Telugu Global
Cinema & Entertainment

హిందీ ‘లియో’ తో మల్టీప్లెక్సుల సెల్ఫ్ గోల్?

Leo Movie Hindi | విజయ్ నటించిన ‘లియో’ హిందీ వెర్షన్ విడుదలకి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిరాకరణ మల్టీప్లెక్సులనే తెల్లబోయేలా చేసింది.

హిందీ ‘లియో’ తో మల్టీప్లెక్సుల సెల్ఫ్ గోల్?
X

హిందీ ‘లియో’ తో మల్టీప్లెక్సుల సెల్ఫ్ గోల్?

విజయ్ నటించిన ‘లియో’ హిందీ వెర్షన్ విడుదలకి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిరాకరణ మల్టీప్లెక్సులనే తెల్లబోయేలా చేసింది. హిందీ, హాలీవుడ్ సినిమాలు మల్టీప్లెక్సుల్లో విడుదల చేయాలంటే 8 వారాల పాటు ఓటీటీలో విడుదల చేయరాదన్న నిబంధనతో మల్టీప్లెక్సులు కొనసాగుతున్నాయి. అయితే తమిళనాడులో 4 వారాలకే విడుదల చేసే విధానం అమల్లో వుంది. దీన్నే ‘లియో’ హిందీ వెర్షన్ కీ అమలు చేసేందుకు మల్టీప్లెక్సులు అంగీకరించలేదు. దీంతో ‘లియో’ హిందీ వెర్షన్ ని ఉత్తరాదిలో మల్టీప్లెక్సుల్ని పక్కనబెట్టి సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే విడుదల చేశారు. ఇదే అక్టోబర్ 19 న టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్ లు నటించిన ‘గణపత్’ విడుదలైంది. ఇది 8 వారాల ఓటీటీ రిలీజ్ విండోతో మల్టీప్లెక్సుల్లో కూడా విడుదలైంది. ఇక్కడే మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కంగుతినే ఫలితాలొచ్చాయి. ‘గణపత్’ కంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో విడుదల చేసిన ‘లియో’ హిందీ వెర్షనే సూపర్ హిట్టయ్యింది. ‘గణపత్’ ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజులు రూ. 4.75 కోట్లు మాత్రమే వసూలు చేస్తే, కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే ‘లియో’ హిందీ వెర్షన్ రూ. 6 కోట్లు వసూలు చేసింది!

మల్టీప్లెక్సులు ‘లియో’ హిందీ వెర్షన్ తప్ప, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్ లని యధావిధిగానే విడుదల చేశాయి. హిందీ వెర్షన్ ని కూడా 4 వారాల రిలీజ్ విండో తో విడుదల చేసి వుంటే, ఐమాక్స్, ఇన్సిగ్నియా వంటి ప్రీమియం ఫార్మాట్ థియేటర్ల నుంచి కూడా రెవెన్యూ వచ్చేది. కానీ బాలీవుడ్ కి 8 వారాల విండో, సౌత్ కి 4 వారాల రిలీజ్ విండో ఇవ్వలేని పరిస్థితి. అసలు 8 వారాల రిలీజ్ విండో కోరడంలోని రహస్యం కూడా కొందరు విశదీకరిస్తున్నారు. నిజానికి ఏ పెద్ద సినిమా అయినా భారీ వసూళ్ళని సాధించాలంటే 4 వారాల సమయం సరిపోతుందని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. మల్టీప్లెక్సులు ఓటీటీ విడుదలని ఆపుతూ 8 వారాలు కోరుతున్నాయంటే, ఆ 8 వారాలు ప్రేక్షకులకి ధరల దోపిడీతో పుష్కలంగా తినుబండరాలు అమ్ముకోవచ్చన్న ఉద్దేశమే దాగివుందని అంటున్నారు. మల్టీప్లెక్స్ చైన్‌లు నిర్మాతలకి ఇలాంటి నిబంధనల్ని నిర్దేశించడం కొనసాగిస్తే, తమ కంటెంట్ పవర్‌ ని తెలుసుకున్న సౌత్ ప్రొడ్యూసర్‌లు ఖచ్చితంగా లొంగిపోరని, మల్టీప్లెక్సులే సెల్ఫ్ గోల్ చేసుకుంటాయనీ వివరిస్తున్నారు.

ఇప్పుడు ఈ సెల్ఫ్ గోల్ ని అడ్డం పెట్టుకుని బాలీవుడ్ కూడా 8 వారాల విండోని మూసేసి 4 వారాల విండోనే తెరిచాయంటే మల్టీప్లెక్సులు చేసేదేం లేదు. ‘లియో’నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.120 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం. భారీ సినిమాలకు విడుదలకి ముందే ఓటీటీ ఒప్పందాలు జరిగిపోతాయి. అదీ ఓటీటీల షరతుపైనే. 4 వారాల విండో ఓటీటీలు విధించిన నిబంధనే. అంటే నాలుగు వారాల్లో ‘లియో’ హిందీ వెర్షన్ కూడా ఓటీటీలో వచ్చేస్తుంది. రజనీకాంత్ హిందీ వెర్షన్ కూడా ఓటీటీలో ఈ విధంగానే విడుదలై అతి పెద్ద హిట్టయ్యింది. 4 వారాల్లో ఓటీటీలో విడుదలైనప్పటికి కూడా ‘జైలర్’ తమిళం థియేట్రికల్ కలెక్షన్లు పడిపోలేదు. నాల్గు వారాల ఓటీటీ విండోని త్రోసిరాజని 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది.

మల్టీప్లెక్సుల మీద నిర్మాతలకి ఇంకో ఫిర్యాదు కూడా వుంది. విడుదలైన చిన్న, మధ్యతరహా సినిమాలు మౌత్ టాక్ తో పుంజుకొనివ్వకుండానే వారం లోపు తీసేస్తున్నారని. ఐతే సౌత్ నిర్మాతలకి ఇక హిందీ వెర్షన్ మల్టీప్లెక్సులు విడుదల చేయకపోయినా ఉత్తరాదిన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో విడుదల చేసుకోవచ్చు. అయితే తమిళ సినిమాల హిందీ వెర్షన్ కి అంత ఆదరణ కనిపించడం లేదు ఉత్తరాదిన. ‘జైలర్’ ni పెద్దగా ఆదరించలేదు. ఇప్పుడు ‘లియో’ కి లభిస్తున్నది చెప్పుకోదగ్గ ఆదరణ కాదు. రెండు రోజుల్లో రూ. 6 కోట్లు వసూలు చేసిందన్న మాటే గానీ, విడుదల చేసింది ఉత్తరాదిన రెండు వేల థియేటర్లలో! థియేటర్ల సంఖ్యతో పోలిస్తే కనీసం ఇరవై కోట్లు వసూలు చేయాలి.

అదే తెలుగు పానిండియాలకి ఉత్తరాదిన పట్టు వుంది. కానీ ‘దసరా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ లాంటి పానిండియాలు హిందీలో వర్కౌట్ కాలేదు. హిందీలోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విఫలమయ్యాయి. ఇలాటివే తీస్తూ పోతే ఉత్తరాదిన తెలుగు సినిమాలు కూడా మార్కెట్ ని కోల్పోతాయి.

అయితే హిందీ ‘గణపత్’ ఎంత అలుసైపోయిందంటే, దీనికన్నా ‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ కలెక్షన్లే బావున్నాయట! ‘గణపత్’ రూ. 150- 200 బడ్జెట్ తో నిర్మిస్తే రెండు రోజుల్లో కేవలం రూ. 4.75 కోట్లు కలెక్షన్ అంటే ఎంత పెద్ద ఫ్లాపో వూహించవచ్చు!

First Published:  22 Oct 2023 1:44 PM IST
Next Story