Telugu Global
Cinema & Entertainment

మళ్ళీ నితిన్‌కి 'నియోజక వర్గం' సమస్య!

'మాచర్ల నియోజకవర్గం' గురించి అంత చెప్పిన నితిన్ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. 'మాచర్ల నియోజక వర్గం' ఒకటే కాదు, 2020 లో`భీష్మ‌` హిట్టయ్యాక వ‌రుస‌గా మూడు ప‌రాజ‌యా లెదుర్కొన్నాడు.

మళ్ళీ నితిన్‌కి నియోజక వర్గం సమస్య!
X

యంగ్ హీరో నితిన్‌కి మళ్ళీ ఒక 'ఇష్క్', మళ్ళీ ఒక 'భీష్మ' కావాలి, లేదా 'జయం' కావాలి. ఈ మూడూ హీరోగా తన కెరీర్‌ని మలుపు తిప్పిన ప్రేమ సినిమాలే. అయితే ప్రేమ సినిమాలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చిందని, అవి చేసే ఉద్దేశం లేదన్నట్టు చెప్పాడు. డిఫరెంట్‌గా చేసి నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళాలనే ఆలోచనతో 'మాచర్ల నియోజకవర్గం' చేశానని వెల్లడించాడు. డిఫరెంట్ అనుకుని చేసిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్‌గా తేలింది. దీంతో పాటే విడుదలైన నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' ఆలిండియా హిట్టయ్యింది. డిఫరెంట్ అంటే ఇదే కావచ్చు. నితిన్ ఇంకా డిఫరెంట్ అంటే థియేటర్ రెంట్లు రాని అదే రొడ్డ కొట్టుడు రౌడీ రాజకీయ సినిమా అనుకున్నాడు.

కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాలకి ఇంకా స్కోప్ పెరిగిందనీ, కథా బలమున్న సాఫ్ట్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయనీ; మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న‌ సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయనీ 'మాచర్ల నియోజక వర్గం' విడుదలకి ముందు విశ్లేషించాడు. కానీ హాలీవుడ్ ఇలా విశ్లేషించ లేదు. కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా అనేక మానసిక, ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో ఏకాకులైన ప్రేక్షకులకి మళ్ళీ అవే యాక్షన్, లవ్, ఫ్యామిలీ సినిమాలు చూపించి బాధల నుంచి ఉపశమనం కల్గించలేమని, నిత్య జీవితాలకి దూరంగా పూర్తి ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ వంటి స్వాప్నిక జగత్తులో విహరింపజేయాలని, అలాటి సినిమాలే టోకున ఉత్పత్తి చేస్తున్నారు.

ఎంతగానంటే, వీటి టైటిల్స్ కూడా గుర్తుపెట్టుకోవడం, ఏది చూశాం ఏది చూడలేదని తెలుసుకోవడం కష్టమైపోతోంది...డాక్టర్ స్ట్రెంజ్ ఇన్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్, జూరాసిక్ వరల్డ్ డొమినియన్, ది బ్యాట్ మాన్, థోర్ : లవ్ అండ్ థండర్, స్పైడర్ మాన్- నో వే హోమ్, షాంగ్ చీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్, ఎటర్నల్స్ ... ఇలా చెప్పుకుంటూ పోతే తియ్యటి లోకాల్లో విహరింపజేసే సూపర్ హీరో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ సినిమాలే ఇప్పటికీ తీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇవి మినిమం 400 కోట్ల డాలర్ల థియేటర్ వసూళ్ళు సాధిస్తున్నాయి. విపత్తులో ఉన్న‌ మనవాళికి హాలీవుడ్ చేస్తున్న సేవ ఇది.

'మాచర్ల నియోజకవర్గం' గురించి అంత చెప్పిన నితిన్ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. 'మాచర్ల నియోజక వర్గం' ఒకటే కాదు, 2020 లో`భీష్మ‌` హిట్టయ్యాక వ‌రుస‌గా మూడు ప‌రాజ‌యా లెదుర్కొన్నాడు. 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో'... 'మాచ‌ర్ల నియోజ‌క‌వర్గం' నాల్గో ఫ్లాపు. దీంతో డైలమాలో పడి ఒప్పుకున్న సినిమా ఆపేశాడు. వ‌క్కంతం వంశీ దర్శకత్వంలో 'జూనియ‌ర్‌` సినిమా ఒప్పుకున్నాడు నితిన్‌. 'మాచర్ల నియోజక వర్గం' లాగే ఇది కూడా సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సినిమానే. ఆ మ‌ధ్య క్లాప్ కొట్టి ప్రారంభించాక సినిమా గురించిన అప్డేట్స్ లేవు. దర్శకుడు సాగ‌ర్ చంద్ర చెప్పిన ఇంకో కథ కూడా నితిన్‌కి బాగా న‌చ్చింది.`అశ్వ‌ద్ధామ‌` ద‌ర్శ‌కుడు రమణ తేజ, ఇంకో ఇద్దరు దర్శకులూ కూడా నితిన్‌తో ట‌చ్‌లో వున్నారు. అందరూ ఇప్పుడు సస్పెన్స్ ని అనుభవిస్తున్నారు నితిన్ ఏం చేస్తాడో తెలియక!

2002లో తేజ దర్శకత్వంలో 'జయం' తో ఎంట్రీ ఇచ్చి హిట్టయిన నితిన్, 2003లో వివి వినాయక్ తో ఇంకో హిట్ 'దిల్' ఇచ్చి స్థిరపడ్డాడు. ఇచ్చాడు. అంతే, ఆ తర్వాత అస్థిరత్వమే, ఫ్లాపుల పర్వమే ...సంబరం, శ్రీఆంజనేయం, అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం... ఇలా 2004 నుంచి 2011 వరకూ ఎనిమిదేళ్ళూ 13 ఫ్లాపుల రికార్డు. మధ్యలో రాజమౌళితో 'సై' (2004) ఒకటే హిట్. ఇక లాభం లేదని చేతులెత్తేసిన నితిన్‌తో, 2012 లో తమిళం నుంచి విక్రమ్ కుమార్ వచ్చి, 'ఇష్క్' అనే రోమాంటిక్ థ్రిల్లర్‌తో అతి పెద్ద హిట్టిచ్చి కొత్త చాప్టర్ చేతిలో పెట్టాడు. మళ్ళీ ఈ చాప్టర్‌లో ఒక్క 'గుండె జారి గల్లంతయ్యిందే', 'అఆ' తప్ప, 'హార్ట్ ఎటాక్', 'చిన్నదానా నీకోసం', 'కొరియర్ బాయ్', 'లై', 'చల్ మోహన రంగా', 'శ్రీనివాస కళ్యాణం' అనే 6 అట్టర్ ఫ్లాపులు 2014-18 మధ్య లిఖించుకున్నాడు నితిన్.

మళ్ళీ వెనక్కి 'ఇష్క్' వైపు ఆశగా చూస్తున్న నితిన్‌తో, వెంకీ కుడుమల అనే కొత్త దర్శకుడు 2020లో 'భీష్మ' అనే రొమాంటిక్ కామెడీ తీసి కొత్త వూపిరి పోశాడు. అసలే కోవిడ్‌తో ఆక్సిజన్ దొరకని పరిస్థితి. దాంతో 2021 వరకూ 'చెక్', 'రంగ్ దే', 'మాస్టర్' ఊపిరాడక మృతి చెందాయి. ఇక 2022 లో 'మాచర్ల నియోజక వర్గం' తో నితిన్‌కి మళ్ళీ లాక్ డౌన్.

ఇరవై ఏళ్ళ నితీన్ కెరీర్‌లో మొత్తం 30 సినిమాల్లో 7 హిట్లు, 23 ఫ్లాపులు. ఇప్పుడు తన నియోజక వర్గం ఏమిటన్నదే డైలమా. రొమాన్సా? యాక్షనా? ఫ్యామిలీయా? ఫాంటసీయా? శర్వానంద్ పరిస్థితే. అరడజను మూస సినిమాలు ఫ్లాపయ్యాక శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' అనే సైన్స్ ఫిక్షన్ ప్రయత్నిస్తున్నాడు. హాలీవుడ్‌ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీలు గుమ్మరిస్తూంటే టాలీవుడ్ కేమైంది? స్పిరిచ్యువల్ ఫాంటసీ 'కార్తికేయ 2' తో నిఖిల్ 150 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. నితిన్ నియోజక వర్గ పునర్వ్యవస్థీకరణ సమస్య తేలితేనే ఏ క్లబ్‌లో చేరతాడనే స్పష్టత వస్తుంది.

First Published:  5 Sept 2022 1:23 PM IST
Next Story