Telugu Global
Cinema & Entertainment

హిందీలో డబ్బింగ్ చేస్తే పానిండియా అయిపోతుందా?

సౌత్ పానిండియా సినిమాల ధాటికి హిందీ స్టార్ సినిమాలు తట్టుకోవడం లేదు. ‘జవాన్’ దీనికి సమాధానం కనిపెట్టినట్టుగా - తమిళ స్టార్స్ ని కూడా కలుపుకుని కొత్త హిందీ సినిమా మోడల్ ని ముందుకు తెస్తోంది.

హిందీలో డబ్బింగ్ చేస్తే పానిండియా అయిపోతుందా?
X

పానిండియా సినిమాలు టాలీవుడ్ (తెలుగు), కోలీవుడ్ (తమిళం), శాండల్ వుడ్ (కన్నడ) నుంచి వస్తున్నాయి. మాలీవుడ్ (మలయాళం) సినిమాలు ఇంకా ఈ ట్రెండ్ లో లేవు. అయితే ప్రస్తుత పానిండియా ట్రెండ్ లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తీస్తున్న సినిమాలన్నీ హిట్ కావడం లేదు. ఒకటి హిట్ అయితే దాదాపు మరొకటి ఫ్లాప్ అవుతోంది. దేశం విభిన్న భాషల, సంస్కృతుల సమ్మేళనం. వీటన్నిటినీ సంతృప్తి పరిచే పానిండియా సినిమాలు తీయడం కష్టమే. అమెరికాలో హాలీవుడ్ సినిమాలు తీయాలంటే ఈ పరిస్థితి లేదు. అమెరికన్ సంస్కృతితో, అమెరికన్ భాషలో తీస్తే సరిపోతుంది. ఈ సినిమాలే పాన్ వరల్డ్ సినిమాలుగా ప్రపంచమంతటా ఆడతాయి. కొన్ని సినిమాల్ని మాత్రం ఆసియన్ సంస్కృతిని జోడించి తీస్తున్నారు. అలాగే మన దేశంలో హిందీ సినిమాలు ప్రాంతానికొక రకంగా తీయరు. ఒకే హిందీ సినిమా దాని వేష భాషలతో దేశమంతటా ఆడుతుంది. కాకపోతే ఈ మధ్య వివిధ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు కూడా విడుదల చేస్తున్నారు. ఈవారం విడుదలవుతున్న ‘జవాన్’ లాగా.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, సౌత్ పానిండియా సినిమాల ధాటికి హిందీ స్టార్ సినిమాలు తట్టుకోవడం లేదు. ‘జవాన్’ దీనికి సమాధానం కనిపెట్టినట్టుగా - తమిళ స్టార్స్ ని కూడా కలుపుకుని కొత్త హిందీ సినిమా మోడల్ ని ముందుకు తెస్తోంది. దర్శకుడు అట్లీ తమిళుడే కాబట్టి తమిళం సహా సౌత్ మార్కెట్ అంతతా వర్కౌట్ అయ్యే మార్కెటింగ్ వ్యూహంతో తమిళ స్టార్స్ నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణిలని షారుఖ్ ఖాన్ సరసన నటింపజేశాడు. హిందీ స్టార్ సినిమాతో ఇది కొత్త ప్రయోగం. ‘జవాన్’ తప్ప ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య విడుదలవుతున్న ఇంకే హిందీ స్టార్ సినిమా కూడా తమిళ స్టార్స్ తో బ్యాలెన్స్ చేసే ప్రయోగం చేయడం లేదు. తెలుగు నుంచి వెళ్ళిన సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ‘యానిమల్’ లో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ ముగ్గురూ హిందీ స్టార్సే తప్ప సౌత్ స్టార్ ఎవరినీ తీసుకోలేదు. శ్రీరామ్ రాఘవన్ తీస్తున్న ‘మెర్రీ క్రిస్మస్’ ని మాత్రం హిందీ స్టార్ తో కాకుండా తమిళ స్టార్ విజయ్ సేతుపతితో తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్ హిందీ స్టార్ కత్రినా కైఫ్.

2015 లో బాహుబలి నుంచి నేటి ఖుషీ వరకూ పానిండియా సినిమాలు 20 విడుదలైతే 12 హిట్‌, 8 ఫ్లాపయ్యాయి. బాహుబలి రెండు భాగాలు, కేజీఎఫ్ రెండు భాగాలు, ఆర్ ఆర్ ఆర్, పుష్ప1, జైలర్, విక్రమ్, పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు, కాంతారా, కార్తికేయ 2 హిట్ కాగా, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, విక్రాంత్ రోనా, కబ్జా, లైగర్, దసరా, స్పై ఫ్లాపయ్యాయి. గత వారం విడుదలైన ఖుషీ ఫలితం ఇంకా రావాల్సి వుంది.

పానిండియా సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డానికి ప్రధాన కారణం పానిండియా లెవెల్లో ప్రమోషన్ చేయకపోవడం. అంత హిట్టయిన కేజీఎఫ్ 1 వూరికే హిట్ కాలేదు. దాని మార్కెటింగ్ మీద భారీగా ఖర్చు పెట్టారు. దాంతో ఆ రేంజిలో హిట్టయ్యింది. కేజీఎఫ్ 1 పాపులరయింది కాబట్టి, కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ కి తక్కువ ఖర్చు పెట్టి, ప్రొడక్షన్ కి ఎక్కువ ఖర్చుపెట్టారు. ఇది వర్కౌటయింది.

భారీ స్థాయిలో పానిండియా సినిమా తీసినప్పుడు ఆయా ప్రాంతాల మార్కెట్స్ ని ఆకర్షించే విధంగా కంటెంట్ ని, స్టార్స్ ని ఎంపిక చేసుకుని తీస్తున్నారు. ప్రభాస్ సినిమాలు ఫ్లాపవడానికి కంటెంట్ లోపమే కారణం. పరిమిత బడ్జెట్లో దసరా, స్పై, లైగర్ లాంటివి తీసినప్పుడు, వాటిని తెలుగు సినిమాల్లాగే తీసి, ఒక హిందీ డబ్బింగ్ కూడా పడేస్తే, డబ్బింగ్ ఖర్చే కదా అయ్యేదని, వస్తే నాల్గు డబ్బులు అట్నుంచి కూడా వస్తాయని, మొక్కుబడిగా హిందీ డబ్బింగ్ రిలీజ్ చేసి పానిండియా అంటున్నారు. ఖుషీతోనూ ఇదే పరిస్థితి. ఇలా చేసినప్పుడు ఫ్లాపవుతున్నాయి. ఫ్లాపవడమే గాక, పానిండియా సినిమాల మీద నమ్మకం పోగొడుతున్నాయి ప్రేక్షకుల్లో. ఇలాగే ఇంకో నాల్గు సినిమాలు తీస్తే సౌత్ పానిండియాల వైపు నార్త్ ప్రేక్షకులు తొంగికూడా చూడరు.

తెలుగు సినిమా తీసి హిందీ డబ్బింగ్ చేస్తే అది తెలుగు సినిమాలాగే వుంటుంది కంటెంట్ పరంగా, మిగతా మేకింగ్ పరంగా. అది పానిండియాగా నార్త్ మార్కెట్లో ఎలా పోతుంది? అలా పోవనే మలయాళం మేకర్లు పానిండియా మీద దృష్టి పెట్టడం లేదు. తమ బడ్జెట్లో తమ మలయాళ సినిమాలు తాము తీసుకుంటూ పానిండియా పేరు చెడగొట్టే కార్యక్రమంలో భాగం కావడం లేదు.

ఈ వారం మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి విడుదలవుతోంది. దీని హిందీ డబ్బింగ్ కూడా ఒకటి పడేసి పానిండియా అనకుండా, సౌత్ భాషల్లోనే విడుదల చేస్తూ పానిండియా పరువు దక్కించారు. పానిండియా అంటే హిందీ డబ్బింగ్ కాదు, పానిండియా కంటెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకోక పోతే పానిండియా సినిమాలకి శాశ్వతంగా తెర దించిన వాళ్ళవుతారు.

*

First Published:  4 Sept 2023 4:20 PM IST
Next Story