Telugu Global
Cinema & Entertainment

థాంక్యూ సినిమాకు అతి తక్కువ టికెట్ రేట్లు

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా థాంక్యూ. ఇప్పుడీ సినిమాకు చాలా తక్కువ టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు.

థాంక్యూ సినిమాకు అతి తక్కువ టికెట్ రేట్లు
X

ఆంధ్రప్రదేశ్ లో ఆమధ్య సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం తగ్గించినప్పుడు, సినీ జనాలు గగ్గోలు పెట్టారు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు రాకుండా తొక్కేస్తున్నారని సినిమా డైలాగులు కొట్టారు. కట్ చేస్తే, ఇప్పుడు అదే సినిమా జనాలు తన సినిమాల టికెట్ రేట్లను భారీగా తగ్గిస్తున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాతలైతే మరో అడుగు ముందుకేసి, ఏపీ ప్రభుత్వం భారీగా టికెట్ రేట్లు పెట్టిందని, ఇంకా తగ్గించాలని కోరుతున్నారు.

"తెలంగాణలో థాంక్యూ సినిమాకు సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలే పెడుతున్నాం. మల్టీప్లెక్సులో 150 రూపాయలు పెట్టాం. జీఎస్టీ అదనంగా ఉంటుంది. అది ప్రభుత్వానికి వెళ్తుంది. తెలంగాణలో మాకు టికెట్ రేట్లు తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి వెసులుబాటు ఉంది. అందుకే వంద రూపాయలే పెట్టాను. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాకు ఆ అవకాశం లేదు. ఏపీలో 125 టికెట్ రేటును లాక్ చేశారు. అంతకంటే తగ్గించడానికి లేదు. థాంక్యూ సినిమాకు నాకు 100 రూపాయలే టికెట్ గా పెట్టాలని ఉంది. కానీ పెట్టలేని పరిస్థితి. గవర్నమెంట్ జీవో అలా ఉంది. కాబట్టి ఏపీలో టికెట్ 125 రూపాయలుగా పెట్టాం."

చూశారుగా.. ఇది దిల్ రాజు వెర్షన్. ప్రభుత్వం మరోసారి జీవోను సవరిస్తే, తమ సినిమా టికెట్ రేట్లను వంద రూపాయలకు కుదించడానికి రెడీ అని ప్రకటించారు దిల్ రాజు. నిజానికి దాదాపు ఇవే రేట్లను గతంలో ముఖ్యమంత్రి ఫిక్స్ చేశారు. కానీ సినీజనం, మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ చాలా రాద్దాంతం చేశారు. కట్ చేస్తే, గతంలో జగన్ నిర్దేశించిన రేట్లకే ఇప్పుడు అంతా దిగొచ్చారు.

కరోనా తర్వాత అతి తక్కువ రేట్లకు ప్రదర్శించిన సినిమాగా పక్కా కమర్షియల్ మూవీ నిలిచింది. ఇప్పుడా సినిమా కంటే తక్కువ ధరలకు థాంక్యూ మూవీని ప్రదర్శిస్తామని చెబుతున్నారు దిల్ రాజు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  18 July 2022 1:26 PM
Next Story