Telugu Global
Cinema & Entertainment

లెక్క తీస్తే రూ. 3650 కోట్లు దిమ్మదిరిగే వసూళ్ళే!

Highest grossing Indian film: అత్యధిక వసూళ్ళు చేసిన భారతీయ చలనచిత్రం ఏదంటే ఏం చెప్తారు? అది రూ. 3650 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Highest grossing Indian film: లెక్క తీస్తే రూ. 3650 కోట్లు దిమ్మదిరిగే వసూళ్ళే!
X

Highest grossing Indian film: లెక్క తీస్తే రూ. 3650 కోట్లు దిమ్మదిరిగే వసూళ్ళే!

అత్యధిక వసూళ్ళు చేసిన భారతీయ చలనచిత్రం ఏదంటే ఏం చెప్తారు? అది రూ. 3650 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఆ సినిమా ఏది? షోలే? దంగల్? బాహుబలి? అది పీరియడ్ డ్రామా ఎపిక్- 63 ఏళ్ళ క్రితం విడుదలైనప్పుడు, టిక్కెట్ల ధర కేవలం రూ. 1.50 వున్నప్పుడు, రూ. 11 కోట్లు రాబట్టింది. దాన్ని ‘మొఘలే ఆజం’ అంటారు.

ఈ రోజుల్లో హిట్ సినిమాలు 300 కోట్లు, 400 కోట్లు దాటడం చాలా మాములు విషయం. కొన్ని బ్లాక్‌బస్టర్లు 1000 కోట్ల మార్క్ ని కూడా అధిగమించాయి. ఇది ఓ దశాబ్దం క్రితం అసాధ్యమన్పించింది. నిజానికి 90 లలో చివరి వరకూ చాలా సినిమాలు వంద మాత్రమే కాదు, 50 కోట్లు కూడా దాటలేదు. ఇప్పుడు మెగా వసూళ్ళకి అనేక అంశాలు దోహదపడుతున్నాయి. దేశంలో స్క్రీన్‌ల సంఖ్య పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా టిక్కెట్ ధరలు పెరగడం వంటివి కలిసి వచ్చి కలెక్షన్లని ఆకాశాన్నంటిస్తున్నాయి.

కాబట్టి గతంలో వచ్చిన హిట్స్ ని ఈ కాలంలోని బ్లాక్‌బస్టర్స్ తో పోల్చడం ఎలా? ఎలాగంటే, గత సంవత్సరాల్లో విడుదలైన అన్ని సినిమాల ఆదాయాల్ని ఒక సాధారణ సంవత్సరానికి సర్దుబాటు చేయడం. ఈ కసరత్తులో 2022 ని తీసుకుని, ద్రవ్యోల్బణం దృష్ట్యా సర్దుబాటు చేసినప్పుడు, ఇప్పటివరకు అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాలేవో ఓ సంస్థ లెక్కగట్టి ప్రకటించింది.

ఈ లిస్టులో అగ్రభాగాన నిలిచింది ‘మొఘలే ఆజం’. నిర్మాత, దర్శకుడు కె. ఆసిఫ్ దీన్ని పదేళ్ళ పాటు నిర్మిస్తూనే వున్నాడు. నిర్మాణం పూర్తి చేసి 1960లో విడుదల చేసినప్పుడు అన్ని బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఇది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11 కోట్లు వసూలు చేసింది. నిర్మాణ వ్యయం కోటిన్నర రూపాయలు అయింది. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తే, ‘మొఘలే ఆజం’ నేటి రూపాయల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ. 3650 కోట్లకు చేరుకుంది. ఈ వసూళ్ళు ‘అవతార్ 2’ కూడా చేసి వుండదు.

భారతదేశం అంతటా 5500 థియేటర్లలో విడుదలైన ‘పఠాన్’ ని కూడా పరిగణనలోకి తీసుకుంటే - 150 టాప్ కలెక్షన్ సినిమాల జాబితాలో అగ్రస్థాయిలో వుంటుంది ‘మొఘలే ఆజం’. రూ. 3650 కోట్లు అనేది నమ్మశక్యం కాని సంఖ్య. అయితే అప్పట్లో టిక్కెట్ల డిమాండ్ చాలా ఎక్కువగా వుండడంతో, బ్లాక్‌లో రూ. 100 కి కూడా విక్రయించిన దాఖలాలున్నాయి. అప్పట్లో రూ 100 అంటే ఇప్పుడు కళ్ళు తిరిగే దాదాపు రూ. 4000 లతో సమానం! అప్పట్లో రూ. 100 అంటే రెండు కుటుంబాల నెల ఖర్చు! ఈ స్థాయిలో బ్లాక్ లో టికెట్లు అమ్ముడుబోయిన సినిమా కూడా ఇదే అయుంటుంది.

భారతీయ చలనచిత్రాల్లో టాప్ 10 సినిమాల వసూళ్ళని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినపుడు ప్రత్యేకంగా ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్లు కన్పిస్తాయి. ‘మొఘలే ఆజం’ తర్వాత లిస్టులో రమేష్ సిప్పీ తీసిన ‘షోలే’ వుంటుంది. ఇది ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేశాక రూ. 2800 కోట్ల రూపాయల వసూళ్ళు సూచిస్తోంది. అమీర్ ఖాన్ నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్’ రూ. 2650 కోట్లతో మూడో స్థానంలో వుంది. మరో నాలుగు సినిమాలు వాటి వసూళ్ళని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు రూ. 2000 కోట్ల మార్కుని దాటాయి – ‘బాహుబలి 2’ -రూ. 2170 కోట్లు, ‘మదర్ ఇండియా’ రూ. 2120 కోట్లు, ‘హమ్ ఆప్కే హై కౌన్’ రూ. 2100 కోట్లు, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ రూ. 2000 కోట్లు.



ఈ టాప్ 10 లిస్టులో చివరి మూడు సినిమాలూ ఓవర్సీస్‌లో వసూళ్ళు చేసినవే – రాజ్ కపూర్ ‘ఆవారా’ రూ. 1940 కోట్లు, మిథున్ చక్రవర్తి ‘డిస్కో డాన్సర్’ రూ. 1650 కోట్లు, రిషీ కపూర్ ‘బాబీ’ రూ. 1550 కోట్లు. ఈ మూడూ అప్పటి సోవియట్ యూనియన్‌లో ఘనవిజయం సాధించాయి. ‘డిస్కో డాన్సర్’ అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి భారతీయ చలన చిత్రంగా కూడా నిలిచింది. ఈ రూ. 100 కోట్లలో ఇండియాలో వసూలు చేసింది రూ 6 కోట్లే. మిగతా రూ. 94 కోట్లు రష్యాలో వసూలు చేసింది!

ఈ అంకెలు ఫోర్బ్స్, ది హిందూ, మింట్, బిజినెస్ స్టాండర్డ్ పత్రికల ఆధారంగా నిర్ధారించినవి. డాలర్, పౌండ్, రూబుల్, యూరో, యువాన్ వంటి ప్రధాన కరెన్సీల ద్రవ్యోల్బణాన్ని, మారకపు రేటు మార్పుల్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నారు. చారిత్రక మారకపు రేట్లని, ద్రవ్యోల్బణాన్ని చార్ట్ చేసిన బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం డేటాని కూడా ఆధారంగా తీసుకున్నారు. ఈ సూచికలు ఒక సినిమా వసూళ్ళు ఎంత మేర పెరిగే అవకాశం వుందో అంచనా వేయడానికి తోడ్పడతాయి. ఉదాహరణకు, 1960లో విడుదలైన ఒక చలన చిత్రం 2022 నాటికి 300-350 రెట్లు పెరిగినట్లు లెక్క తేలుతుంది. అయితే 19 90 ల మధ్యలో విడుదలైన సినిమాకి 8-10 రెట్లు మాత్రమే పెరుగుతుంది.



స్క్రీన్ కౌంట్ పెరగడం, విస్తృత గ్లోబల్ రిలీజులు, అలాగే పానిండియా సినిమాల పెరుగుదలతో, చాలా బిగ్ మూవీస్ గత హిట్స్ ని అధిగమించడం చాలా సులభమని అన్పించ వచ్చు. కానీ ‘మొఘలే ఆజం’, ‘షోలే’ వంటి హిట్‌ల ద్వారా సెట్ చేసిన ఫుట్‌ఫాల్స్ మార్క్ కి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ప్రధాన కారణం ఏమిటంటే, ఈ రోజుల్లో ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో సినిమాలు తక్కువ వ్యవధిలో థియేటర్లలో వుంటున్నాయి. సిల్వర్ జూబ్లీ నిర్వచనం 25 వారాల నుంచి 25 రోజులకి మారింది. అప్పట్లో ‘షోలే’ హైదరాబాద్ రామకృష్ణ 70 ఎంఎం లో, నాలుగు ఆటలతో ఐదేళ్ళ పాటూ ఆడింది! అంటే చూసిందే మళ్ళీ మళ్ళీ చూసే రిపీట్ ఆడియెన్స్ అప్పట్లో వుండే వాళ్ళు. ఇప్పుడు ‘పఠాన్’ లాంటి సినిమా ఒకసారి చూస్తే చాలా ఎక్కువ!

First Published:  12 Jun 2023 3:33 PM IST
Next Story