కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ త్వరగా కోలుకోవాలి
నటుడు శివ రాజ్‌కుమార్‌కు నేడు శస్త్రచికిత్స జరుగుతుండటంతో ఆయనకు ఫోన్ చేసి మాట్లాడిన కర్ణాటక సీఎం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ చికిత్స కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం శస్త్రచికిత్స చేయించుకుంటున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
అనారోగ్యంతో బాధపడుతున్న శివరాజ్‌కుమార్ కు ఈరోజు శస్త్రచికిత్స జరుగుతుండటంతో ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. శివరాజ్‌కుమార్ దైర్యం, విశ్వాసం, దయాగుణమే ఆయనను ఈ పోరాటంలో విజేతగా నిలుపుతాయని విశ్వసిస్తున్నాను. జీవితంలో ఎదురైన ఈ చిన్న కష్టాన్ని అధిగమించి ఆరోగ్యంతో ఆయన తిరిగి రావాలని ఆతృతతో ఎదురుచూసే ఆయన శ్రేయోభిలాషుల్లో నేనూ ఒకడిని. ఈ దేశంలో అందరి ఆశీస్సులూ ఆయనకు ఉంటాయని అని సీఎం ఎక్స్‌లో పేర్కొన్నారు.
కర్ణాటకలో శివన్నగా ప్రసిద్ధిగాంచిన శివరాజ్ కుమార్ డిసెంబర్ 18న శస్త్రచికిత్స కోసం అమెరికా పయనమయ్యారు. మియామి క్యాన్సర్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుంటున్నారు. ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తోటి నటీనటులు, అభిమానుల నుంచి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు పొందుతున్నందుకు ఆనందంగా ఉన్నది. నా ఆరోగ్యం విషయంలో సంయమనం పాటించిన మీడియాకు ధన్యవాదాలు. అంతా మంచిగానే జరుగుతుంది. సర్జరీ కోసం ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు ఎవరికైనా కొంత ఆందోళనగా ఉంటుంది. సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఇంటి నుంచి వస్తున్న సమయంలో నా కుటుంబసభ్యులు, అభిమానులను చూసినప్పుడు కాస్త ఎమోషనల్‌గా అనిపించింది. చికిత్స పూర్తయ్యాక యూఐ, మ్యాక్స్ మూవీస్ చూస్తాను అన్నారు.