ఇకనైనా ఈ నిజాన్ని బలంగా అర్థం చేసుకోవాలి
మతం, రాజకీయాలను ఉద్దేశించి నటుడు ప్రకాశ్‌రాజ్ తాజా పోస్ట్ వైరల్
నటుడు ప్రకాశ్‌రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై మొదలైన ఆయన పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా మతం, రాజకీయాలను ఉద్దేశించి ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతని పురస్కరించుకుని వారి సూక్తులు, సందేశాలను నెటిజన్లతో పంచుకున్నారు. 'ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ.. నిజం ఎప్పటికీ నిజమే' అనే గాంధీజీ సూక్తిని, 'దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు, పాకిస్థాన్‌కు ఉన్న వ్యత్యాసం' అనే లాల్ బహదూర్ శాస్త్రి వ్యాఖ్యలను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. 'అందరికీ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు. ఇకనైనా ఈ నిజాన్ని బలంగా అర్థం చేసుకోవాలి' అని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ప్రకాశ్ రాజ్ స్పందించిన విషయం విదితమే. దీనిపై ఆయన పోస్టులు కొనసాగుతున్నాయి. ప్రకాశ్‌రాజ్ పోస్టులపై ఏపీ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని వచ్చాక మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను అన్నారు. దీనిపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజాగా 'ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సి పనులు చూడండి' అని మంగళవారం పేర్కొన్నారు.