Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో కార్పొరేట్ స్టయిల్ వచ్చింది

గతంలో కంటే టాలీవుడ్ ఇప్పుడు మరింత మెరుగ్గా ఉందని అన్నారు నిర్మాత కేకే రాధామోహన్. కార్పొరేట్ పద్ధతిలోకి ఇండస్ట్రీ మారిందని అంటున్నారు.

టాలీవుడ్ లో కార్పొరేట్ స్టయిల్ వచ్చింది
X

ఒకప్పుడు టాలీవుడ్ లో ఏదీ సరైన రీతిలో ఉండేది కాదని, ఎవరికి వారు అన్నట్టు ఉండేదని చెప్పుకొచ్చారు నిర్మాత కేకే రాధామోహన్. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో వ్యవస్థలన్నీ చక్కగా ఉన్నాయని, అందరూ కార్పొరేట్ స్టయిల్ లో పనిచేస్తున్నారని అన్నారు. డబ్బుల విషయంలో కూడా గతంలో కంటే ఇప్పుడు పారదర్శకత మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు.

"యూఎస్ నుండి షిఫ్ట్ అయిపోయాను. పూర్తి సమయం సినిమాలకి కేటాయించాను. గత మూడేళ్ళుగా ఓరేయ్ బుజ్జిగా, ఓదేల రైల్వే స్టేషన్.. ఇప్పుడు క్రేజీ ఫెలో చేశాం. స్పీడు పెంచుతూనే రిస్క్ ని బ్యాలన్స్ చేస్తేనే ఇండస్ట్రీలో వుండగలం. ఇప్పుడు ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్ద్, కార్పోరేట్ స్టయిల్ లో వుంది. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను."

టాలీవుడ్ కు మార్కెట్ పెరిగినా, నిర్మాతకు మిగిలిందేం లేదంటున్నారు రాధామోహన్. ఆదాయ వనరులు పెరిగినప్పటికీ, నిర్మాణ వ్యయం కూడా పెరగడంతో, అక్కడకి అది సరిపోతుందని అభిప్రాయపడ్డారు.

"మొదట్లో శాటిలైట్,, ఇప్పుడు ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్ కి 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన భాద్యత నిర్మాతపైనే ఉంటుంది."

ఈ నిర్మాత తీసిన క్రేజీ ఫెలో సినిమా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. సినిమాలు చిన్నవా పెద్దవా అనే తేడా ఉండదని, థియేటర్లలో క్లిక్ అయిన దాన్నిబట్టి దాని రేంజ్ ఉంటుందని అంటున్నారు ఈ నిర్మాత.

First Published:  13 Oct 2022 10:37 AM IST
Next Story