Telugu Global
Cinema & Entertainment

ఇక ఓటీటీల ఏకీకరణే మార్గమా?

దేశంలో 50 కి పైగా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లున్నాయన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య ఇంకే పెరిగే దిశగా మార్కెట్ విస్తరిస్తూనే వుంది. అయితే ఈ విజృంభిస్తున్న స్ట్రీమింగ్ మార్కెట్ ఎదుట ఒకటే సమస్య వుంది.

ఇక ఓటీటీల ఏకీకరణే మార్గమా?
X

దేశంలో 50 కి పైగా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లున్నాయన్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య ఇంకే పెరిగే దిశగా మార్కెట్ విస్తరిస్తూనే వుంది. అయితే ఈ విజృంభిస్తున్న స్ట్రీమింగ్ మార్కెట్ ఎదుట ఒకటే సమస్య వుంది. ఈ సమస్య రెండు దిగ్గజ ఓటీటీలనే కాదు, మిగతా దేశీయ ఒటీటీలకూ, మరింకా ప్రాంతీయ భాషల ఓటీటీల మనుగడకూ సవాలుగా నిలుస్తోంది. ఈ పరిస్థితి ఇటీవలి జియో సినిమా- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల విలీనం కారణంగా తలెత్తుతోంది. ప్రారంభ పరిశీలనలు కేవలం రెండు ఓటీటీ దిగ్గజాలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ విదేశీ కంపెనీల కార్యకలాపాలకే నష్టాదాయకమని సూచిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న ప్రాంతీయ ఓటీటీలు సహా అన్ని దేశీయ ఓటీటీలూ మూకుమ్మడిగా ఈ సమస్య కింద నలిగిపోతాయని మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు. మరికొందరు మార్కెట్ ఇక ఏకీకరణకి పరిపక్వం చెందిందని అంటున్నారు.

మార్కెట్ లో పెద్ద ఆటగాళ్ళు కొత్త వృద్ధి అవకాశాల కోసం చూస్తున్నారనీ, చిన్న ఆటగాళ్ళు మనుగడకై తాజా నిధుల కోసం ఆరాటపడుతున్నారనీ అంటున్నారు. నిపుణుల వర్గం అభిప్రాయంలో, చిన్న ఆటగాళ్ళు నష్టా లెదుర్కొంటున్నప్పటికీ, తమ మాతృ సంస్థల నుంచి రెగ్యులర్ ఫండ్ ఇంజెక్షన్‌ల కారణంగా ఇప్పటి వరకూ కార్యకలాపాలని నెట్టుకొస్తు

న్నారు. ఇకపైన నోరు తెరచుకున్న జియో -డిస్నీ పళ్ళకింద చిన్న ఆటగాళ్ళు చిక్కి కంటెంట్ కి, మార్కెటింగ్ కి, వినియోగదారుల సముపార్జనకూ అధిక మూలధన అవసరాల కారణంగా వ్యాపారం నుంచి బయటికి వెళ్ళే ప్రమాదముంది.

అందువల్ల చిన్న ఓటీటీలు- అంటే, ప్రాంతీయ భాషల ఓటీటీల ఎదుట రెండు మార్గాలున్నాయి: పెద్ద ఓటీటీలకు అమ్ముడుపోవడం లేదా ఆదాయాన్ని మించి ఖర్చులు కొనసాగుతున్నందున, పెరుగుతున్న నష్టాల కారణంగా దుకాణాన్ని మూసివేయడం. ముఖేష్ అంబానీ ఏ బ్రాండ్ తో ఏ మార్కెట్ లోకి పాదం మోపినా, చిన్నా పెద్దా ప్రత్యర్ధుల్ని ఖతంజేసి గానీ వూరుకోరనేది తెలిసిందే.

ఓటీటీ మార్కెట్ నిర్దిష్ట సంఖ్యలో ఆటగాళ్లకు మాత్రమే వీలు కల్పిస్తుంది కాబట్టి, ఓటీటీ పరిశ్రమలో ఏకీకరణ జరగాలని ఇంకో వాదం. మీడియా పార్టనర్స్ ఆసియా ప్రకారం, 2022లో 3 బిలియన్ల డాలర్లు ఆర్జించిన దేశీయ ఓటీటీ మార్కెట్, 2027 నాటికి దాదాపు 7 బిలియన్ల డాలర్లుగా రెండింతలు కంటే ఎక్కువగా వుంటుందని అంచనా వేసింది. అంటే ముఖేష్ అంబానీ ఈ అంకెలపై కన్నేసినట్టే. ఇక వూరుకుంటారా? సగటున ఒక సబ్‌స్క్రైబర్ 2.5 ఓటీటీలకి సబ్‌స్క్రయిబ్ చేస్తున్నారు. కాబట్టి ఈ కోణం నుంచి ఏకీకరణ జరగాలని వాదం. ఏకీకృతమంటే కొన్ని ఓటీటీలు దుకాణాన్ని మూసివేయవలసి వుంటుందని అర్ధం.

మానిటైజేషన్ సవాళ్ళతో పాటు, అధిక కంటెంట్ ఖర్చుల కారణంగా దేశంలో స్ట్రీమింగ్ అనేది డబ్బు దుబారా వ్యవహారంగా కొనసాగుతోంది. అందువల్ల ఇది చందాల ద్వారా డబ్బు ఆర్జించడం ఒక సవాలుతో కూడుకున్న పనిగా మారిన కాస్ట్ -సెన్సిటివ్ మార్కెట్ అయింది.

ప్రకటనల ద్వారా డబ్బు ఆర్జించడంలో కొన్ని ఓటీటీలు పురోగతి సాధించినప్పటికీ, రూ. 13,000 కోట్ల విలువైన డిజిటల్ వీడియో యాడ్ మార్కెట్‌లో యూట్యూబ్ ఆధిపత్య ప్లేయర్‌గా కొనసాగుతోంది.

స్టార్ ఇండియా -వయాకామ్ 18 విలీనం ప్రతిపాదిత విలీన సంస్థని ఓటీటీ పరిశ్రమలో లెక్కించ వీలైన శక్తివంతమైన శక్తిగా మారుస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు బలమైన ఓటీటీలు వరుసగా 333 మిలియన్లు, 95 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులతో వర్ధిల్లుతున్నాయి. దక్షిణ భారత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెట్టుబడులు అవసరం కాబట్టి నిధుల కోసం వెతుకుతున్నట్టు సమాచారం. కంపెనీ కొన్ని పార్టీలతో చర్చలు జరిపింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది.

ఇక బలమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, బెంగాలీ ఓటీటీ ‘హోయిచోయ్’ మార్చి 2023 నాటికి రూ. 28 కోట్ల వరకు పోగుపడిన నష్టాల కారణంగా దాని నెట్‌వర్త్ క్షీణించింది. అలాగే బాలాజీ టెలి ఫిలిమ్స్ యాజమాన్యంలోని ‘ఆల్ట్’, ఈరోస్ ఇంటర్నేషనల్ యాజమాన్యంలోని ‘ఈరోస్ నౌ’ ఓటీటీలు తీవ్రమైన నష్టాల కారణంగా తమ కార్యకలాపాల్ని ఇప్పటికే తగ్గించుకున్నాయి. జీ5 రూ. 800 కోట్లకు పైగా నష్టాలని నమోదు చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆధీనంలోని ‘నోవీ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్’ కూడా రూ. 748 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

స్ట్రీమింగ్ పరిశ్రమ పోటీ స్థాయిని, సామర్థ్యాన్ని సాధించడానికి ఏకీకరణే మార్గమని అంటున్నారు. జాతీయ స్థాయిని కోరుకునే ఓటీటీలు 8 నుంచి 10 భాషల్లో కంటెంట్‌ని అందించాలనీ, ప్రతి ఒక్క భాషకు చలనచిత్రాలు, సిరీస్‌లలో ఎప్పటికప్పొడు తాజా కంటెంట్ అవసరమవువుతుందనీ, దీనిని ఏకీకరణ ద్వారా మాత్రమే సాధించవచ్చనీ నిర్ణయానికి వచ్చారు.

స్టూడియో మోజో వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్ రామచంద్రన్ ప్రకారం, కొత్త పోటీ వాతావరణంలో జియోసినిమా -డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం అనేది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల ఆర్థిక శక్తితో సరిపోలడం చిన్న ప్లేయర్‌లకి కష్టంగా వున్నందున, ఇది దేశీయ ఓటీటీ మార్కెట్ ఏకీకరణని తప్పనిసరి చేస్తుంది.

First Published:  1 April 2024 5:26 PM IST
Next Story