ఐమాక్స్ కి కంటెంట్ కొరత ఎంత కాలం?
సెప్టెంబర్ 7న న్యూ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లో పురాతన పరాస్ సినిమా థియేటర్ 15 ఏళ్ళ తర్వాత కొత్త అవతారంలో పునఃప్రారంభమైంది. ఈ కొత్త అవతారం ఐమాక్స్. దీని యజమాని పీవీఆర్ - ఇనాక్స్.
సెప్టెంబర్ 7న న్యూ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌లో పురాతన పరాస్ సినిమా థియేటర్ 15 ఏళ్ళ తర్వాత కొత్త అవతారంలో పునఃప్రారంభమైంది. ఈ కొత్త అవతారం ఐమాక్స్. దీని యజమాని పీవీఆర్ - ఇనాక్స్. ఈ ఓపెనింగ్‌తో న్యూ ఢిల్లీలో ఇది ఆరవ ఐమాక్స్ థియేటర్ గా నిలుస్తోంది. ముంబాయి ఏడు ఐమాక్స్ థియేటర్లతో మొదటి స్థానంలో వుంది. పరాస్ ఐమాక్స్ లో 305 మంది సీటింగ్ కెపాసిటీతో, టికెట్ ధర 600 రూపాయలతో, ‘జవాన్’ తో ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
దేశంలో ఐమాక్స్ థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తగ్గట్టు ఐమాక్స్ ఫార్మాట్ లో దేశీయ సినిమాల నిర్మాణం కూడా పెరగాలి. ఈ విషయంలో వెనుకబడి వుంది సినిమా రంగం. ఐమాక్సే గాకుండా 4 డీఎక్స్ ఫార్మాట్ మూవీస్ కూడా అంతంత మాత్రంగానే నిర్మాణం జరుపుకుంటున్నాయి. దీంతో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలపై ఆధారపడాల్సి వస్తోంది. ‘టాప్ గన్’, అవతార్2’ లాంటి హాలీవుడ్ సినిమాలు ప్రేక్షకుల్ని ఐమాక్స్, 4 డీఎక్స్ స్క్రీన్స్ కి అతుక్కుపోయేలా చేశాయి. ఇటువంటి అద్భుత సినిమాటిక్ అనుభవాల్ని అందించే ప్రీమియం మూవీ ఫార్మాట్‌లు (ఐమాక్స్, 4 డీఎక్స్) దేశంలో కంటెంట్ కోసం స్ట్రగుల్ చేస్తున్నాయి.
దేశంలో ప్రీమియం మూవీ ఫార్మాట్స్ ని విస్తరించడానికి కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీటికి అనుగుణమైన సినిమాల నిర్మాణంలో నిర్మాతలు వెనుకబడే వున్నారు. అంటే ఈ టెక్నాలజీలు కాలానికంటే ముందున్నాయా? 2000 ప్రారంభంలో డిజిటల్ కెమెరాలు ప్రవేశించినప్పుడు కూడా సినిమా రంగం డిజిటల్లో సినిమాల్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. టాలీవుడ్ లో ఎస్. గోపాలరెడ్డి వంటి ప్రముఖ కెమెరా మాన్ లు సైతం ముడి ఫిలింతో వచ్చే డెప్త్ డిజిటల్ తో రాదనే వారు. 2010 నుంచే టాలీవుడ్ లో డిజిటల్లో సినిమాల నిర్మాణం పెరిగింది. ఈ సమయం ప్రీమియం మూవీ ఫార్మాట్స్ లో దేశీయ సినిమాల నిర్మాణానికి కూడా పడుతుందా?
ఏడాదికి 365 రోజులుంటే, ఇందులో సగం రోజులకి కూడా ఐమాక్స్, 4 డీఎక్స్ స్క్రీన్స్ కి ఫీడింగునిచ్చే సరిపడా సంఖ్యలో సినిమాలు రావడం లేదు. మిగతా ఆరునెలలు ఈ థియేటర్లు ఏం చేయాలి? అందుకని వున్న సినిమాలనే కలెక్షన్లు లేకున్నా ఎక్కువ రోజులు ప్రదర్శించాల్సి వస్తోంది. లేదా సాధారణ సినిమాల్ని సాధారణ ప్రొజెక్షన్ తో ప్రదర్శించాల్సి వస్తోంది.
ఈ రంగంలో నిపుణులేమంటున్నారంటే, ప్రీమియం ఫార్మాట్స్ కి దేశమింకా అర్ధవంతమైన మార్కెట్‌గా ఉద్భవించలేదు. హాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్ని అటువంటి ఫార్మాట్స్ లోకి మార్చడంలో ముందున్నప్పటికీ, మన దేశంలో ఈ ట్రెండ్ చాలా కొత్తది. పైగా నిర్మాతలు గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేసే డబ్బు ఇక్కడ చాలా తక్కువ. అందుకని తరచుగా ఈ ప్రీమియం ఫార్మాట్లలో నిర్మించని సాధారణ 2డీ సినిమాల్ని ఈ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
దేశంలో మొత్తం కలిపి 9,000 కంటే తక్కువ స్క్రీన్‌లున్నాయి. పెద్ద ఫార్మాట్‌లు టాప్ మెట్రోలలో మాత్రమే లభిస్తాయి కాబట్టి ఐమాక్స్ లో, 4 డీఎక్స్ లో షూట్ చేయడం లేదా, ఇప్పటికే వున్న సినిమాల్ని ఈ ఖరీదైన ఫార్మాట్‌లలోకి మార్చడం ఆర్థికంగా లాభసాటిగా వుండడం లేదు. తమిళ ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ 4 డీఎక్స్ లో విడుదలైంది. కానీ సొంత రాష్ట్రం తమిళనాడులోనే 4 డీఎక్స్ స్క్రీన్‌లు లేవు!
దేశంలో వచ్చే ఐదేళ్ళలో 100- స్క్రీన్స్ మార్కుని తాకాలని ఐమాక్స్ కార్పొరేషన్ ప్రణాళికలతో వుంది. ఈ ఐదేళ్ళలో ప్రీమియం ఫార్మాట్స్ లో సినిమాలు ఊపందుకుంటాయా? కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ అనుభవాలు పొందుతున్నారు. అది జవాన్, పఠాన్ , ఆర్ ఆర్ ఆర్, బ్రహ్మాస్త్ర , అవతార్ 2, టాప్ గన్ మొదలైన ప్రీమియం ఫార్మాట్ మెగా సినిమాలతో పొందారు. వీటికి నిర్మాణ బడ్జెట్, థియేటర్ నిర్వహణా వ్యయం పెరగడంతో బాటు, ఆదాయంలో కొంత భాగాన్ని ఫార్మాట్ యజమానులతో పంచుకోవాల్సి వుంటుంది. దీనికి టికెట్లపై అధిక ధరల భారాన్ని ప్రేక్షకుల మీద వేస్తేనే కవర్ అవుతాయి.
ఈ థియేటర్ల నిర్వహణ ఖర్చులు ఇతర సాధారణ ప్రొజెక్షన్ల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. అందుకని టికెట్ల ధరలు రూ. 500 -1,200 మధ్య నిర్ణయించక తప్పదు. దీనికి ప్రేక్షకులు సిద్ధంగానే వున్నారు. అయితే ప్రీమియం ఫార్మాట్స్ సినిమాలతో దివ్యానుభూతిని రెగ్యులర్ గా పొందేందుకు తగినన్ని సినిమాల సరఫరా కోసం మరి కొంతకాలం ఎదురు చూపులు తప్పవు!