Telugu Global
Cinema & Entertainment

Kishore Kumar Biopic: కిషోర్ కుమార్ బయోపిక్ కి మోక్షమెప్పుడో?

Kishore Kumar Biopic: ప్రసిద్ధ బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, స్వర్గీయ కిషోర్ కుమార్ బయోపిక్ టాపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది.

Kishore Kumar Biopic movie: కిషోర్ కుమార్ బయోపిక్ కి మోక్షమెప్పుడో?
X

కిషోర్ కుమార్ బయోపిక్ కి మోక్షమెప్పుడో?

ప్రసిద్ధ బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, స్వర్గీయ కిషోర్ కుమార్ బయోపిక్ టాపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎనిమిదేళ్ళుగా ఈ బయోపిక్ విషయం తేలడం లేదు. అయినా బాలీవుడ్ హీరోలు నేనే కిషోర్ కుమార్ పాత్ర పోషిస్తున్నానంటే, కాదు నేను పోషిస్తున్నానని పోటీలు పడి ప్రకటించుకుంటున్నారు. అసలు బయోపిక్ కి మేం అనుమతి ఇవ్వాలిగా అని కిషోర్ కుమార్ కుటుంబం చురక వేస్తోంది. దర్శకుడు పట్టువదలని విక్రమార్కుడిలా వున్నాడు. మీరంతా కాదు, మేమే కిషోర్ కుమార్ బయోపిక్ నిర్మిస్తాం, స్క్రిప్టు వర్క్ జరుగుతోందని కిషోర్ కుమార్ కుటుంబం ప్రకటిస్తోంది. ఇలా కౌంటర్లు వేసుకుంటూ పాయింటుకి రాలేకపోతున్నారు అటు ఇటూ సెలెబ్రిటీలు.

ఇటీవల బయోపిక్ లో కిషోర్ కుమార్ పాత్రని రణవీర్ సింగ్ స్థానంలో రణబీర్ కపూర్ పోషించ వచ్చని వచ్చిన వార్తల నేపథ్యంలో, అసలు బయోపిక్ హక్కులు ఎవరికీ ఇవ్వడం జరగలేదని కిషోర్ కుమార్ కుమారుడు, గాయకుడు అమిత్ కుమార్ స్పష్టం చేశాడు. దీంతో బయోపిక్ సన్నాహాల్లో వున్న దర్శకుడు అనురాగ్ బసు ఇరుకున పడ్డాడు. మళ్ళీ మళ్ళీ హక్కుల కోసం కిషోర్ కుమార్ కుటుంబాన్ని సంప్రదించినా ఫలితం లేకపోయింది.

కిషోర్ కుమార్ కుటుంబం, ముఖ్యంగా ఆయన కుమారుడు అమిత్ కుమార్, బయోపిక్ హక్కుల్ని ఇంకా ఎవరికీ ఇవ్వడానికి సిద్ధంగా లేడనేది నిర్వివాదాంశం. అనురాగ్ బసు ఈ బయోపిక్ కోసం ఎనిమిదేళ్ళుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య ఈ బయోపిక్ ని రణవీర్ సింగ్ తో తీయవచ్చని వచ్చిన వార్తలకి భిన్నంగా రణబీర్ కపూర్ తోనే నిర్మిస్తారని ధృవీకరణ వచ్చింది. స్వయంగా రణబీర్ కపూర్ కూడా ప్రకటించాడు. ఎనిమిదేళ్ళుగా దర్శకుడు అనురాగ్ బసుతో తను ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నట్టు స్పష్టం చేశాడు. అయితే అనురాగ్ బసు- రణబీర్ కపూర్‌లు ఈ బయోపిక్ తీయలేరనీ, వారికి కాపీరైట్ లేదనీ, కాపీరైట్ కోసం అమిత్ కుమార్ తోబాటు, కిషోర్ కుమార్ భార్య లీనా చందా వర్కార్ ని అనేక మార్లు ప్రయత్నించారనీ, కిషోర్ కుమార్ కుటుంబం నుంచి వివరణ వెలువడింది.

మరోవైపు స్క్రిప్టు మీద పనిచేస్తున్నామనీ చెప్పిన అమిత్ కుమార్, దర్శకత్వం తానే వహించబోతున్నట్టు సంకేతాలిచ్చాడు. అయితే ఎవరు నటిస్తారనేది చెప్పలేదు. తను నటించే అవకాశం మాత్రం వుండదని చెప్పొచ్చు. కిషోర్ కుమార్ బయోపిక్ తీయాలంటే కేవలం వృత్తి గత జీవితం తీస్తే సరిపోదు. ఆలాతీస్తే అమిత్ కుమార్ నటించవచ్చు. నాల్గు పెళ్ళిళ్ళు చేసుకున్నకిషోర్ కుమార్ భార్యలతో కుటుంబ జీవితం కూడా చూపించాలి కాబట్టి కుమారుడైన అమిత్ కుమార్ నటిస్తే బావుండదు.

కొంత కాలం క్రితం అనురాగ్ బసు దర్శకత్వంలో గాయకుడు అద్నాన్ సమీ నటించవచ్చని మీడియాలో రాశారు. భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమి స్వయంగా సంగీతకారుడు, స్వరకర్త, నటుడు కూడా అయినందు వల్ల ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాడని మీడియా వర్గాలు వెల్లడించాయి. అద్నాన్ సమీ గతంలో కిషోర్ కుమార్ పాడిన కొన్ని క్లాసిక్ హిట్స్ ని ఒక ప్రముఖ రియాలిటీ షోలో పునఃసృష్టించాడు కూడా. ఈ షో పెద్ద హిట్టయ్యింది.

తర్వాత అద్నాన్ సమీ పేరు వెనక్కి వెళ్ళిపోయి అమీర్ ఖాన్ తెరపై కొచ్చాడు. ఇవన్నీ గమనిస్తూ వున్న నటుడు నసీరుద్దీన్ షా, అసలెవరు కిషోర్ కుమార్ బయోపిక్ తీసినా, ఆర్డీ బర్మన్ బయోపిక్ తీసినా చెడగొడతారనీ, వాటి జోలికి పోవద్దనీ హితవు చెప్పాడు.

అయితే బాలీవుడ్ వర్గాల్లో ఈ అంశం ఆసక్తి రేపడంలేదు. అమిత్ కుమార్- అనురాగ్ బసు శిబిరాల మధ్యే ముసుగులో గుద్దులాటగా ఇది సాగుతోంది. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందనేదే ఇప్పుడు ఆసక్తి పుట్టిస్తున్న ప్రశ్న. అసలు కిషోర్ కుమార్ చాలా సంకీర్ణ వ్యక్తిత్వమున్న కళాకారుడు. లోభిలా కన్పిస్తాడు, అంతలోనే దానాలు చేసి ఆశ్చర్య పరుస్తాడు. చాలా హాస్యప్రియుడు. స్టూడియోలో పాట పాడే ముందు అసిస్టెంట్ వైపు చూసి “కాఫీ అందిందా?” అంటాడు. అంటే డబ్బు ముట్టిందా అని అర్ధం. కాఫీ అందిందని అసిస్టెంట్ సైగ చేస్తే పాట పాడతాడు, లేకపోతే లేదు.

ఒక కొత్త దర్శకుడు వస్తే 18 వేలు ఇస్తే పాడతానని ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పట్లో 18 వేలు చాలా ఎక్కువ. ఆ కొత్త దర్శకుడు నిర్మాతని ఎలాగో ఒప్పించుకుని పాడించు

కున్నాడు. పాట పూర్తయ్యాక, కిషోర్ ఆ 18 వేలు కొత్త దర్శకుడికి ఇచ్చేసి- “ఇది నిర్మాతకి తిరిగి ఇవ్వకు. దాచుకో. సినిమాల్ని నమ్ముకోకు’ అన్నాడు. ఆ కొత్త దర్శకుడు కిషోర్ ఇంటి అవతల ఆ 18 వేలతో గుడిసె కొనుక్కుని తర్వాత రిచ్ అయ్యాడు.

కిషోర్ కుమార్ ఎప్పుడేం చేస్తాడో ఎవరూ పసిగట్టలేరు. అర్ధరాత్రి లేచి తలగడ కింద నోట్లు లెక్కబెట్టుకుంటాడు. ఒక ప్రముఖ నిర్మాత మీద కోపంతో ఆయనకి పాటలు పాడడం ఇష్టం లేక, ఆయన ఇంటికి రాకుండా గేటు ముందు కుక్కల్ని కట్టేశాడు. ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ షూటింగులో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముంబయిలో మూడు గంటలు కారు తోలుకుంటూ వెళ్ళి పోతూనే వున్నాడు. షూటింగ్ సిబ్బంది వెంటాడి ఎలాగో పట్టుకుంటే “మీరు కట్ చెప్పలేదుగా?” అన్నాడు.

ఇలాటి కామెడీలు చాలా వున్నాయి. కానీ పాటలు పాడడం కామెడీ కాదు. చాలా సీరియస్. పాత పాడాడంటే అదొక అద్భుతమే. దాన్ని కాలం చెరిపి వెయ్య లేదు. కిషోర్ కుమార్ (అభాస్ కుమార్ గంగూలీ, 1929 - 1987) హిందీతో బాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, భోజ్ పురి, అస్సామీ, ఒడియా సహా అనేక ఇతర భారతీయ భాషల్లో వేలకొద్దీ పాటలు పాడారు. తను గాయకుడే గాక, నిర్మాత, నటుడు, రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా. ఆయన నాల్గు సార్లు వివాహమాడేడు- రూమా గుహా థాకుర్తా (1950-58), మధుబాల (1960-60), యోగితా బాలి (1976-78), లీనా చందా వర్కార్ (1980-87).

"ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకుల్నీ మరచిపోవడానికి నా సినిమాలు చూస్తారు. నా పాటలు వింటారు. ప్రతి మనిషికీ బాధలుంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే ప్రజల్ని ఎల్లపుడూ నవ్వించాలి. ఆహ్లాదం కల్పించాలి. ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతే గానీ మన బాధ వారికి పంచ కూడదు." ఇదీ కిషోర్ నమ్మిన, ఆచరించి చూపిన ఫిలాసఫీ.

"తోటలో నుంచి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏమయింది? ఎన్నో మొగ్గలు పూవులై విరుస్తాయి. వికసిస్తాయి. పరిమళాన్ని వెదజల్లుతాయి. కాబట్టి నేను పోయానని కలత చెందకండి." అని సెలవిచ్చాడు.

First Published:  5 Jun 2023 12:49 PM IST
Next Story