డైలమాలో హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులు!
చిరంజీవి నటించిన హిందీ ‘గాడ్ ఫాదర్’ కి చిరంజీవి డబ్బింగ్ చెప్పలేదు, అల్లు అర్జున్ నటించిన హిందీ ‘పుష్ప’ కు అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పలేదు, నిఖిల్ నటించిన హిందీ ‘కార్తికేయ2’ కి నిఖిల్ డబ్బింగ్ చెప్పలేదు
చిరంజీవి నటించిన హిందీ 'గాడ్ ఫాదర్' కి చిరంజీవి డబ్బింగ్ చెప్పలేదు, అల్లు అర్జున్ నటించిన హిందీ 'పుష్ప' కు అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పలేదు, నిఖిల్ నటించిన హిందీ 'కార్తికేయ2' కి నిఖిల్ డబ్బింగ్ చెప్పలేదు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించిన హిందీ 'ఆర్ఆర్ఆర్' కి రామ్ చరణ్, ఎన్టీఆర్లే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విజయ్ దేవరకొండ నటించిన హిందీ 'లైగర్' కి విజయ్ దేవర కొండే స్వయంగా డబ్బింగ్ చెప్పుకు
న్నాడు. ప్రభాస్ నటించిన హిందీ 'సాహో', 'రాధేశ్యామ్' లకి ప్రభాసే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు... ఈ సంఖ్య పెరిగే దిశగా పరిణామాలుంటున్నాయి.
హిందీకి స్వయంగా డబ్బింగ్ చెప్పుకునే తెలుగు స్టార్లు పెరుగుతున్నారు. తమిళ స్టార్లు మాత్రం తమ హిందీ వాయిస్ ని హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులకే వదిలేస్తున్నారు. సౌత్ స్టార్స్ కి హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్తున్నంత కాలం వాళ్ళ వృత్తి బావుంది. తెలుగు స్టార్లు తామే హిందీ డబ్బింగ్ చెప్పుకోవడం మొదలెడితే తమ ఉపాధి ప్రమాదంలో పడుతోందని మొరపెట్టుకుంటున్నారు హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులు.
పాన్-ఇండియా సినిమాల ప్రభంజనం హిందీ డబ్బింగ్ పరిశ్రమని దెబ్బతీసే దిశగా పయనిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా, దేశం అంతటా సినిమా పరిశ్రమలు ఒకదానితో ఒకటి మునుపటి కంటే చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాయి. తెలుగు, తమిళం,
కన్నడ, మలయాళ పరిశ్రమల నుంచి సినిమాలు 'పాన్ ఇండియా' ఫార్మాట్‌లో విడుదలవుతున్నాయి. హిందీ మాట్లాడే మార్కెట్లకి కూడా చేరుతున్నాయి. అయితే,
ఇటీవలి కాలంలో తెలుగు సూపర్ స్టార్‌లు తమ సినిమాల హిందీ వెర్షన్‌లలో తమ వాయిస్ కి తామే డబ్బింగ్ చెప్పుకుంటే, ఈ ధోరణిని ప్రోత్సహిస్తే, ఏకైక జీవనాధారంగా చేసుకుని హిందీ వెర్షన్స్ కి వాయిస్ ఇస్తున్న హిందీ డబ్బింగ్ కళాకారులు అన్యాయమై పోతారని వాపోతున్నారు.
ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌత్ స్టార్‌కి హిందీ డబ్బింగ్ చెప్పేటప్పుడు మూడు నుంచి నాలుగు రోజుల సమయమిస్తారు. వీళ్ళు పొందే పారితోషికం ఆ స్టార్ ని బట్టి, ఆ సినిమా ఏ ప్లాట్ ఫాంలో విడుదలవుతోందనే దాన్ని బట్టి వుంటుంది. ముంబైకి చెందిన డబ్బింగ్ డైరెక్టర్ సోఫియా విజ్ అభిప్రాయంలో, ఇది హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులకు ఉపాధిని దూరం చేసే ధోరణే. దక్షిణాది నుంచి చాలా సినిమాలు డబ్బింగ్ కి వస్తూంటాయి. చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు దీని ద్వారా మంచి ఉపాధిని పొందుతున్నారు. అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్స్ కి గాత్రాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత డబ్బింగ్ కళాకారుడు సంకేత్ మాత్రే మాటల్లో చెప్పుకుంటే, ముఖ్యంగా హిందీ డబ్బింగ్ పరిశ్రమ దేశంలో చాలా ఉన్నత స్థితిలో ఉంది. హాలీవుడ్ సినిమాలకి అందిస్తున్న డబ్బింగ్ సేవలే ఇందుకు నిదర్శనం. ఈ పునాదిని సృష్టించడం వెనుక సంవత్సరాలుగా పనిచేసిన చాలా మంది సీనియర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల, దర్శకుల, రచయితల కృషి ఎంతో ఉంది. ఇలా డెలివరీ నాణ్యత పరంగా ప్రపంచ స్థాయికి రావడానికి దశాబ్దాలుగా శ్రమించిన ఈ విభాగంలోకి, కొందరు స్టార్లు ప్రవేశించి నాణ్యతని ప్రశ్నార్ధకం చేయడం అన్యాయం.
తెలుగు పానిండియా సినిమాల కంటే చాలా పూర్వమే, తెలుగు సినిమాల హిందీ శాటిలైట్ డబ్బింగ్ వెర్షన్స్ కి మంచి ఆదరణ వుంది. టీవీల్లో రోజూ మధ్యాహ్నం ప్రసారమ
య్యే హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాలతోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి తెలుగు స్టార్లు, కమెడియన్ బ్రహ్మానందం హిందీ రాష్ట్రాల ప్రేక్షకులకి పరిచయమై, ఆ ప్రేక్షకులు ఫ్యాన్స్ గా మారిన పరిస్థితి వుంది. దీనికి కారకులు హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులే. తెలుగు స్టార్స్ కి హిందీ డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులూ పాపులర్ అవుతున్నారు. ఇక తమ కెరీర్ స్థిరపడినట్టేనని భావిస్తూ వఛ్చారు. అలాటిది ఇప్పుడు తెలుగు స్టార్లే డబ్బింగ్ చెప్పుకోవడంతో దీనికి బ్రేక్ పడుతోంది. ఈ విషమ సమస్య పరిష్కారమవ్వాలంటే తెలుగు స్టార్లే పునరాలోచించాలని హిందీ డబ్బింగ్ ఆర్టిస్టులు కోరుతున్నారు.
ఏ స్టార్ కి ఎవరు డబ్బింగ్ చెప్తున్నారో తెలుసుకుంటే ... చిరంజీవి, మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ - శక్తీ సింగ్; రజనీకాంత్, విజయ్ సేతుపతి, పోసాని- మయూర్; పవన్ కళ్యాణ్, రవితేజ, గోపీచంద్ -అమర్ బాబారియా, మహేష్ బాబు, ధనుష్- రాజేష్ కవ్; అల్లు అర్జున్ - శ్రేయాస్ తల్పడే, సంకేత్ మాత్రే; విజయ్ దేవరకొండ- దమన్ దీప్ సింగ్ (పూర్వం); బాలకృష్ణ, నాగార్జున, విక్రమ్, అజిత్- సమయ్ రాజ్ టక్కర్; వెంకటేష్, కార్తీ, విజయ్- చైతన్యా అదీబ్; వినోద్ కులకర్ణి - బ్రహ్మానందం.