Telugu Global
Cinema & Entertainment

Kollywood: తమిళ చిన్న సినిమా కూడా ఫ్లాప్!

Tamil flop movies in 2022: 2022లో తెలుగులో తీసిన 250 చిన్న సినిమాలన్నీ ఫ్లాప్ అయితే, తమిళంలో 179 ఫ్లాపయ్యాయి, ఒకటే హిట్టయ్యింది.

Kollywood: తమిళ చిన్న సినిమా కూడా ఫ్లాప్!
X

2022లో తెలుగులో తీసిన 250 చిన్న సినిమాలన్నీ ఫ్లాప్ అయితే, తమిళంలో 179 ఫ్లాపయ్యాయి, ఒకటే హిట్టయ్యింది. కేవలం ‘లవ్ టుడే’ కే ప్రేక్షకులు పట్టంగట్టారు. అది కూడా సంచలనం సృష్టిస్తూ 5 కోట్ల బడ్జెట్ కి 100 కోట్ల భారీ బాక్సాఫీసు ఇచ్చి ప్రోత్సహించారు. తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్లకు పైగా వసూలు చేసింది. 11వ రోజుకల్లా 50 కోట్లు వసూలు చేసింది. మూడో వారం కల్లా 100 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తే, అందులో తమిళనాడులో 50 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 10 కోట్లు వసూలు చేసింది. నైజాంలో 5 కోట్లు, సీడెడ్ లో కోటి, ఆంధ్రాలో 4 కోట్లు. ఇలా గ్లోబల్ హిట్టయ్యింది.

180 చిన్న సినిమాల్లో ఒకటే ఇంత భారీ విజయం సాధిస్తే మిగిలినవి భారీ నష్టాలే తప్ప రూపాయి కూడా లాభం తెచ్చిపెట్టలేదు. తమిళ సినిమా 2022 లో మరో రెండు భారీ విజయాల్ని సాధించింది. పిఎస్-1, విక్రమ్ సినిమాలతో బాక్సాఫీసు దద్దరిల్లింది. మొత్తం 230 సినిమాలు విడుదలైతే వాటిలో 180 చిన్న సినిమాలు, మిగిలిన 50 పెద్ద, మధ్యస్థ బడ్జెట్ సినిమాల్లో 9 పెద్ద సినిమాలు తప్ప మిగిలినవి ఫ్లాపయ్యాయి.

అయితే రూ. 25 కోట్లు అంతకంటే ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ప్రతి పెద్ద సినిమా 2022 లో హిట్టేనని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ బాక్సాఫీసు హిట్స్ కావు. థియేటర్లలో డబ్బు సంపాదించలేదు. థియేటరేతర మొత్తం వ్యాపారంతో నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టాయి. చాలా మంది స్టార్ సినిమాల నిర్మాతలు శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కుల ప్రీ-రిలీజ్ అమ్మకాలతో తమ పెట్టుబడిని రికవరీ చేసేసుకుంటున్నారు. ఆపైన తమిళనాడు నుంచి వచ్చే థియేట్రికల్స్ వసూళ్ళు దైవాధీనం. సినిమాలనేవి థియేటర్లలో ప్రదర్శించడానికి పుట్టాయి. కానీ అవి సొంతిల్లు వదిలేసి ఓటీటీ, శాటిలైట్, డబ్బింగుల వంటి అనాధాశ్రమాల్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రేక్షకులు వారి సొంతిళ్ళలో వుండిపోవడం వల్ల.

థియేటటర్లో ఏ సినిమా చూడాలో నిర్ణయించుకునేటప్పుడు ప్రేక్షకులు తమ సమయానికీ, డబ్బుకూ చాలా విలువ ఇవ్వడం ప్రారంభించారని తెలుగువాడైన తమిళ కో డైరెక్టరొకరు చెప్పారు. ఇంతకి ముందు అధిక నాణ్యతగల కంటెంట్ కీ, ప్రేక్షకులకీ మధ్య చాలా గ్యాప్ వుండేదనీ, ఆన్ లైన్లో వీక్షించే వెసులుబాటుతో గత ఐదేళ్ళలో ఈ గ్యాప్ పూడిపోయిందనీ, దీంతో థియేటర్‌కి రావడానికి ఎంతో ఆలోచిస్తున్నారనీ ఆయన చెప్పారు. ఇది అంతటా వున్న పరిస్థితే.

గతంలో తమిళ చిన్న సినిమాలు రూ. 2-3 కోట్ల బిజినెస్ చేసేవి. ఇప్పుడు రూ. 25 లక్షలు కలెక్ట్ చేయడం కనాకష్టంగా మారింది. పెద్ద సినిమాలు కూడా అయితే హిట్ లేకపోతే ఫట్ గా మారాయి. మిశ్రమ స్పందన పొందిన కొన్ని తమిళ స్టార్ సినిమాలు ఈ సంవత్సరం రూ. 5 కోట్ల లోపు వసూలు చేశాయి. ఇంతకుముందు కనీసం రూ. 7-10 కోట్లు వసూలు చేసేవి. ఈ సినిమాలు థియేటరేతర వ్యాపారాలు చేసుకున్నాయి. ఏవరేజ్, ఎబో ఏవరేజ్ కంటెంట్ తమిళ ప్రేక్షకులకి నచ్చడం లేదు.

చిన్న సినిమాలు బాగా ఆడకపోవడం ఆరోగ్యకరమైన ట్రెండ్ కాదనీ, చిన్న సినిమాలు విజయం సాధించడం చాలా ముఖ్యమనీ, ఎందుకంటే అక్కడ స్టార్లు పుడతారనీ, చిన్న సినిమాలు కొత్త స్టార్స్ ని సృష్టించినప్పుడు అది పరిశ్రమకి మరింత డబ్బు తెచ్చిపెడుతుందనీ, కోలీవుడ్ లో దూరదృష్టితో ఆలోచిస్తున్నారు.

తమిళనాడులో సినిమాల సక్సెస్ రేటు దాదాపు 3 లేదా 4% వుంటుంది. దీనికి కారణం నటీనటులకి అధిక పారితోషికం, తమిళ రాకర్స్ పైరసీ, అధిక టిక్కెట్ ధరలని పైకి చెప్పుకున్నా, అసలు స్థానిక సినిమాల పట్ల ప్రేక్షకుల వైఖరిలో వచ్చిన మార్పు కారణం. చిన్న సినిమాల పట్ల వైముఖ్యం కూడా ఒకటి. దీన్ని గుర్తించకుండా, అవసరానికి మించి వందల సంఖ్యలో చిన్న సినిమాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇన్ని సినిమాలు ప్రదర్శించ

డానికి థియేటర్లు కూడా లేవు. తెలుగు రాష్ట్రాల థియేటర్ల సంఖ్యలో (1700) సగానికి కొంచెం ఎక్కువ (1000) వున్నాయి. కాబట్టి చాలా సినిమాలు విడుదలకాక మురుగుతూంటాయి.

తగినన్ని థియేటర్లు లేక, వాటిలో ప్రేక్షకులూ లేక దేశ సేవ చేయడానికి చిన్న సినిమాలు తీస్తే అది మంచిదే. సినీకార్మికులకి రెగ్యులర్ ఉపాధి లభిస్తుంది. థియేటర్లలో క్యాంటీన్ వాలాలు, పార్కింగ్ వాలాలు ఈ సినిమాలకి జనాల్లేక శాపాలు పెట్టే దృశ్యాలుంటాయి- వాళ్ళ సంక్షేమ పథకం కూడా ఆలోచిస్తే సరిపోతుంది.

First Published:  21 Jan 2023 8:06 AM GMT
Next Story