వారంలో 100 కోట్ల క్లబ్ తో కన్నడ సినిమా సంచలనం!
కొత్త సంవత్సరం కన్నడ సినిమా బంపర్ బోణీ చేసింది. కలెక్షన్స్ లో కనీవినీ రికార్డులు సాధిస్తోంది. ఒక మీడియం బడ్జెట్ సినిమా ఈ యెత్తున బాక్సాఫీసు ప్రకంపనలు సృష్టించడం దేశవ్యాప్తంగా ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది.
కొత్త సంవత్సరం కన్నడ సినిమా బంపర్ బోణీ చేసింది. కలెక్షన్స్ లో కనీవినీ రికార్డులు సాధిస్తోంది. ఒక మీడియం బడ్జెట్ సినిమా ఈ యెత్తున బాక్సాఫీసు ప్రకంపనలు సృష్టించడం దేశవ్యాప్తంగా ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. ఆ సినిమా పేరు ‘కాటేరా’. ఇది డిసెంబర్ 29 న కన్నడ భాషలో మాత్రమే విడుదలైంది. విడుదలైన వారం రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసి ఆపకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన ‘కాటేరా’ మొదటి వారంలోనే శరవేగంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ మూవీ తొలిరోజే రూ. 19.79 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాల్ని ఉలిక్కిపడేలా చేస్తే, మలిరోజు కూడా రూ. 17.35 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఇంకా విజృంభించి రూ. 20.94 కోట్లకు పైగా చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 58 కోట్లు వసూలు చేసి, నాలగవ రోజైన కొత్త సంవత్సరం జనవరి 1 సోమవారం కూడా తగ్గకుండా మరో రూ. 18.26 కోట్లు వసూలు చేసింది. ఇలా వారాంతం తర్వాత కూడా బలమైన రెస్పాన్స్ ఇచ్చింది.
ఐదవ రోజు మంగళవారం రూ. 9.24 కోట్లు, ఆరో రోజు బుధవారం రూ. 9.78 కోట్లు చేసి మొత్తం ఆరు రోజులకు రూ. 95.36 కోట్లు రాబట్టింది. ఈరోజు (గురువారం) ఏడో రోజు వసూళ్ళు రూ. 8 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఏడు రోజుల్లోనే వంద కోట్ల ప్లస్ రాబడుతున్నట్టు. ఇలా కర్నాటకలో మాత్రమే పెను దుమారం సృష్టిస్తున్న ‘కాటేరా’ సినిమా ఫారిన్ ఆడియన్స్ ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కర్ణాటకలో మాత్రమే విడుదలైన ఈ సినిమాని డబ్ చేసి ఇతర భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే యూఏఈ, ఆస్ట్రేలియా, యూఎస్‌లలో ఈ రోజు నుంచే కన్నడ వెర్షన్ ని ప్రదర్శిస్తున్నారు.
2022 లో ‘కాంతారా’ మీడియం బడ్జెట్ మూవీ కూడా ఇలాగే వసూళ్ళ దుమారం రేపింది. ఇప్పుడు ‘కాటేరా’ 72 మల్టీప్లెక్సుల్లో, 406 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో విడుదలై ఏడు రోజుల్లో 52.77 లక్షల టిక్కెట్ల అమ్మకాలు చేసింది. ఇది విభిన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ భాషాపరమైన అవరోధాల్ని అధిగమించింది. రైతు-కేంద్రీకృత వాస్తవ సంఘటనల్ని హైలైట్ చేస్తూ ఈ సినిమా కథ వుంటుంది.
భూస్వాములు రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన 1970ల కాలంలో ఈ కథ సాగుతుంది. అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ నాయకత్వంలో భూసంస్కరణల చట్టం, అణగారిన ప్రజలకి ఒక ఆశాకిరణాన్ని అందించింది. కానీ అత్యాశగల జమీందార్లు వేరే ప్రణాళికలతో వున్నారు. ఈ నేపథ్యంలో కాటేరా (హీరో దర్శన్) అనే కమ్మరి కులస్థుడుడు కుల వివక్షపై పోరాడి, క్రూరమైన భూస్వాముల బారి నుంచి ప్రజల్ని రక్షించుకునే కథతో ఈ సినిమా సాగుతుంది.
ఇది సాంప్రదాయ మాస్ ఫార్ములాలకి దూరంగా వుంటుంది. మాస్ హీరో సినిమాల టెంప్లేట్ లోనే మాస్ ఇంట్రడక్షన్, హై-ఎనర్జీ ఫైట్‌లు, ఎమోటివ్ సాంగ్స్ తో కలిపి వండిన కమర్షియల్ ఇది. అలనాటి నటి మాలాశ్రీ కుమార్తె ఆరాధన హీరోయిన్ గా ఈ సినిమా ద్వారా పరిచయమవుతోంది. టాలీవుడ్ నటుడు జగపతి బాబు భూస్వామి పాత్ర పోషిస్తే, శృతి, కుమార్ గోవింద్, వైజ్యనాథ్ బిరాదర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రాక్ లైన్ వెంకటేష్ దీన్ని రూ. 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.