`నాటు నాటు` సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
జక్కన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్` మరో విశిష్ట అవార్డును తన ఖాతాలో వేసుకుని ప్రపంచ యవనికపై మరోసారి సగర్వంగా నిలిచింది
జక్కన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్` మరో విశిష్ట అవార్డును తన ఖాతాలో వేసుకుని ప్రపంచ యవనికపై మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే `గోల్డెన్ గ్లోబ్` అవార్డును `ఆర్ఆర్ఆర్` సొంతం చేసుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఒరిజినల్ సాంగ్ విభాగానికి గాను ఈ చిత్రంలోని `నాటు నాటు` పాటకు ఈ పురస్కారం దక్కింది.
బుధవారం కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ విషయం ప్రకటించారు. ఈ ఉత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాళి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ఈ పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్, రాజమౌళి, చరణ్.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు.
అవార్డు అందుకున్న కీరవాణి...
గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న కీరవాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సంతోష సమయాన్ని తన సతీమణితో కలిసి పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన శ్రమను, తనకు మద్దతిచ్చినవారిని నమ్ముకున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ పాట విషయంలో తన కుమారుడు కాలభైరవ అద్భుతమైన సహకారం అందించాడని వివరించారు.
విదేశీయులను సైతం ఉర్రూతలూగించిన `నాటు నాటు` సాంగ్‌కు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. గతేడాది మార్చి నెలలో ఈ చిత్రం విడుదల కాగా, ఇప్పటికీ ఈ పాటకు నెట్టింట వ్యూస్ కొనసాగుతూనే ఉండటం విశేషం.