అవార్డులపై నమ్మకం లేదు.. వచ్చినా చెత్తబుట్టలో పడేస్తా - నటుడు విశాల్
అవార్డులపై తనకు అస్సలు నమ్మకం లేదని విశాల్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలందరూ కలసి ఇచ్చేదే నిజమైన అవార్డని ఆయన తెలిపారు.
తనకు అవార్డులు వస్తే వాటిని చెత్తబుట్టలో పడేస్తానని నటుడు విశాల్ చెబుతున్నారు. విశాల్ తాజాగా నటించిన `మార్క్ ఆంటోని` చిత్రం వినాయకచవితికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ అవార్డులకు సంబంధించి ఆయన ప్రశ్నించగా దానికి విశాల్ పైవిధంగా స్పందించారు.
అదే నాకు పెద్ద అవార్డు...
అవార్డులపై తనకు అస్సలు నమ్మకం లేదని విశాల్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలందరూ కలసి ఇచ్చేదే నిజమైన అవార్డని ఆయన తెలిపారు. ప్రేక్షకుల ఆశీస్సులతో ఇన్నేళ్లపాటు పరిశ్రమలో నిలదొక్కుకుంటూ చిత్రాల్లో నటిస్తున్నానని, నిజానికి అదే తనకు పెద్ద అవార్డని చెప్పారు. ఒకవేళ తాను నటించిన చిత్రాలకు అవార్డు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తానని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి ప్రవేశం, ఎన్నికల్లో పోటీ గురించి అడిగిన ప్రశ్నకు విశాల్ స్పందిస్తూ.. జీవితంలో ఏదైనా జరగొచ్చని చెప్పారు. ఒకప్పుడు నటీనటుల(నడిగర్ సంఘం) ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధారవి తనను సంఘం సభ్యుడిగా చేరమని పలుమార్లు అడిగారని.. ఆ తర్వాతే చేరానని వివరించారు. కొంత కాలానికి అదే సంఘంలో ఆయనకు పోటీగా ఎన్నికల్లో దిగి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందానని చెప్పారు. అదే విధంగా భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని, మన చేతుల్లో ఏమీ లేదని ఆయన వివరించారు.