్ మూవీ ప్రభాస్ నటించిన పానిండియా ‘ఆది పురుష్’ విడుదలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా థియేటర్లకి మళ్ళీ పండుగ వాతావరణం వచ్చింది. ఇలా బిగ్ మూవీస్ ఎన్నని వస్తాయి. ఫుట్ ఫాల్స్ (ప్రేక్షకుల సంఖ్య) కోసం ఇలా బిగ్ మూవీస్ మీదే ఆధారపడి థియేటర్లు ఎన్నాళ్ళు నడుస్తాయి? అందుకని మల్టీప్లెక్స్ గ్రూపులు ఒక స్కీము ప్రవేశ పెట్టాయి. చిన్న హీరోల సినిమాలకి చిన్న టికెట్లు స్కీము. పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ఇటీవల విడుదలైన – ‘జరా హట్కే జరా బచ్కే’ (హిందీ), ‘స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్’ (హాలీవుడ్) సినిమాలకి ఈ స్కీముని అన్వయించి మంచి బాక్సాఫీసు ఫలితాలు సాధించింది. నిర్మాతలు, పంపిణీదారులు చిన్న సినిమాలని తక్కువ టికెట్టు ధరలతో ప్రదర్శించాలని కోరుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏయే మార్కెట్‌లలో ఏ సినిమాలు బాగా రాణిస్తున్నాయో, నిర్దిష్ట మార్కెట్‌లో స్టార్‌కి ఎలాంటి ఆదరణ వున్నదో అంచనా వేసి తదనుగుణంగా ధరల్నిలను నిర్ణయించే డేటా పీవీఆర్ - ఐనాక్స్ దగ్గర వుందని చెప్తున్నారు. తామిచ్చే ఆఫర్లతో ముందుకు రావడానికి బుక్ మై షో, పేటీఎం, ఐసీఐసీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లవంటి భాగస్వాములతో వేగంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్లు భాగస్వాముల వ్యాపారానికి ప్రమోషన్‌గా పని చేస్తాయి. టికెట్ల మీద డిస్కౌంట్లని వాళ్ళే భరిస్తారు. పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు జేబు నుంచి చెల్లించేదేమీ వుండదు.

టిక్కెట్లపై ఆఫర్లు

‘జరా హట్కే జరా బచ్కే’ మొదటి నాలుగు రోజుల తర్వాత బై వన్ గెట్ వన్ (ఒకటి కొంటే ఒకటి ఉచితం) ఆఫర్ తో టికెట్ల విక్రయాలు మొదలెట్టారు. ‘స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్’ మొత్తం 10 భాషల వెర్షన్‌లలో ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీలలో వారం రోజుల తర్వాత ఇదే విధమైన ఆఫర్‌ని ప్రవేశ పెట్టారు. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన పై హిందీ సినిమా ఇప్పటివరకు 38 కోట్ల రూపాయల్ని రాబట్టింది. ‘స్పైడర్‌మ్యాన్’ కి కూడా కలెక్షన్లు పెరిగాయి. ఈ సినిమాలకి రూ. 150 లకే టికెట్లని విక్రయించారు. చిన్న సినిమాలకి ఇంకా తగ్గించి రూ. 110-120 లకే అమ్మాలని యోచిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా టిక్కెట్లు రూ.350-400 రేంజిలో వున్నాయని, ఎక్కువ మంది ప్రేక్షకులకి ఇది గిట్టుబాటు కావడం లేదనీ చిన్న నిర్మాతల వాపోతున్నారు. అసలు టికెట్ల ధర రూ. 100 వుండాలని అంటున్నారు. ప్రేక్షకుల్లో ఎక్కువ మంది నెలకు రూ. 25,000-30,000 సంపాదిస్తారని, సినిమా కోసం రూ. 4,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయడం వాళ్ళకి సాధ్యం కాదనీ ఒక చిన్న నిర్మాత అభిప్రాయం.

ఇక మాస్ ప్రేక్షకులపై దృష్టి పెట్టాలన్న నిర్ణయాని కొచ్చాయి పీవీఆర్ సహా మల్టీప్లెక్సులు. మాస్ ప్రేక్షకులకి సినిమా నిత్యావసరం. చౌక వినోదం. ఇల్లు దాటితే వాళ్ళ వినోద కాలక్షేపాని కెక్కువ ఛాయిస్ లు లేవు. సినిమా టికెట్ల ధరలు ఎక్కువగా వుంటే థియేటర్‌కి వెళ్ళే ఆలోచన మానేసి ఓటీటీల బాట పడతారు. టికెట్ల ధరల విషయంలో మునుపటి కంటే ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నాయనీ, ఈ ప్రయోగాల్ని అమలు చేసి నప్పుడల్లా కంటెంట్ బాగుంటేనే తగ్గింపు టికెట్ ధరలతో సినిమాలు ఆడాయనీ కూడా చెబుతున్నారు.

ప్రేక్షకులు నెలకు దాదాపు రూ. 1,000 తో చాలా కంటెంట్ ఆప్షన్‌లతో, బహుళ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కి సబ్‌స్క్రయిబ్ చేసుకోగలిగినప్పుడు, బయటికి వెళ్ళి థియేటర్లలో సినిమా చూడటానికి వంద ఖర్చు చేయడానికైనా మంచి కంటెంట్ వుండాల్సిందేనని మల్టీప్లెక్స్ వర్గాలంటున్నాయి. చిన్న సినిమా అంటే ఏదిపడితే అది కాదనీ, చిన్న హీరోల సినిమాలకైనా కంటెంట్ బావుంటేనే టికెట్ల ధరలు తగ్గించాలన్నది నియమం.

అలాగే, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ తో పాటు సోషల్ మీడియాలో అగ్రశ్రేణి హీరోలు రావడంతో స్టార్ సిస్టమ్ క్షీణించిందన్నదని ఇంకో ఆరోపణ. ఒకప్పుడు హీరో హీరోయిన్లు కనిపించే వాళ్ళు కాదు, వాళ్ళని చూడడానికి ఏకైక మార్గం థియేటర్లలో సినిమాలకి పరుగెత్తేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు చిన్న, మధ్యస్థ-బడ్జెట్ సినిమాల థియేట్రికల్ వ్యాపారం ఒత్తిడిలో వుంది. అందుకే చాలా మంది నిర్మాతలు సినిమాల్ని ఓటీటీలకి విక్రయిస్తు

న్నారు. చాలా మంది చిన్న నిర్మాతలు పెద్ద తెర గురించి ఆలోచించడం పూర్తిగా మానేశారు. ఏప్రెల్‌లో థియేటర్లలో ఆక్యుపెన్సీ దాదాపు 16-19 శాతం వుందని, జూన్‌లో దాదాపు 20-25 శాతం మధ్య వుండొచ్చనీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల పరిస్థితి ఇలాగే వుంది కానీ మీడియాలో వార్తలు రావడం లేదు. థియేటర్ల పరిస్థితి బాగు పడాలంటే చిన్న హీరోల సినిమాల క్వాలిటీని పెంచి టికెట్ల ధరలు తగ్గించాలి. కానీ టాలీవుడ్ లో ఎవరేం సినిమాలు తీస్తున్నారో, ఎలా తీస్తున్నారో, ఎందుకు తీస్తున్నారో వాళ్ళకే తెలీదు. ఇలా తీస్తే థియేటర్లు మూత బడడానికి సారధు లవుతామని కూడా తెలీదు. వాళ్ళ ఎకోసిస్టమ్ టాలీవుడ్ వరకే. టాలీవుడ్ అవతల ఇంకో ఎకోసిస్టమ్ వుంటుందనీ, దాన్ని పాడు చేసి తామూ పాడవుతామనీ ఎప్పటికీ తెలుసుకోరు!

First Published:  14 Jun 2023 3:03 PM IST
Next Story