నాకు మళ్లీ పుట్టినట్టుంది.. కల్యాణ్ రామ్
బింబిసార సినిమా సక్సెస్ తో కల్యాణ్ రామ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తనకు మళ్లీ పుట్టిన ఫీలింగ్ కలిగిందని చెబుతున్నాడు.
లాంగ్ గ్యాప్ తర్వాత సక్సెస్ అందుకున్నాడు కల్యాణ్ రామ్. ఎంతో నమ్మి తీసిన బింబిసార సినిమా హిట్టవ్వడంతో ఈ హీరో ఊపిరి పీల్చుకున్నాడు. తన సినిమా బాగుందని సినీ ప్రముఖులంతా మెచ్చుకుంటుంటే, మళ్లీ జన్మించినట్టుందని స్పందించాడు ఈ నందమూరి హీరో.
''2020 మార్చిలో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. కొన్ని రోజులకే పాండమిక్ కారణంగా లాక్ డౌన్ పడింది. తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశాం. మళ్లీ సెకండ్ వేవ్ అన్నారు. నేనైతే నెర్వస్ ఫీలయ్యాను. నాకైతే కొత్త జోనర్. విజువల్స్ మీద కాన్‌సన్‌ట్రేట్ చేసి పెద్ద సినిమా చేస్తున్నాం. ఏమవుతుందోనని టెన్షన్‌లో ఉన్నాను. లక్కీగా అన్నీ ఓపెన్ అయ్యాయి. సినిమా పూర్తయ్యింది. మే ఎండింగ్, జూన్ నెలల్లో మళ్లీ జనాలు థియేటర్‌కు రావటం లేదని మళ్లీ మొదలు పెట్టారు. మళ్లీ టెన్షన్ మొదలైంది. అయితే మంచి కంటెంట్ సినిమాను తీసి ప్రేక్షకుల ముందు పెడితే వాళ్లు బ్రహ్మరథం పడతారని నమ్మాను. అదే నిజమైంది. సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ జన్మించినట్లు అనిపించింది.''
ఇంత మంచి కథను తనకు ఇచ్చిన వశిష్టకు ధన్యవాదాలు తెలిపిన కల్ాణ్ రామ్.. సినిమాను చూసి నమ్మి డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు, శిరీష్ కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనముంటూనే ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు మనసారా కృతజ్ఞతలు తెలిపాడు.
అయితే సినిమా హిట్టయినా కల్యాణ్ రామ్ కు ఏం మిగల్లేదనేది ఇన్ సైడ్ టాక్. 40 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ కింద కేవలం 13 కోట్ల రూపాయలకే అమ్మేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటు నాన్-థియేట్రికల్ రైట్స్ తో కలిపి పెట్టిన బడ్జెట్ ను మాత్రం వెనక్కు రాబట్టుకోగలిగాడు కల్యాణ్ రామ్.
ఇంకా చెప్పాలంటే బింబిసార హిట్ కల్యాణ్ రామ్ ఖాతాలోకి వెళ్లింది. కలెక్షన్లన్నీ దిల్ రాజు-శిరీష్ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఈ సినిమా సీక్వెల్ తో కల్యామ్ రామ్ కు లాభాలు వచ్చే అవకాశం ఉంది.