Hanu-Man Trailer | హను-మాన్ ట్రయిలర్ ఎలా ఉందంటే..!
Hanu-Man - తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా హను-మాన్. ఈ సినిమా నుంచి ఈరోజు ట్రయిలర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం..
ఒరిజినల్ సూపర్ హీరో 'హను-మాన్' ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలిసి చేసిన 'హను-మాన్' థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ అయింది. అఖండ భారతంలోని ఇతిహాసాల నుండి ప్రేరణ పొంది ఈ సినిమా తీసినట్టు, ట్రయిలర్ ఫస్ట్ ఫ్రేమ్ లోనే చెప్పారు.
అద్భుతమైన గ్రాఫిక్స్ తో మనల్ని అంజనాద్రి యూనివర్స్ లోకి తీసుకెళ్తుంది ట్రయిలర్. అండర్ వాటర్ సీక్వెన్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో ‘యథో ధర్మ తతో హనుమా...' అనే శ్లోకంతో నక్షత్రంలా మెరుస్తున్న ముత్యపు చిప్పకు దగ్గరగా హీరో వెళుతున్నట్లు చూపించారు.
అంజనాద్రి నిజమైన అందం జలధార గల హనుమాన్ పర్వత శ్రేణిలో ఉంది. అక్కడ భారీ హనుమాన్ విగ్రహం మహా అద్భుతంగా దర్శనమిచ్చింది. దీన్ని టీజర్ లోనే చూపించారు. ఈసారి మరింత డీటెయిలింగ్ గా చూపించారు. ఇక అద్భుత శక్తులు అందుకున్న హీరో, చిరుతతో సమానంగా పరుగెత్తడం ట్రయిలర్ లో హైలెట్.
ఆ తర్వాత సైన్స్ సహాయంతో సూపర్ పవర్ ను కనిపెట్టిన విలన్ వస్తాడు. తనని ప్రపంచంలో తిరుగులేని శక్తిగా చేసే పవర్ కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. తన రాకతో ప్రతిదీ నాశనం చేస్తాడు, అతడ్ని హీరో ఎదుర్కొంటాడు. చివరకు హనుమంతుని అద్భుత దర్శనం జరుగుతుంది. టీజర్‌లో హనుమంతుడు మంచులో శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు చూపించగా, ట్రయిలర్ లో దానిని బద్దలుకొట్టి బయటకొస్తున్నట్టు చూపించారు.
2024 హను-మన్ నామ సంవత్సరం కానుంది. సంక్రాంతికి జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ సినిమాగా విడుదల కానుంది.