హీరోల స్థాయి 1-1.5 రేటింగ్ సినిమాలేనా?
మామా మశ్చీంద్ర, మ్యాడ్, రూల్స్ రంజన్. మంత్ ఆఫ్ మధు, 800, చిన్నా, ఏందిరా పంచాయితీ, నేనే సరోజ, ఊరు పేరు భైరవ కోన, టిల్లు స్క్వేర్... ఈ 10 సినిమాలు గత శుక్రవారం విడుదలయ్యాయి.
మామా మశ్చీంద్ర, మ్యాడ్, రూల్స్ రంజన్. మంత్ ఆఫ్ మధు, 800, చిన్నా, ఏందిరా పంచాయితీ, నేనే సరోజ, ఊరు పేరు భైరవ కోన, టిల్లు స్క్వేర్... ఈ 10 సినిమాలు గత శుక్రవారం విడుదలయ్యాయి. మ్యాడ్ తప్ప మిగతావన్నీ ఫ్లాపయ్యాయి. ఏందిరా పంచాయితీ, నేనే సరోజ, ఊరు పేరు భైరవ కోన, టిల్లు స్క్వేర్...ఇవన్నీ తెలియని ముఖాలతో చిన్నా చితకా సినిమాలు. ఇలాటివి ప్రతీ వారం విడుదలై వెళ్ళిపోతూనే వుంటాయి. వీటి రేటింగ్ 1 -1.5 కి మించదు. వీటిని పరిగణనలోకి తీసుకోనవసరం లేదు. కానీ కాస్త పేరున్న రెండవ శ్రేణి, మూడవ శ్రేణి హీరోల సినిమాలు కూడా 1-1.5 రేటింగ్స్ తో అట్టర్ ఫ్లాపవడమే గమనించాల్సిన విషయం.
మ్యాడ్ తప్ప ఫ్లాపైన పై తొమ్మిది సినిమాల్లో నవీంచంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, తమిళ డబ్బింగ్ ‘800’, సిద్ధార్థ్ తమిళ డబ్బింగ్ ‘చిన్నా’ 2-2.5 రేటింగ్స్ పొందినా బాక్సాఫీసు దగ్గర పనిచేయలేదు. అయితే సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’, కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ వంటి గుర్తింపు పొందిన రెండవ శ్రేణి హీరోల సినిమాలు రెండూ 1-1.5 రేటింగ్స్ తో అట్టర్ ఫ్లాపవడమే దారుణమైన విషయం. రెండవ శ్రేణి హీరోల సినిమాల్ని కూడా ఇంత హీనమైన రేటింగ్స్ తో చావకబారు సినిమాల్లాగా ఎలా తీస్తారు? సినిమాల చరిత్ర ప్రారంభమై వందేళ్ళు పూర్తయినా ఇంకా సినిమాలు తీయడం రావడం లేదనుకోవాలా? ఇంత హీన దశలో దర్శకులున్నారా?
సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరమే కాదు, ఈ సంవత్సరం విడుదలైన సినిమాలతో ఆది సాయికుమార్, శ్రీ సింహా, సంతోష్ శోభన్ వంటి గుర్తింపు వున్న రెండవ శ్రేణి, మూడవ శ్రేణి హీరోల సినిమాలూ 1.5 రేటింగ్స్ తోనే అట్టర్ ఫ్లాపయ్యాయి. ఆది సాయికుమార్ ‘సిఎస్ఐ- సనాతన్’ 1.5; శ్రీసింహా ‘భాగ్ సాలే భాగ్’ 1.5; శ్రీసింహా కోడూరి ‘ఉస్తాద్’ 1.5; సంతోష్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ 1.5; ఇంకా కిరణ్ అబ్బవరం ‘మీటర్’ 1.5 రేటింగ్ కి దిగజారాయి.
ఇంకా దారుణమేమిటంటే, ప్రవీణ్ సత్తారు, శ్రీకాంత్ అడ్డాల వంటి అగ్రశ్రేణి దర్శకులు కూడా ఈ స్థితికి దిగజారడం. వరుణ తేజ్ వంటి అగ్ర హీరోతో ప్రవీణ్ సత్తారు తీసిన ‘గాండీవధారి అర్జున’ 1.5 స్థాయి సినిమా అంటే ఏమనాలి? ఇటీవల శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరోతో తీసిన ‘పెదకాపు’ రేటింగ్ సింగిల్ స్టార్! ఇదింకా దారుణం. ఇక ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు కమెడియన్లతో తీసిన ‘అన్ స్టాపబుల్’ రేటింగ్ 1.5!
రైటర్ రాసి తీసే సినిమాలు కూడా సినిమాలన్పించుకోక పోవడం విడ్డూరం. డైమండ్ రత్నబాబు తర్వాత హర్షవర్ధన్ తీసిన ‘మామా మశ్చీంద్ర’ రేటింగ్ సింగిల్ స్టారే! హీరోలు తాము నటిస్తున్న సినిమాలతో ఫ్లాప్ అవొచ్చు. ఆ ఫ్లాపవడం 2-2.25 రేటింగ్ సినిమాలతో అయితే పరువుగా వుంటుంది. పరువంతా పోయేలా చిన్నాచితకా హీరోల సరసన చేరిపోతూ, 1-1.5 రేటింగ్ సినిమాల్లో నటించడమేమిటి?
హీరోలు సినిమాలు ఎంపిక చేసుకునేప్పుడు అది ఏ రేటింగ్ స్క్రిప్టో ముందే పసిగట్ట గలిగితే ఇలాటి అవమానకర పరిస్థితి ఎదురుకాదు. పెద్ద స్టార్స్ తో హాలీవుడ్ నుంచి కూడా హీనాతి హీనమైన సినిమాలొస్తూంటాయి. సిల్వెస్టర్ స్టాలోన్, జేసన్ స్టాతమ్ ల వంటి దిగ్గజ స్టార్లు నటించిన ‘ఎక్స్ పెండబుల్స్ 4’ గత నెల విడుదలైంది. ఇది దారుణాతి దారుణంగా 0.5 -1 రేటింగ్స్ ని సముపార్జించుకుని అంతర్జాతీయ అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఇంత అట్టర్ ఫ్లాప్ తో ఈ టాప్ స్టార్ల సరసన చేరి సాంత్వన పొందే అవకాశం మన హీరోలకి చాలా అరుదుగా లభిస్తుంది. వారం వారం చిన్నా చితకా కొత్త హీరోల పక్కన చోటు సంపాదించు కోవడమే!