Telugu Global
Cinema & Entertainment

నా పాట మీ చోట ఏల?

నోటీసులందుకున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలు ఆ పాటపై హక్కులున్న ఆడియో కంపెనీల అనుమతులు పొందామని తెలిపారు. అయితే హక్కుల విషయంలో కొంత కాలంగా ఇలయారాజా ఇంత ధూంధాం చేస్తూంటే, నిర్మాతలు నేరుగా ఇళయరాజా నుంచే అనుమతులు ఎందుకు తీసుకోలేదన్నది ప్రశ్న.

నా పాట మీ చోట ఏల?
X

మాస్ట్రో ఇళయరాజా మళ్ళీ షాకిచ్చారు. తన పాట తన అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని నిర్మాతలకి లీగల్ నోటీసులు పంపారు. నోటీసు లందుకున్న నిర్మాతలు తాము తీసుకున్న అనుమతులు బయట పెట్టారు. ఆ అనుమతులు చెల్లవని ఇళయరాజా చెప్పబోతున్నారు. సినిమా విడుదలై రూ. 250 కోట్లు గడించేసింది కూడా. ఇప్పుడు ఇళయరాజా వడ్డించబోయే నష్టపరిహారం ఏ స్థాయిలో వుంటుందో వూహించుకుంటే గుండె దడ తప్ప గుణాత్మక ఫలితం కనిపించడం లేదు. ‘గుణ’ సినిమాలోని తన తమిళ పాటని మలయాళ ‘మంజుమ్మల్ బాయ్స్’ లో వాడుకున్నందుకు అనుమతి తీసుకోకుంటే, లేదా సినిమా నుంచి పాటని తొలగించకుంటే, నిర్మాతలపై చర్యలు తీసుకుంటానని నోటీసులో హెచ్చరించారు ఇళయరాజా.

ఇళయరాజా 1991 లో కమలహాసన్ నటించిన తమిళ సినిమా ‘గుణ’ లో 'కణ్మణి అన్బోడు' అనే సూపర్ హిట్ పాటని స్వరపర్చారు. దీన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కలిసి పాడారు. ‘గుణ’ తెలుగు డబ్బింగులో ఈ పాట ‘ప్రియతమా నీవచట కుశలమా’ అని వుంటుంది. తెలుగులో కూడా సూపర్ హిట్టే. ఈ పాటని ఉపయోగించినందుకు మలయాళ బ్లాక్‌బస్టర్ 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలకి లీగల్ నోటీసు పంపారు. ‘కన్మణి అన్బోడు’ పాటకి అసలైన స్వరకర్త తానేనని పేర్కొంటూ, నిర్మాతలు తమ సినిమా టైటిల్ కార్డ్ లో పేరు వేసినంత మాత్రాన తన అనుమతి/లైసెన్స్/కంటెంట్‌ హక్కులు పొందినట్టు కాదని స్పష్టం చేశారు. నిర్మాతలు వాణిజ్యపరమైన దోపిడీకి పాల్పడుతున్నారనీ, అనుచిత మార్గాల ద్వారా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నారనీ ఆరోపించారు.

ఇళయరాజా తన సంగీత రచనలన్నిటిపై నైతిక హక్కులు సహా సంపూర్ణ హక్కుల్ని కలిగి వున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించడమే కాకుండా మ్యూజిక్ కంపోజర్ అనుమతి పొందాలని, లేదా సినిమా నుంచి పాటని తొలగించాలనీ ఇళయరాజా తరపు న్యాయవాది నిర్మాతల్ని కోరారు. నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు ఈ రెండు ఆప్షన్‌లలో దేనినైనా పాటించకపోతే, వారిపై చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు.

ఇళయరాజా ఇలా షాకివ్వడం మొదటి సారి కాదు. దాదాపు తన పాటలన్నిటికీ గొంతు అందించిన సాక్షాత్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకే షాకు తప్పలేదు. అమెరికాలో సంగీత ప్రోగ్రాములిస్తున్నప్పుడు ఇళయరాజా నోటీసు అందుకున్న ఎస్పీ బాలు ప్రోగ్రాములు ఆపవలసి వచ్చింది. కచేరీల్లో కూడా తన అనుమతి లేకుండా తన పాటలు పాడకూడదని ఇంళయరాజా ఆర్డర్. ఇది భారీ వివాదాన్ని సృష్టించింది. సంగీతకారులు, గీత రచయితలు, గాయకుల మధ్య రాయల్టీని ఎలా పంచుకోవాలో తమిళ సంగీత పరిశ్రమ చర్చించాల్సిన సమయం వచ్చిందను

కున్నారు. పాట ఎవరిది అనే విషయంపై అందరూ అయోమయంలో పడ్డారు. అప్పటి నుంచి గందరగోళం కొనసాగుతూనే వుంది.

బాలీవుడ్ లో కూడా నాటి గాయకులు మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ ల మధ్య ఇలాటి వివాదమే తలెత్తింది. తాము పాడిన పాటలపై రాయల్టీ వుండాలని లత వాదం. ఒకసారి పాట పాడి నిర్మాత నుంచి పారితోషికం పొందాక ఏ హక్కులూ వుండవని రఫీ ప్రతి వాదం. దీనిపై ఇద్దరూ విడిపోయి ఆరేళ్ళు కలిసి పాడలేదు. తర్వాత లత దిగిరాక తప్పలేదు.

ఇళయరాజా తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని ఉపయోగించకుండా అనేక కంపెనీలకి వ్యతిరేకంగా నిషేధాజ్ఞల్ని పొందగలిగారు. కరోకే యాప్‌లు, టీవీ, ఎఫ్‌ఎమ్ ఛానెల్‌లు, మెగా దర్శకుడు శంకర్ సహా తనకి అన్యాయం చేశారని భావించిన వాళ్ళందరిపై కూడా కేసులు పెట్టారు.

నోటీసులందుకున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలు ఆ పాటపై హక్కులున్న ఆడియో కంపెనీల అనుమతులు పొందామని తెలిపారు. అయితే హక్కుల విషయంలో కొంత కాలంగా ఇలయారాజా ఇంత ధూంధాం చేస్తూంటే, నిర్మాతలు నేరుగా ఇళయరాజా నుంచే అనుమతులు ఎందుకు తీసుకోలేదన్నది ప్రశ్న.

ఇంతకీ ఆ పాట సినిమాలో ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? చరిత్రతో సంబంధముంది. గుణ గుహలు అనేవి తమిళనాడులోని కొడైకెనాల్ లో వున్న ఒక గుహల సముదాయం. ఈ సముదాయంలో మనిషి పట్టే వెడల్పుతో లోతైన బిలాన్ని 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి రికార్డు చేశాడు. దీనికి అతను డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. ఈ బిలంలో చాలా మంది పడిపోయి చచ్చిపోయారు. 1991 లో ఇక్కడ కమలహాసన్ సినిమా ‘గుణ’ షూటింగ్ జరిగినప్పట్నుంచీ ఇది పర్యాటక కేంద్రంగా ఆకర్షించ సాగింది- గుణ గుహలు అన్న పేరుతో. ఈ గుహల్లో వున్న బిలం లో పడిపోయిన యువకుడి యదార్థ కథతోనే ‘మంజుమ్మల్ బాయ్స్’ తీశారు.

అందుకని బ్యాక్ గ్రౌండ్ లో ‘గుణ’ సినిమాలోని పాట వాడుకున్నారు. కమల హాసన్ స్వరం ఈ గుహల గుండా ప్రతిధ్వనిస్తూ వుంటుంది, ఇంకా చాలా సార్లు రిపీటవుతూ వుంటుంది. క్లయిమాక్స్ లో చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నిర్మాతల మీద ప్రభావం చూపుతోంది. ఇళయరాజాతో పెట్టుకుంటే ఇంతే మరి!

First Published:  24 May 2024 12:24 PM IST
Next Story