Telugu Global
Cinema & Entertainment

Kabzaa Movie: ఒడిశాలో పాగా వేస్తున్న కన్నడ పానిండియా?

Kabzaa Movie: కన్నడ సినిమా రంగం ఇక ఒడిశానీ కబ్జా చేయబోతోందా? అవుననే చెప్పాలి. డిసెంబర్ 22 న పాన్-ఇండియా కన్నడ మూవీ ‘కబ్జా’ తో ఈ పని చేయబోతోంది.

Kabzaa Movie: ఒడిశాలో పాగా వేస్తున్న కన్నడ పానిండియా?
X

Kabzaa Movie: ఒడిశాలో పాగా వేస్తున్న కన్నడ పానిండియా?

కన్నడ సినిమా రంగం ఇక ఒడిశానీ కబ్జా చేయబోతోందా? అవుననే చెప్పాలి. డిసెంబర్ 22 న పాన్-ఇండియా కన్నడ మూవీ 'కబ్జా' తో ఈ పని చేయబోతోంది. ఇక ఒడిశా దద్దరిల్లుతుంది. కోటి రూపాయలలోపు బడ్జెట్ తో తీసే చిన్న చిన్న ఒడియా సినిమాలతో అక్కడి ప్రేక్షకులు విసుగెత్తిపోయి వున్నారు. ఆర్ట్ సినిమాలకి పేరెన్నికగన్న ఓలీవుడ్ కమర్షియల్ సినిమాలు తీస్తున్నా, పరిమిత మార్కెట్ కి లోబడి లోబడ్జెట్ సినిమాలుగానే తీస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 18 ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీస్తూ వస్తున్నారు. ప్రాంతీయ సినిమాలంటే వాస్తవిక సినిమాలనే పేరుంది. ఆ ప్రాంతాల్లో ప్రేక్షకులు ఇవే చూస్తూ వచ్చారు.

ఐతే 2000 సంవత్సరం నుంచి కొత్త తరం దర్శకులతో వాస్తవిక సినిమాలు పక్కకెళ్లి పోయి, యువతరాన్ని ఆకర్షించే ఆఫ్ బీట్ సినిమాల ట్రెండ్ మొదలైంది. వీటిలో రోమాంటిక్ సినిమాలే ఎక్కువ. ఒడియా, అస్సామీ, బెంగాలీ, నాగపురీ, మణిపురీ, ఛత్తీస్ ఘరీ, సంతాలీ, ఖాసీ, మైథిలీ, కాశ్మీరీ ... ఇలా ప్రాంతీయ సినిమాలు ఆఫ్ బీట్ సినిమాలుగా మారినా లాభం లేకపోయింది. ఎందుకంటే భారీ బడ్జెట్ల, సూపర్ స్టార్ల, కళ్ళు మిరుమిట్లు గొలిపే కమర్షియల్ బాలీవుడ్ సినిమాలు ముంచెత్తాయి. ప్రేక్షకులు వీటి వెంటపడ్డారు. ఇది చాలనట్టు సౌత్ సినిమాలు ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలెట్టాయి.

ఒడిశా ప్రాంతీయ చలన చిత్ర పరిశ్రమ ఓలీవుడ్ సౌత్ సినిమాల తాకిడితో విలవిల్లాడ్డం మొదలెట్టింది. క్లిష్ట పరిస్థితిలో కూడా థియేటర్ల యాజమాన్యాలు ఒడియా సినిమాల్ని విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా, ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాలు చూడకుండా వెనుదిరుగుతున్నారు. ఇలాకాదని సౌత్ సినిమాల నుంచి కథల్ని కాపీకొట్టి, హంగూ ఆర్భాటలతో కమర్షియల్ గా తీస్తున్నా- టీవీల్లో సౌత్ డబ్బింగులే ఒరిజినల్ గా వస్తూంటే వాటి డూప్లికేట్లు ఎవడు చూస్తాడని ఆడి పోసుకుంటున్నారు. తెలుగు తమిళ డబ్బింగ్ సినిమాలు ఒడిశా టీవీల్లో ప్రసారం చేయడం సొమ్ములు కురిపిస్తోంది.

ఇది గమనించి సౌత్ సినిమాల విడుదల రాత్రి లేదా సాయంత్రం షోలకి పరిమితం చేస్తూ వచ్చారు. డబ్బింగ్ సాధ్యంకాక అనేక దక్షిణాది సినిమాలు వాటి అసలు భాషల్లో విడుదల చేస్తూ కూడా వచ్చారు. అయితే ఒడియా భాషలో డబ్ చేసిన సౌత్ సినిమాలు టెలివిజన్ ఛానెళ్ళలోనే ప్రసారం కావడంతో థియేటర్లలో ఇవి కూడా ఆడకుండా పోయాయి. ఇక ఒడియా ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోయి సౌత్ డబ్బింగులకి బానిసలైపోయారు. సౌత్ సినిమా మసాలాల రుచే వేరు. మహేష్ బాబు, పవ కళ్యాణ్, అల్లుఅర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, కార్తీ, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య, అజిత్...ఒడియా మాట్లాడుతూ చేసే వీర హీరోయిజాలే వేరు!

దీంతో అయిపోలేదు, అసలు కథ ఇప్పుడు మొదలైంది. పుష్ప: ది రైజ్, ట్రిపులార్, కేజీఫ్: చాప్టర్ 2, 777 చార్లీ, విక్రమ్, కాంతారా, సర్దార్ అంటూ పానిండియా సినిమాలు దేశాన్ని వూపేస్తూ ఒడిశాని కూడా ఓ పట్టుబట్టాయి. దీంతో ఒడిశా ప్రేక్షకులు ఇక పానిండియా సినిమాలే చూస్తామని భీష్మించుకున్నారు. పెద్ద చేప వచ్చి చిన్న చేపల్ని మింగేసినట్టు తయారైంది ఒడిశా ప్రాంతీయ చలన చిత్ర పరిశ్రమ పరిస్థితి.

ఇది గమనించారు కన్నడ తాజా పానిండియా 'కబ్జా' మేకర్లు. అయితే కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనే ఎందుకు- ఒడియాలో ఇంకోటి పడేస్తే, పనిలోపనిగా మరాఠీలో కూడా కబ్జా పెడితే సరిపోతుందని 'కబ్జా' ని 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు! పానిండియా అంటే ఈస్టిండియాలాగా సామ్రాజ్య విస్తరణే!

ఇంతకీ ఏమిటీ 'కబ్జా' అంటే, కన్నడ స్టార్లు ఉపేంద్ర - కిచ్చా సుదీప్ లు నటించిన భారీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా. 1947లో ఒక మహాత్మాగాంధీ అనుచరుడు, ఇంకో స్వాతంత్ర్య సమరయోధుడి కాల్పనిక కథ ఇది. అనివార్య పరిస్థితుల కారణంగా స్వాతంత్ర్య సమర యోధుడి కొడుకు మాఫియా ప్రపంచంలో చిక్కుకునే ఈ కథాకాలం 1942-1986 మధ్య కాలంలో వుంటుంది. ఆర్ చంద్రు దర్శకుడు. ఇలా సౌత్ సినిమాల ఆధిపత్యం కొనసాగుతున్నందున స్థానిక పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రేక్షకులు మాత్రం డిసెంబర్ 22న 'కబ్జా' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టీజర్ కి ఫిదా అయిపోయారు.

First Published:  16 Nov 2022 7:59 AM GMT
Next Story