Telugu Global
Cinema & Entertainment

కమల్ హాసన్- శంకర్ - మధ్యలో రామ్ చరణ్!

ఒకే సమయంలో మూడు భారీ పానిండియా సినిమాలు, ఇద్దరు స్టార్లు, ఒకడే స్టార్ డైరెక్టర్! ఒక దర్శకుడు ఏక కాలంలో రెండు మూడు సినిమాలకి దర్శకత్వం వహించే పాత రోజులుండేవి.

కమల్ హాసన్- శంకర్ - మధ్యలో రామ్ చరణ్!
X

ఒకే సమయంలో మూడు భారీ పానిండియా సినిమాలు, ఇద్దరు స్టార్లు, ఒకడే స్టార్ డైరెక్టర్! ఒక దర్శకుడు ఏక కాలంలో రెండు మూడు సినిమాలకి దర్శకత్వం వహించే పాత రోజులుండేవి. ఇప్పుడు కాదు. ఒక దర్శకుడు చేతిలో వున్న ఒక సినిమా మీద పూర్తి దృష్టి పెట్టి పూర్తిచేయాల్సిన రోజుల్లోకి వచ్చేశారు. అలాంటిది ఒక పెద్ద దర్శకుడు ఒక సినిమా ప్రారంభించి, మధ్యలో ఇంకో సినిమా చేపట్టి, ఆ తర్వాత మరింకో సినిమాకి పూనుకుంటే ఇరుకున పడేదెవరు? ముగ్గురూ వేర్వేరు హీరోలైతే ముగ్గురూ ఇరుకున పడతారు. ఆ మూడు సినిమాల్లో ఇద్దరే హీరోలైతే ఒక హీరో ఇరుకున పడతాడు. అలా ఇరుకునపడ్డ స్టార్ హీరోయే రామ్ చరణ్. రెండు సినిమాలతో సంతృప్తిగా వున్నది కమల్ హాసన్. ఈ మూడు సినిమాలతో బోలెడు గందరగోళం సృష్టిస్తున్నది దర్శకుడు ఎస్. శంకర్!

ఇప్పుడు ఈ గందరగోళానికి పరాకాష్ఠ రామ్ చరణ్ సినిమా 2024 లో కాదు, 2025 లో విడుదల! 2024 లో విడుదల చేద్దాం, అదిగి ఇదిగో అంటూ వచ్చిన శంకర్ ఒక బాంబు పేల్చి, ముందు కమల్ హాసన్ సినిమాలు రెండూ 2024 లో విడుదల చేసి, రామ్ చరణ్ సినిమా 2025 లో చూసుకుందామనేశాడు! దీంతో రామ్ చరణ్ కి, నిర్మాత దిల్ రాజుకీ దిక్కు తోచని పరిస్థితి!

ఇదంతా ఎలా మొదలైందంటే, 2017 లో శంకర్, కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ (1996 నాటి ‘భారతీయుడు’ కి సీక్వెల్) ఎనౌన్స్ చేశాడు. 2019 లో షూటింగ్ ప్రారంభించాడు. ఆ షూటింగ్ లో అగ్నిప్రమాదం సంభవించి ఒకరు చనిపోయారు. దాంతో షూటింగ్ ఆగిపోవడం, చాలా చట్ట పరమైన సమస్యలు ఎదుర్కోవడం జరిగి, 2022 లో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. అయితే ‘ఇండియన్ 2’ తిరిగి ప్రారంభమవుతుందన్న నమ్మకం లేక, 2021 లో రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ ప్రారంభించాడు. ఇంతలో కమల్ హాసన్ తో ఆగిపోయిన ‘ఇండియన్ 2’ ని లీగల్ కారణాల వల్ల 2022 లో తిరిగి ప్రారంభించేసరికి, ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ షెడ్యూళ్ళు గందరగోళమై, పూర్తి చేయడం ఆలస్యమైపోతూ, రూ. 200 కోట్లు అనుకున్న బడ్జెట్ రూ. 450 కోట్లకి పెరిగిపోయింది!

మళ్ళీ దీనికి శంకర్ మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే, ‘ఇండియన్2’ కి కథ అడ్జెస్టు కావడం లేదని, మిగిలి పోయిన కథతో ‘ఇండియన్ 3’ కూడా ఎనౌన్స్ చేసి- ఏకకాలంలో ‘ఇండియన్2’, ‘ఇండియన్ 3’ కూడా పూర్తి చేసే పనులు చేపట్టడం. ఇవి పూర్తి చేయడమే కాదు, పూర్తిచేసి రెండూ 2024 లో విడుదల చేసి, అప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సంగతి చూస్తాననడం. దాని విడుదలని 2025 లోకి నెట్టేయడం.

‘ఇండియన్2’, ‘గేమ్ ఛేంజర్’ రెండు సినిమాలనే బ్యాలెన్సు చేయడంలో విఫలమైన శంకర్, ‘ఇండియన్3’ ని కూడా తలకెత్తుకోవడంతో ఈ మూడు సినిమాలకి ఏం న్యాయం చేస్తాడో తనకే తెలియాలి. రెండు సినిమాల పనిని బ్యాలెన్స్ చేస్తానని మేకర్స్ ఇద్దరినీ ఒప్పించిన శంకర్, అలా చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇది చాలనట్టు మూడో సినిమాతో ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. దీంతో రామ్ చరణ్, దిల్ రాజులు బాగా నష్టపోతున్నారు. ఎన్టీఆర్ తో తను నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ పెను సంచలనం తర్వాత వెంటనే ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలన్న రామ్ చరణ్ ఆశలు వమ్ముయాయ్యాయి. దిల్ రాజు జీ5 తో అన్ని భాషల నాన్-థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం రూ. 250 కోట్లకి చేసుకున్న ఒప్పందం ప్రమాదంలో పడింది.

వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ ని 2023లోనే విడుదలకి ప్లాన్ చేశారు. ‘ఇండియన్2’ కారణంగా షూటింగ్ వాయిదాలు పడుతూ వుండడంతో విడుదలని 2024 జనవరికి మార్చారు. ఇక మధ్యలో ‘ఇండియన్3’ రావడంతో ఇది కూడా క్యాన్సిల్ అయి విడుదల ఇక 2025 లోనే అనే పరిస్థితి వచ్చింది.

అయితే ‘గేమ్ ఛేంజర్’ తో జరుగుతున్న జాప్యం ప్రభావం రామ్ చరణ్ ‘ఉప్పెన’ దర్శకుడికి ఓకే చెప్పిన కొత్త ప్రాజెక్టు మీద పడుతోంది. దీంతో రామ్ చరణ్ శంకర్ కి డెడ్ లైన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో ‘గేమ్ ఛేంజర్’ ని ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలతో శంకర్ ఇరకాటం ఇంతా అంతా కాదు. మళ్ళీ తాజా సమాచారం ప్రకారం, శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘ఇండియన్ 3’ షూటింగ్‌లో వైజాగ్‌లో బిజీగా వున్నట్టు తెలుస్తోంది.

శంకర్ తీస్తున్న మూడు సినిమాల స్క్రిప్టులైనా మార్క్ చేసి వేర్వేరుగా క్యారీ చేస్తున్నాడా, లేక ఒక సినిమా షూటింగుకి ఇంకో స్క్రిప్టులో సీన్లు వాడేస్తున్నాడా అని సామాన్యుడికి ధర్మ సందేహం వస్తోంది.

First Published:  22 Nov 2023 12:15 PM IST
Next Story