Telugu Global
Cinema & Entertainment

ఐమాక్స్ క్రేజ్: ఇక పట్టణాలకూ ఐమాక్స్ థియేటర్లు

అమెరికాకు చెందిన ప్రఖ్యాత సినిమాటిక్ టెక్నాలజీ కంపెనీ ఐమాక్స్ కార్పొరేషన్ మనదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది.

ఐమాక్స్ క్రేజ్: ఇక పట్టణాలకూ ఐమాక్స్ థియేటర్లు
X

సినిమాల కోసం టూరింగ్ టాకీసులు చూశాం, సింగిల్ స్క్రీన్ థియేటర్లు చూశాం, సింగిల్ స్క్రీన్ 70 ఎంఎం స్టీరియో సౌండ్ థియేటర్లూ చూశాం; మల్టీప్లెక్సులు చూశాం, మల్టీప్లెక్స్ 4 డి ఎక్స్ చూశాం, వీటన్నిటినీ మించిన ఐమాక్స్ థియేటర్ల దగ్గరకొచ్చి ఆగాం. ఒకప్పుడు ఒకటీ అరా ఐమాక్స్ థియేటర్లు వుండేవి హైదరాబాద్ ప్రసాద్స్ సహా. వివిధ నగరాల్లో అవి పెరుగుతూ 25 కొచ్చాయి. ఇవి 100కి పెరిగే దిశగా పయనిస్తున్నాయి. కారణం, ప్రేక్షకుల డిమాండ్. ప్రేక్షకులు ఐమాక్స్ థియేటర్లకి అలవాటు పడుతున్నారు. డబ్బు సమస్య కాదు, ఐమాక్స్ లో సినిమా చూసే రాజసమైన అనుభవం ముఖ్యమంటున్నారు. ఈ డిమాండ్ ని, క్రేజ్ ని వాడుకుని ఐమాక్స్ థియేటర్లు నగరాల నుంచి పట్టణ బాట పట్టే రోజులు ఇంకెంతో దూరం లేవు!

అమెరికాకు చెందిన ప్రఖ్యాత సినిమాటిక్ టెక్నాలజీ కంపెనీ ఐమాక్స్ కార్పొరేషన్ మనదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ఐమాక్స్ థియేటర్లు వున్నాయి. ఐమాక్స్ థియేటర్స్ లో సువిశాలమైన పెద్ద స్క్రీన్‌లు, వాటికి తోడు అధునాతన సౌండ్ సిస్టమ్‌లు మెరుగైన చలనచిత్ర వీక్షణానుభవాన్ని అందిస్తున్నాయి. ఈ థియేటర్లు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ సినిమాల్ని, అలాగే ఐమాక్స్ ప్రదర్శన కోసం ఫార్మాట్ చేసిన దేశీయ సినిమాల్నీ ప్రదర్శించడానికి ప్రసిద్ధి చెందాయి.

ఈ సంవత్సరం బాక్సాఫీసు విజయాలు పెరిగిన దృష్ట్యా ఐమాక్స్ థియేటర్ల సంఖ్యని పెంచే దిశగా కంపెనీ అడుగులేస్తోంది. 2019 నుంచి చూస్తే దేశంలో ఐమాక్స్ వ్యాపారంలో 41 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 బాక్సాఫీసు కలెక్షన్స్ తో పోలిస్తే నేటికి 85 శాతానికి పైగా వృద్ధి కన్పిస్తోంది. 2019లో 15.1 మిలియన్ డాలర్లు, 2022లో 18.9 మిలియన్ డాలర్లు, 2023 ఆగస్టు వరకూ 16.5 మిలియన్ డాలర్లూ వసూలు చేశాయి ఐమాక్స్ థియేటర్లు. ఇవి మామూలు వసూళ్ళు కావు. ఇంతింత డబ్బుని ఐమాక్స్ లో సినిమాలు చూసేందుకు ధారబోస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సంవత్సరం దేశంలో ఐమాక్స్ థియేటర్లు అత్యధిక వసూళ్ళు సాధించిన టాప్ 10 సినిమాల్లో తొమ్మిది హాలీవుడ్ సినిమాలే వుండడం గమనార్హం.

ఐమాక్స్ లో క్రిస్టఫర్ నోలన్ ‘ఒపెన్‌ హైమర్’ 2023 లో రూ. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రూ. 15 కోట్లకు పైగా వ్యాపారం చేస్తే, ‘పఠాన్’ రూ. 12 కోట్లకు పైగా వసూళ్ళని అందించింది.

ఇలావుండగా, ఈవారం తాజాగా విడుదలైన షారుఖ్ ఖాన్ ‘జవాన్‌’ ని వున్న 25 ఐమాక్స్ స్క్రీన్‌లన్నిటా ప్రదర్శించడం జరుగుతోంది.

కంపెనీ సమాచారం ప్రకారం, గత సంవత్సరం ఐమాక్స్ ఇండియా బాక్సాఫీసు వ్యాపారంలో దేశీయ సినిమాలు 30 శాతం వాటాని పొందాయి. 70 శాతం వాటా హాలీవుడ్ సినిమాలది. దేశీయ సినిమాల వాటాని మరింత పెంచడానికి దేశీయ సినిమాల సంఖ్యని పెంచి, యేటా 10 నుంచి 12 సినిమాల్ని ప్రదర్శించేందుకు కంపెనీ యోచిస్తోంది.

పట్టణాలకూ ఐమాక్స్ హంగులు

మన దేశం అత్యంత తేజోవంతమైన గ్లోబల్ సినిమా మార్కెట్‌లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే ఇక్కడ ఐమాక్స్ ఫార్మాట్‌ కి ప్రేక్షకులనుంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రేక్షకుల సంఖ్య పెంచుకోవడానికి విస్తరణ కార్యక్రమాలు చేపట్టింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు మాత్రమే వున్న దేశంలో మూడో ఫార్మాట్ గా ఐమాక్స్ థియేటర్లు కొలువుదీరడం కొత్త పరిణామం. ఐమాక్స్ ప్రస్తుతం 25 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది. మరో 15 తెరపైకి రానున్నాయి. 2023 చివరి నాటికి 30-స్క్రీన్ల మార్కుని చేరుకోగలదని భావిస్తున్నారు.

గత రెండేళ్ళలో కంపెనీ సంవత్సరానికి 5-6 కొత్త స్క్రీన్‌లని జోడించుకుంటూ వచ్చింది. ఇదే ట్రెండ్ 2024 లో కూడా కొనసాగుతుందని నమ్ముతోంది. దేశీయ మార్కెట్ 100 పైగా ఐమాక్స్ స్క్రీన్లని భరించే సామర్ధ్యంతో వుందని భావిస్తోంది కంపెనీ. ఇందుకుగాను కంపెనీ టాప్ మల్టీప్లెక్స్ చైన్లు పీవీఆర్- ఐనాక్స్, సినీ పొలిస్‌లతో జతకట్టింది. ప్రస్తుతం పీవీఆర్- ఐనాక్స్ తో 20 స్క్రీన్‌ల భాగస్వామ్యంతో వుంది. రెండవ శ్రేణి, మూడవ శ్రేణి పట్టణాలకూ ఐమాక్స్ థియేటర్లని విస్తరించే ప్రణాళికలతో వుంది. కనీసం 50 పట్టణాల్లో ఐమాక్స్ థియేటర్లు వెలిసే అవకాశముంది. ఇది సినిమా ప్రదర్శనా రంగంలో విప్లవం అనొచ్చు. పట్టణాలకి గర్వకారణంగా నిలిచే ఈ థియేటర్లతో పట్టణాభివృద్ధి కూడా వేగం పుంజుకోగలదు.

అయితే, మనదేశం చైనాతో పోలిస్తే చాలా వెనుకబడే వుంది. చైనాలో భారీయెత్తున 800 ఐమాక్స్ థియేటర్లున్నాయి. ఇంకో 200 రాబోతున్నాయి. ఏదో ఒక స్థాయిలో మన దేశంలో ఐమాక్స్ థియేటర్ల కోసం ప్రేక్షకుల డిమాండ్ అయితే పెరుగుతోంది. అయితే ఇందుకు తగ్గట్టుగా ప్రదర్శించేందుకు దేశీయ సినిమాలే కరువవుతున్నాయి. ఐమాక్స్ తో బాటు, 4 డీఎక్స్ మల్టీప్లెక్సులు కంటెంట్ కొరతని ఎదుర్కొంటున్నాయని మరో వైపు వాదన వుంది. మామూలుగా షూట్ చేసే సినిమాల్ని ఇమాక్స్ సొంత టెక్నాలజీ అయిన డీఎంఆర్ (డిజిటల్ మీడియా రీమాస్టరింగ్) నుపయోగించి ఐమాక్స్ ఫార్మాట్ కి మారుస్తారు.

అయితే అన్ని సినిమాలనీ ఈ ఫార్మాట్ కి మారిస్తే ఉపయోగముండదు. కేవలం అద్భుత యాక్షన్ తో, విజువల్స్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేయగల భారీ బడ్జెట్ సినిమాలే డీఎంఆర్ టెక్నాలజీకి, ఐమాక్స్ ప్రదర్శనకి అనువుగా వుంటాయి. ఉదాహరణకి ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు ఐమాక్స్ కి ముందే ప్లాన్ చేసిన నిర్మాణ విలువల కారణంగా కొన్ని ప్రింట్లు ఐమాక్స్ ఫార్మాట్ కి మార్చగలిగారు.ఈ నేపథ్యంలో ఐమాక్స్ తో బాటు, మల్టీప్లెక్స్ 4 డీ ఎక్స్ థియేటర్లు ఎదుర్కొంటున్న కంటెంట్ కొరత గురించి రేపు తెలుసుకుందాం.

First Published:  9 Sept 2023 7:52 AM GMT
Next Story