Vijaya Talkies | చరిత్రలో కలిసిపోయిన మరో సినిమా హాల్
Vijaya Talkies - గుంటూరులో విజయా టాకీస్ కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడా థియేటర్ నేలమట్టమైంది. కాలగర్భంలో కలిసిపోయింది.
రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వాటికి అనుగుణంగా మార్కెట్ కూడా మారాలి. టాలీవుడ్ లో ఆ మార్పు స్పష్టంగా కళ్లకు కనిపిస్తోంది. ఒకప్పట్లా సినిమాను సెలబ్రేట్ చేసుకునే జనం తగ్గిపోయారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య తగ్గిపోతోంది.
దీనికితోడు మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత సింగిల్ స్క్రీన్స్ వరుసగా మూతపడుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు కరోనా వచ్చి టాలీవుడ్ మార్కెట్ ను మరింత దెబ్బకొట్టింది. దీంతో చాలా సినిమా హాళ్లు గోడౌన్లుగా, ఫంక్షన్ హాళ్లుగా మారిపోయాయి. అలా కనుమరుగైన థియేటర్ల లిస్ట్ లోకి గుంటూరు విజయ టాకీస్ కూడా చేరిపోయింది.
గంటూరు విజయ టాకీస్.. ఈ సినిమా హాల్ కు ఓ చరిత్ర ఉంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చూసింది ఈ థియేటర్. ఎన్నో రికార్డులకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం గుంటూరులో 385 రోజులాడిందని ఘనంగా చెప్పుకుంటారు జనం. ఆ సినిమా ఆడింది ఈ థియేటర్ లోనే.
కాలంతో పాటు ఈ థియేటర్ కూడా మార్పులకు నోచుకుంది. 2016లో థియేటర్ ను రీ-మోడలింగ్ చేశారు. సౌండ్ సిస్టమ్ మెరుగుపరిచారు. ఆ తర్వాత కూడా మంచి సినిమాలకు వేదికైంది విజయా టాకీస్. జనతా గ్యారేజీ, జై లవకుశ, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు ఇందులో 50రోజులు పూర్తి చేసుకున్నాయి.
అయితే రీమోడలింగ్ తర్వాత కూడా ఈ థియేటర్ నిలదొక్కుకోలేకపోయింది. ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, కరోనా ఎఫెక్ట్ కారణంగా 2021 నుంచి థియేటర్ మూసేశారు. తాజాగా దీన్ని కూలగొట్టారు. ఈ థియేటర్ లో ప్రదర్శించిన చివరి సినిమా రూలర్. అలా తెలుగు సినీచరిత్రలో కలిసిపోయింది విజయా టాకీస్.