Banaras Movie: బనారస్ ఆలస్యానికి కారణం అదే
Banaras Movie: బనారస్ అనే సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు జైద్ ఖాన్. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఎందుకు లేట్ అయిందో వెల్లడించాడు.
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా పరిచయమౌతున్న సినిమా బనారస్. బెల్ బాటమ్ లాంటి హిట్ సినిమా తీసిన జయతీర్థ దీనికి దర్శకుడు. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
అయితే ఇది ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాదు. చాలా ఆలస్యంగా థియేటర్లలోకి వస్తోంది. దీనికి కారణాన్ని వెల్లడించాడు హీరో జైద్ ఖాన్. బనారస్ సినిమా ఆలస్యం వెనక కారణాన్ని ఆయన మాటల్లోనే...
"2019 సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టాం. అయితే అదే సమయంలో వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. లాక్ డౌన్ కి ముందే 2 పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. రెండో లాక్ డౌన్ తర్వాత మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పట్టింది. అన్ని భాషల్లో డబ్బింగ్, పాటలు రిక్రియేషన్ చేశాం. ఐదింతల పని ఎక్కువైంది. అందుకే సినిమా లేట్ అయింది."
బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్ కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.