Telugu Global
Cinema & Entertainment

కృష్ణంరాజు గురించి కైకాల మాటల్లో..

కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ. కృష్ణంరాజు కన్నుమూయడంతో కళామతల్లి బాధపడుతోందన్నారు.

కృష్ణంరాజు గురించి కైకాల మాటల్లో..
X

రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌజ్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఆ తర్వాత ప్రభాస్ సోదరుడు ప్రభోద్, కృష్ణంరాజుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కృష్ణంరాజు లేని లోటుపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మరో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు కైకాల.

"అవి ద్రోహి సినిమా రిలీజ్ అయిన రోజులు. ఆ సినిమా చూస్తున్న సమయంలో కృష్ణంరాజు గారికి డబ్బింగ్ చెప్పింది ఎవరై ఉంటారు? అని నాకు అనుమానం కలిగింది. సహజంగా నాకు అన్న ఎన్టీఆర్ గారి వాయిస్ తప్ప మరొకరి వాయిస్ నచ్చదు. అలాంటిది ఆయన తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టి పడేసింది. సుదీర్ఘ కవితలను, డైలాగులను అలవోకగా చాలా స్పష్టంగా పలుకుతున్నారు. అది విని పక్కనే కూర్చున్న అల్లు రామలింగయ్యతో 'ఏమయ్యా లింగయ్య.. ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరయ్యా ? ఎవరో గానీ, అన్న గారిలా బాగా రౌద్రంగా చెబుతున్నారు.. ఎవరు?' అని ఆతృతగా అడిగితే సొంత డబ్బింగ్ అని చెప్పారు. అది విని ఆశ్చర్యపోయాను, సినిమా అయిపోయాక వెంటనే ఆయనను కలిసి 'ఏమయ్యా ఇంత అద్భుతంగా డైలాగులు చెబుతున్నావ్.. నువ్వు మరిన్ని చిత్రాల్లో నటించాలి' అని అంటే.. ఆ మాటకు ఆయన నవ్వుతూ.. 'అంటే.. ఇప్పుడు నన్ను మీకు కూడా క్యారెక్టర్స్ లేకుండా చేయమంటారా ?' అంటూ నవ్వేశారు. అలా మొదలైన మా పరిచయం మారణ హోమం, ప్రేమ తరంగాలు, అమర దీపం, బొబ్బిలి బ్రహ్మన్న, రావణ బ్రహ్మ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో భాగమయ్యేలా చేసింది. ఆయన లాంటి నటుడిని దూరం చేసుకుని కళామతల్లి బాధపడుతుంది. ఆయన కన్నుమూయడం తెలుగు సినీ జగత్తుకే కాదు మా అందరికీ తీరని లోటు."

ఇలా కృష్ణంరాజును తొలిసారి కలిసిన ఘటనను గుర్తుచేసుకున్నారు కైకాల. వయసులో కృష్ణంరాజు కంటే కాస్త పెద్ద కైకాల. అయినప్పటికీ తామిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు.




First Published:  12 Sept 2022 5:01 PM IST
Next Story