Telugu Global
Cinema & Entertainment

జియో సినిమా - డిస్నీ+హాట్ స్టార్ ఒకటై వచ్చేస్తున్నాయ్!

ఓటీటీ రంగంలో జియో సినిమా-డిస్నీ+హాట్ స్టార్ రెండూ ఒకటైతే జరిగే విస్ఫోటనం మామూలుగా వుండదు.

జియో సినిమా - డిస్నీ+హాట్ స్టార్ ఒకటై వచ్చేస్తున్నాయ్!
X

ఓటీటీ రంగంలో జియో సినిమా-డిస్నీ+హాట్ స్టార్ రెండూ ఒకటైతే జరిగే విస్ఫోటనం మామూలుగా వుండదు. ఒకేసారి 233 మిలియన్ల (23 కోట్ల 3 లక్షలు) మంది చందాదారులు ఈ గ్రూపు చేతిలో కొచ్చేస్తారు. ఈ స్థాయి భారీ సమీకరణ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు. వెనక్కి తిరిగి చూసుకుంటే, 2007 జనవరి ప్రపంచవ్యాప్తంగా మీడియా పరిశ్రమకి నిర్ణయాత్మక నెల. నెట్‌ఫ్లిక్స్ కంపెనీ వీడియో స్ట్రీమింగ్ సేవల్ని ప్రారంభించినప్పుడు, భౌతిక ప్రపంచం కంటే ఇంటర్నెట్ ప్రపంచం మరింత శక్తివంతంగా, ఒక వరంగా వుండబోతుందని పందెం కాసింది. 16 ఏళ్ళ తర్వాత ఇదిప్పుడు దానికే సవాలుగా మారి ఎదురు నిలిచింది. జియో సినిమా-డిస్నీ+హాట్ స్టార్ విలీనం దిగ్గజాలకే దిగ్గజమై అవతరించింది.

వినోద రంగంలో భారతదేశంలో అతిపెద్ద విలీనానికి ఒక అడుగు ముందుకు వేస్తూ, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ కంపెనీ - డిస్నీ స్టార్ గత వారం లండన్‌లో నాన్-బైండింగ్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్, డిస్నీ ల మధ్య మెగా-విలీనం ఫిబ్రవరి 2024 లో ఖరారవుతుంది. రిలయన్స్-డిస్నీ విలీనం భారతదేశంలో వినోద వీక్షణానుభవాన్ని పూర్తిగా మార్చగలదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా వీక్షించే క్రీడ - క్రికెట్ విషయానికొస్తే ఇది మహావృక్షమై అవతరిస్తుంది.

ఈ ఒప్పందాన్ని భారతదేశం ఇప్పటి వరకూ చూడని అతిపెద్ద వినోద రంగ విలీనంగా భావిస్తున్నారు. సమాన సంఖ్యలో డైరెక్టర్లతో విలీనమైన ఈ సంస్థలు సమాన నియంత్రని కలిగి వుంటాయి. విలీన సంస్థలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ మెజారిటీ వాటాదారుగా 51 శాతంతో వుంటే, వాల్ట్ డిస్నీ 49 శాతం వాటాతో వుంటుంది.

ఈ ఒప్పందంలో భాగమయ్యే రిలయన్స్ కి చెందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియో సినిమా - డిస్నీ + హాట్‌స్టార్ లలో హాట్‌స్టార్ నష్టాలతో కుంగిపోతూనే వున్నందున విలీనం చేయడం ద్వారా దాన్ని మెరుగుపరిచేందుకు సరంగం సిద్ధం చేశారు. ఈ రెండు సంస్థలూ ఈ ఒప్పందంలో 1.5 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. దీని కింద అంబానీ సంస్థ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా ఛానెల్‌ల పంపిణీ నియంత్రణని పొందుతుంది. ఈ ఒప్పందం టీవీ ఛానెల్స్ కి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకి మించి విస్తరిస్తుంది, ముఖ్యంగా క్రికెట్ సీజన్‌లో ప్రకటనల శక్తిపై దృష్టి సారిస్తుంది.

డిస్నీకి ఇండియా వ్యాపారంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్, ఎనిమిది భాషల్లో 70-ప్లస్ టీవీ ఛానెల్‌ల రూపంలో ఒక ముఖ్యమైన టీవీ వ్యాపారంతో బాటు ఫిలిమ్ స్టూడియో కూడా వున్నాయి. రిలయన్స్ ప్రసార విభాగం వయాకామ్ 18 ఎనిమిది భాషల్లో 38 టీవీ ఛానెల్‌లు, వీడియో ఓటీటీ యాప్ జియో సినిమాతో బాటు వయాకామ్ 18 స్టూడియోని కలిగి వుంది.

ఇక ఓటీటీ చందాదారుల విషయానికొస్తే, డిస్నీ+ హాట్‌స్టార్ దాదాపు 40 మిలియన్ల సబ్‌స్క్రైబర్ బేస్ తో ఇప్పటికీ దేశంలోనే అతిపెద్దది. జియో తో కలిస్తే 300-350 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్‌లని కలిగి వుండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలోని యూట్యూబ్ కున్న 470 మిలియన్ వ్యూవర్స్ బేస్ ని సవాలు చేస్తుంది. అంతేకాకుండా, గ్రూప్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కి చెందిన 450 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌ల మద్దతుని జియోసినిమా తీసుకువస్తుంది.

ఈ విలీనంతో వాల్ట్ డిస్నీ కంపెనీ డిస్నీ+ ఒరిజినల్‌లు, దాని విస్తారమైన లైబ్రరీ కంటెంట్‌ ని కవర్ చేసే ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ వీడియో-ఆన్-డిమాండ్ కంటెంట్ నీ ఐదేళ్ళ లైసెన్స్ తో విలీన సంస్థకి అధికారం ఇస్తుంది. పంపిణీ ఛానెల్స్ కి, జియో ప్లాట్‌ఫారమ్‌లకూ యాక్సెస్ జాయింట్ వెంచర్‌ కి అందుబాటులో వుంటాయి.

డిస్నీ+ హాట్‌స్టార్, భారతదేశపు అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయినప్పటికీ, చందాదారుల్ని నిలుపుకునేందుకు కష్టపడుతోంది. 2023 సెప్టెంబరు 30 నాటికి ఆల్ -టైమ్ కనిష్ట స్థాయి 37.6 మిలియన్లకి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, జియో సినిమా 2023 జూన్ 30 నాటికి గణనీయమైన 221 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారుల్ని కలిగి వుంది. అయితే వీరిలో ఎంత మంది చెల్లింపు వినియోగదారులు వున్నారనే సమాచారం లేదు. జియోసినిమా- డిస్నీ+ హాట్‌స్టార్‌లని కలిపి విలీనం కార్యరూపం దాల్చినట్లయితే , ఏకీకృత ప్లాట్‌ఫారమ్ 258.6 మిలియన్ల వినియోగదారుల సంఖ్యను కలిగి వుంటుంది . ఈ విలీనం భారతీయ వీడియో స్ట్రీమింగ్ రంగంలో కొత్త గుత్తాధిపత్యానికి దారి తీస్తుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, సోనీలివ్, జీ5 ఇంకా ఇతర ప్రధాన ప్లేయర్స్ కి గట్టి పోటీనిస్తుంది. ఈ విలీనం భారతీయ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్‌ కి సవాళ్ళతో పాటు అవకాశాల్ని కూడా అందిస్తుంది. గుత్తాధిపత్యం గురించిన ఆందోళనలు సబబే న్నప్పటికీ, ఓటీటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. భారతీయ స్ట్రీమింగ్ రంగం భవిష్యత్తు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం, విభిన్న కంటెంట్‌ ని ప్రోత్సహించడం, వీక్షకుల ప్రయోజనాలని పరిరక్షించడం మధ్య సమతుల్యతపై ఆధారపడి వుంటుంది.

First Published:  26 Dec 2023 11:00 AM GMT
Next Story