Krishna: సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు
Superstar Krishna Health Condition: సూపర్ స్టార్ కృష్ణ కు అర్ధ రాత్రి గుండె పోటు వచ్చింది. ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేశారు

నటుడు, సూపర్ స్టార్ కృష్ణపై డాక్టర్లు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్న మాట నిజమేనని ప్రకటించారు. కృష్ణ సంబంధీకులు, పీఆర్ జనాలు చెబుతున్నట్టు ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు రాలేదని డాక్టర్లు తేల్చిచెప్పారు.
వైద్యులు చెబుతున్న ప్రకారం, కృష్ణకు అర్థరాత్రి గుండె పోటు వచ్చింది. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తీసుకొచ్చే టైమ్ కు ఆయన స్పృహలో లేరు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ గురు.ఎన్.రెడ్డి విస్పష్ట ప్రకటన చేశారు.
"అర్థరాత్రి అపస్మారక స్థితిలో కృష్ణ మా హాస్పిటల్ కు వచ్చారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సీపీఆర్ చేసి గుండె పోటు నుంచి బయటపడేలా చేశాం. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి కాపాడాం. తర్వాత ఐసీయూలో చేర్చాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ, ఏ గంటకు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పటి నుంచి ప్రతి గంట కీలకమే. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో మత్తులో ఉంచాం."
కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై తమకు పూర్తి అవగాహన ఉందని ప్రకటించారు వైద్యులు. అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు అవసరమని తెలిపారు.