Telugu Global
Cinema & Entertainment

2025 ఆస్కార్‌ ఎంట్రీకి 'లాపతా లేడీస్‌'

2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైందని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక ప్రకటన

2025 ఆస్కార్‌ ఎంట్రీకి లాపతా లేడీస్‌
X

బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ మాజీ సతీమణి కిరణ్‌రావు డైరెక్షన్‌లో వచ్చిన 'లాపతా లేడీస్‌' అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

మన దేశం తరఫున ఈ సినిమా ఆస్కార్‌కు కచ్చితంగా ఎంపికవుతుందని కిరణ్‌రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. '2025లో ఆస్కార్‌ అవార్డుల్లో భారత్‌ తరఫున అధికారికంగా 'లాపతా లేడీస్‌' అర్హత సాధిస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ సినిమా ఆస్కార్‌ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు మా యూనిట్‌ సభ్యులందరి కోరిక' అని కిరణ్ రావు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్‌' సినిమా ఎంట్రీకి పంపనున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఆట్టం, యానిమల్‌ తదితర 29 సినిమాల లిస్ట్‌ నుంచి ఈ సినిమాను ఎంచుకున్నారు.2001నాటి చిత్ర కథ ఇది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్‌ నిర్మించిన ఈ మూవీ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం విదితమే. స్పర్శ్‌ శ్రీవాస్తవ, నితాన్షి గోయెల్‌, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ప్రతిష్టాత్మక టోరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకల్లో గత ఏడాది ఈ మూవీని ప్రదర్శించడం గమనార్హం. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా.. అడ్మినిస్ట్రేటివ్‌ భవనంలోని సి-బ్లాక్‌లో ని ఆడిటోరియంలో ఈ సినిమాను ప్రదర్శించారు. అలాగే ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ అవార్డుల్లోనూ లపతా లేడీస్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో బెస్ట్‌ ఫిల్మ్‌గా నిలిచింది.

First Published:  23 Sept 2024 2:12 PM IST
Next Story