అంతా వాళ్లే చేశారు.. లాల్ సింగ్ చడ్డా అపజయంపై కరీనా
ఎంతో ఊరించి ప్రేక్షకుల ముందుకొచ్చిన లాల్ సింగ్ చడ్డా చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

Kareena Kapoor Statements On Laal Singh Chaddha
ఎంతో ఊరించి ప్రేక్షకుల ముందుకొచ్చిన లాల్ సింగ్ చడ్డా చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రాలేదు. బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్, అగ్రనటి కరీనా, తెలుగు హీరో నాగచైతన్య వంటి ఎందరో స్టార్స్ నటించిన ఈ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అయితే ఎందుకో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సినిమా విడుదలకు ముందే 'బాయికాట్ లాల్ సింగ్ చడ్డా' అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయ్యింది.
గతంలో ఎప్పుడో అమీర్ ఖాన్ .. దేశంలో అసహనం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.ఆ వ్యాఖ్యలకు కాషాయదళం ఈ సినిమా టైంలో రివెంజ్ తీర్చుకున్నదన్న టాక్ వినిపించింది.అయితే సినిమా బాగుంటే ఇటువంటి ప్రచారాలు పెద్దగా నష్టం చేకూర్చేవి కాదేమో.. కానీ మూవీకి నెగటివ్ టాక్ రావడంతో దెబ్బతిన్నది.
ఈ సినిమాపై తాజాగా కరీనా కపూర్ స్పందించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'కేవలం ఒక్కశాతం జనం మాత్రమే లాల్ సింగ్ చడ్డాపై తప్పుడు ప్రచారం చేశారు. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి. నిజానికి ఇది ఎంతో గొప్ప సినిమా. ఇటువంటి మంచి సినిమాను ప్రేక్షకులు వదులుకోవద్దు. దయచేసి ఆదరించండి. తప్పుడు ప్రచారం నమ్మకండి. ఈ సినిమా కోసం మేం మూడేళ్లు కష్టపడ్డాం' అంటూ చెప్పుకొచ్చింది కరీనా.. మరి ఆమె మాటలను ప్రేక్షకులు వింటారా? వేచి చూడాలి.