Telugu Global
Cinema & Entertainment

మూలవాసుల చరిత్ర చెప్పాల్సిందే అంటున్న స్కార్సెసీ

ఇప్పుడు ట్రెండింగ్ లో వున్న హాలీవుడ్ మూవీ 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్' అక్టోబర్ 20న ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలవుతోంది.

మూలవాసుల చరిత్ర చెప్పాల్సిందే అంటున్న స్కార్సెసీ
X

ఇప్పుడు ట్రెండింగ్ లో వున్న హాలీవుడ్ మూవీ 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్' అక్టోబర్ 20న ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలవుతోంది. 200 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో పారమౌంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ, తొలి వారాంతంలో అమెరికాలో 25 మిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రఖ్యాత దర్శకుడు మార్టిన్ స్కార్సెసీ, జాతి నిర్మూలన గురించి రూపొందించిన చారిత్రక ప్రాధాన్యం గల ఈ మూవీలో, ‘టైటానిక్’ ఫేమ్, ఆస్కార్ విన్నర్ లియోనార్డో డీ కాప్రియోతో పాటు, రెండు ఆస్కార్ల విజేత, సీనియర్ నటుడు రాబర్ట్ డీ నీరో, ‘ఫ్యాన్సీ డాన్స్’ హీరోయిన్ లిల్లీ గ్లాడ్ స్టోన్ నటించారు.

ఎర్నెస్ట్ బుర్ఖార్ట్ అనే హంతకుడుగా డీ కాప్రియో, అతడి ప్రియురాలు మోలీ బుర్ఖార్ట్ గా లిల్లీ గ్లాడ్ స్టోన్, కుట్రదారు విలియం హేల్ గా రాబర్ట్ డీ నీరో నటించారు. 2017 లో జర్నలిస్టు డేవిడ్ గ్రాన్ రాసిన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ నవల ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ ఆధారంగా ఈ మూవీ తెర కెక్కింది. ఈ పరిశోధనాత్మక నవలలో డేవిడ్ గ్రాన్ దిగ్భ్రాంతికర నేర ఘటనల్ని కళ్ళకి కట్టాడు. అనేక సంవత్సరాల పాటు జరిపిన పరిశోధనతో ఆశ్చర్యపరిచే కొత్త సాక్ష్యాధారాల ఆధారంగా, మరుగున పడిన రహస్యాల్ని వెలికి తీశాడు. శిక్ష పడకుండా తప్పించుకున్న హంతక బడా బాబుల బండారాన్ని బయట పెట్టాడు. 1910-1930 మధ్య కాలం అమెరికా మూలవాసులైన రెడ్ ఇండియన్స్ తెగ జీవితాల్లో చీకటి కాలం. ఓక్లహామాలోని ఒసాజ్ కౌంటీలో విలువైన చమురు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. తమ భూముల్లో చమురు నిక్షేపాలు బయటపడడంతో, తెగలో ప్రతి ఒక్కరికీ లాభదాయకమైన వార్షిక రాయల్టీలని సంపాదించే హక్కులు ఏర్పడ్డాయి. రాత్రికి రాత్రి అత్యంత ధనవంతులుగా మారారు. కార్లలో తిరగడం ప్రారంభించారు. భవనాల్ని నిర్మించుకున్నారు, పిల్లల్ని చదువులకి యూరప్ పంపించారు.

మూలవాసుల ఈ వైభోగం మీద వెంటనే శ్వేతజాతీయుల కన్ను పడింది. వాళ్ళని ఏమార్చి డబ్బుని తారుమారు చేయడం, దోపిడీలు చేయడం చేశారు. ఇంతటితో ఆగకుండా చంపడం మొదలు పెట్టారు. మూలవాసుల భూముల్ని, సంపదని స్వాధీనం చేసుకునే ప్రయోజనాల కోసం హత్యా కాండ మొదలెట్టారు.

దీనికి మోలీ బుర్ఖార్ట్ కి చెందిన కుటుంబం ప్రధాన లక్ష్యంగా మారింది. ఆమె బంధువుల్ని కాల్చి చంపారు. ఈ ప్రారంభం తర్వాత తెగకు చెందిన ఎక్కువ మంది అంతుచిక్కని పరిస్థితుల్లో చనిపోవడం ప్రారంభించారు. మరణాల సంఖ్య ఇరవై నాలుగుకి పైగా పెరగడంతో, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (బిఓఐ) రంగంలోకి దిగింది.

బిఓఐ నేటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) కి పూర్వ నామం. వరస హత్యల మిస్టరీని ఛేదించడానికి బిఓఐ చీఫ్, టామ్ వైట్ అనే మాజీ టెక్సాస్ రేంజర్‌ని ఆశ్రయించాడు. టామ్ వైట్ ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేశాడు. అందులో బ్యూరోలోని ఏకైక మూలవాసి ఏజెంట్‌ సహాయంలో ఏజెంట్లు ఆ ప్రాంతంలోకి చొరబాటు చేశారు.

అయితే ఒసాజ్ గార్డియన్ ప్రోగ్రాం పేరిట ప్రారంభించిన ఈ దర్యాప్తులో పాల్గొన్న స్థానిక అధికారులు విస్తృత అవినీతికి పాల్పడ్డారు. చాలా హత్యల్ని ఎప్పుడూ విచారించను కూడా లేదు. హత్యలకి మాస్టర్ మైండ్ అయిన విలియం హేల్ (రాబర్ట్ డీ నీరో)నీ, అతడి మేనల్లుడు బుర్ఖార్ట్ (లియానార్డో డీ కాప్రియో) నీ మాత్రం అరెస్టు చేశారు. జరిగినవి 20-25 హత్యలు మాత్రమే కాదనీ, 100 కి పైగా జరిగాయనీ సాక్ష్యాధారాలతో జర్నలిస్టు డేవిడ్ గ్రాన్ నవలలో పేర్కొన్నాడు.

ఈ దుష్ట చరిత్ర చెప్పక తప్పదని దర్శకుడు స్కార్సెసీ స్పష్టం చేశాడు. అమెరికన్ చరిత్రలో అత్యంత క్రూర కుట్రల్లో ఒకటైన దీన్ని సినిమా ద్వారా బహిర్గతం చేయక తప్పదని చెప్పాడు. ఈ ‘రఫ్ హిస్టరీ’ నుంచి దూరంగా వుండలేనన్నాడు.

‘విషయం ఏమిటంటే, మన చరిత్ర గురించి, మానవులుగా మన గురించి కొన్ని తీవ్ర విషయాలున్నాయి. మనం వాటిని దాచిపెడితే, అవి పోయేవి కావు. అత్యాశ అమానవీయతతో కలిసిపోయినప్పుడు ఏం జరుగుతుంది- అది దేనికి దారి తీస్తుంది- ఈ సందర్భంలో అది జాతి నిర్మూలనకి దారితీసింది’ అని విచారం వ్యక్తం చేశాడు.

చమురు హక్కులపై నియంత్రణ సాధించేందుకు మూలవాసుల్ని హత్య చేయాలని ఆదేశించింది విలియం హేల్. హేల్‌తో సంబంధం వున్న మరో ఇద్దరు నిందితులు హెన్రీ గ్రామర్, ఆసా కిర్బీ విచారణ సమయంలో మరణించారు. గ్రామర్ కారు ప్రమాదంలో మరణిస్తే, కిర్బీ ఒక దుకాణాన్ని దోచుకుంటున్నప్పుడు కాల్పుల్లో చనిపోయాడు.

ఇది తప్పక చూడాల్సిన చారిత్రక మూవీ. ట్రైలర్ ఇప్పటికే విడుదలై వైరల్ అయింది (కింద చూడండి). అయితే మన దేశంలో ఏఏ భాషల్లో విడుదలవుతుందో ఇంకా ప్రకటించలేదు. ఇంకో మూడు వారాల్లో దసరాకీ ముందు, అక్టోబర్ 20 కి ప్రేక్షకుల ముందుకొస్తోంది.



First Published:  1 Oct 2023 4:10 PM IST
Next Story