ఒకే రోజు జైలర్ తో జైలర్ ఢీ!
ఆగస్టు 10న ఒకే టైటిల్ గల రెండు సినిమాలు 'జైలర్' వర్సెస్ 'జైలర్' గా పోరుకి సిద్ధమవుతున్నాయి. సక్కీర్ మదతిల్ దర్శకత్వం వహించిన మలయాళ 'జైలర్', రజనీకాంత్ నటించిన తమిళ 'జైలర్'తో థియేటర్లలో ఢీకొనబోతోంది.
ఆగస్టు 10న ఒకే టైటిల్ గల రెండు సినిమాలు 'జైలర్' వర్సెస్ 'జైలర్' గా పోరుకి సిద్ధమవుతున్నాయి. సక్కీర్ మదతిల్ దర్శకత్వం వహించిన మలయాళ 'జైలర్', రజనీకాంత్ నటించిన తమిళ 'జైలర్'తో థియేటర్లలో ఢీకొనబోతోంది. ఈ ఘర్షణ ఊహించనిది. ఈ ఘర్షణ భారాన్ని దర్శకుడు సక్కీర్ మదతిల్ మోస్తున్నాడు. రజనీకాంత్ 'జైలర్' సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడంతో, దానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంతో, సక్కీర్ సినిమా అయోమయంలో పడింది. గత కొన్ని వారాలుగా రజనీకాంత్ 'జైలర్' సినిమాపై సక్కీర్ నిరసన వ్యక్తం చేస్తూనే వున్నాడు. కేరళ థియేటర్ల యజమానులు తన సినిమాని తిరస్కరిస్తున్నారని సక్కీర్ ఆరోపించాడు. ఈ గొడవవల్లే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఈ వివాదం మద్రాసు హై కోర్టు కెక్కింది.
2021లో సక్కీర్ 'జైలర్' అనే టైటిల్ ని రిజిస్టర్ చేశాడు. మలయాళంలో సినిమా టైటిల్‌ని మార్చమని రజనీకాంత్ 'జైలర్' ప్రొడక్షన్ హౌస్ అయిన సన్ పిక్చర్స్ ని కూడా అభ్యర్థించాడు. అతడి విజ్ఞప్తి ఫలితమివ్వలేదు. ఇప్పుడు రజనీకాంత్ 'జైలర్' కి ఎక్కువ థియేటర్లు కేటాయించారని, తన సినిమాని తిరస్కరించారనీ వెల్లడించాడు.
ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సక్కీర్ తన ఇల్లు, కుమార్తె నగలు తనఖా పెట్టి ఈ ప్రాజెక్టులో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు తెలిపాడు. రజనీకాంత్ సినిమా తర్వాత తన సినిమా విడుదల చేస్తే ప్రయోజనం వుండదని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో, రజనీకాంత్ సినిమాతో పాటు సినిమాని కూడా విడుదల చేయవలసి వచ్చిందనీ చెప్పాడు.
అసలు జూలై వరకూ ‘జైలర్’ అనే మలయాళ సినిమా వుందని చాలామందికి తెలియదు. అయితే జూలై 16న మలయాళ ‘జైలర్’ నిర్మాత సక్కీర్ టైటిల్ విషయంలో తమిళ సినిమా ‘జైలర్’ మేకర్స్ సన్ పిక్చర్స్ తో గొడవకి దిగాడు. ప్రేక్షకులు గందరగోళానికి గురికాకుండా వుండేందుకు తమిళ ‘జైలర్’ టైటిల్ ని మార్చి మలయాళంలో విడుదల చేయాలని సక్కీర్ అభ్యర్థించారు. తనది చిన్న సినిమా అయినందున, ఇప్పటికే నష్టాల్లో వున్నందున, తన సినిమా టైటిల్ ని మార్చలేనని విన్నవించుకున్నాడు. పైగా తమిళ ‘జైలర్’ లో మలయాళ బిగ్ స్టార్ మోహన్‌లాల్ కూడా నటిస్తున్నందున, ‘జైలర్’ అనే టైటిల్‌తో మలయాళంలో సినిమాని విడుదల చేయడం అన్యాయమనీ సక్కీర్ వాదించాడు. అయితే సన్ పిక్చర్స్ ఈ వాదనని న తిరస్కరించింది.. దీంతో సక్కీర్ హై కోర్టుని ఆశ్రయించాడు. తీర్పు రావాల్సి వుంది.
విశేషమేమిటంటే, రెండు జైలర్లూ పానిండియా విడుదలలే. ఇది సక్కీర్ ని మరింత ఇరుకున పెట్టేస్తోంది. అయితే ఈ రెండిటికి ఒకదానికొకటి పోలిక లేదని, కథాంశాలు పూర్తిగా భిన్నంగా వున్నాయని గమనించాలి. తమిళ ‘జైలర్’ డార్క్ కామెడీ థ్రిల్లర్ అయితే, ఇందులో రజనీకాంత్ జైలు అధికారిగా కనిపిస్తాడు. మలయాళ ‘జైలర్’ పీరియాడికల్ థ్రిల్లర్. కథ 1956-57 సంవత్సరంలో జరుగుతుంది.
తమిళ ‘జైలర్’ లో రజనీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, తమన్నా భాటియా, రమ్య కృష్ణన్, యోగి బాబు, వినాయకన్ నటించారు. ఇలా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, తెలుగు నటీనటులు ఇందులో నటించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళ జైలర్ విడుదల రోజునే మలయాళ జైలర్ విడుదల చేయడం మలయాళ జైలరే నష్టపోతుందని తమిళ స్టార్ కాస్ట్ ని చూస్తూంటే అనిపించవచ్చు. కానీ మలయాళ ‘జైలర్’ దర్శకుడు సక్కీర్ మదతిల్ మాత్రం తాను రూపొందించిన కంటెంట్‌పై నమ్మకంతో వుంటే, రజనీకాంత్ నటించిన సినిమా విడుదలైన రోజునే తన సినిమాని విడుదల చేయడానికి ఏమాత్రం వెనుకాడనవసరంలేదు.
మలయాళ ‘జైలర్’ లో ధ్యాన్ శ్రీనివాస్, దివ్యా పిళ్ళై నటించారు.