Telugu Global
Cinema & Entertainment

Gandhi Godse - Ek Yudh: ‘గాంధీ గాడ్సే -ఏక్ యుధ్’- రిపబ్లిక్ డేకి అట!

Gandhi Godse - Ek Yudh: 26 న సంతోషీ తీసిన ‘గాంధీ గాడ్సే -ఏక్ యుధ్’ విడుదలవుతూంటే గాడ్సే సమర్ధకులు హడావిడి చేయడంలేదు

Gandhi Godse - Ek Yudh: ‘గాంధీ గాడ్సే -ఏక్ యుధ్’- రిపబ్లిక్ డేకి అట!
X

Gandhi Godse - Ek Yudh: ‘గాంధీ గాడ్సే -ఏక్ యుధ్’- రిపబ్లిక్ డేకి అట!

మహాత్మా గాంధీ హంతకుడిగా నాథూరామ్ గాడ్సే పేరు తెలియని వారు లేరు. 1948 జనవరి 30 న పట్టపగలు నమస్కారం పెట్టి గాంధీ ఛాతీలోకి మూడు బుల్లెట్లు పేల్చాడు గాడ్సే. 1949 లో గాడ్సేకి మరణశిక్ష విధించింది కోర్టు. అయితే దేశ విభజనలో గాంధీ పాత్రని ప్రశ్నిస్తూ గాడ్సేని దేశభక్తుడిగా చూసే ఒక వర్గం వుంది. కానీ గాంధీజీ హత్య దశాబ్దాల క్రమబద్ధమైన బ్రెయిన్ వాష్‌కి పరాకాష్ట అనీ, గాంధీజీ కొన్ని శక్తుల కంట్లో నలుసుగా మారారనీ, కాలక్రమేణా ఈ ఆగ్రహం ఒక ఫోబియాగా మారిందనీ, 1934 సంవత్సరం నుంచి 14 సంవత్సరాల కాలంలో గాంధీజీని హతమార్చేందుకు దాదాపు ఆరు సందర్భాలలో ప్రయత్నాలు జరిగాయనీ, ఎంకెగాంధీ.ఆర్గ్ వెబ్సైట్ పేర్కొంటోంది.

1948 జనవరి 30 న గాడ్సే చేసిన చివరి ప్రయత్నం ఫలించింది. మిగిలిన ఐదు ప్రయత్నాలు 1934లో; జూలై, సెప్టెంబరు 1944 లో; సెప్టెంబర్ 1946 లో; 20 జనవరి 1948లో జరిగాయి. గాడ్సే మునుపటి రెండు ప్రయత్నాల్లో పాల్గొన్నాడు. 1934, 1944, 1946లలో విఫలయత్నాలు జరిగినప్పుడు దేశ విభజనకి సంబంధించిన ప్రతిపాదన గానీ, పాకిస్థాన్‌ కి 55 కోట్ల నిధులు విడుదల చేసే అంశంగానీ అసలు ఉనికిలో లేవు. లేనప్పుడు ఈ కారణాలు చెప్పి గాడ్సే ని సమర్ధించే వర్గం వాదన నిలబడదనీ, గాంధీజీని అంతమొందించే కుట్ర చాలా ముందుగానే జరిగిందనీ వెబ్సైట్ పేర్కొంటోంది.

అసలు ఒక హత్యని సమర్ధించడ మేమిటని మౌలిక ప్రశ్న. ఈ ప్రశ్న రాజ్ కుమార్ సంతోషీకి కూడా వేశారు. గాంధీ హత్యని తీసుకుని గత యాభై ఏళ్ళుగా సినిమాలు తీస్తూనే వున్నారు కమల హాసన్ సహా. చివరికిప్పుడు సీనియర్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషీ కూడా తీశాడు. 2001 లో ‘దిలెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ అనే గొప్ప సినిమా తీశాడు అజయ్ దేవగణ్ తో. ఆయన గోదీ మీడియా లాగా ‘గోదీ’ దర్శకుడు కాదు. ‘కాశ్మీర్ ఫైల్స్’ లాంటి ఎజెండా సినిమాలు తీయడు. కనుక జనవరి 26 న సంతోషీ తీసిన ‘గాంధీ గాడ్సే -ఏక్ యుధ్’ విడుదలవుతూంటే గాడ్సే సమర్ధకులు హడావిడి చేయడంలేదు. షారుఖ్ ఖాన్ సినిమాలు చూసి అతడ్ని సూపర్ స్టార్ చేసిన వాళ్ళు ‘పఠాన్’ ని బ్యాన్ చేసుకుంటూ తిరుగడంలో బిజీగా వున్నారు.

అయితే ఒక విషాదాన్ని జనవరి 26 న రిపబ్లిక్ డే నాడు ప్రదర్శించడమే సంతోషీ నిజాయితీని ప్రశ్నిస్తోంది. దీనికెక్కడా తగిన పబ్లిసిటీ జరగడం లేదనేది గమనించాలి. ఇది దేశవ్యాప్తంగా విడుదల కావడంలేదు. కొన్ని చోట్ల మాత్రమే పరిమితంగా విడుదలవుతోంది. ఒక పక్క 25న ‘పఠాన్’ విడుదలవుతూంటే 26 న సంతోషీ సినిమా ఎవరు చూస్తారని ప్రశ్నించే వాళ్ళూ వున్నారు.

ఇది కాల్పనిక చరిత్ర. ఈ కథ మహాత్మా గాంధీ వున్న కల్పిత ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. గాంధీ తనపై జరిగిన దాడి నుంచి బయటపడి, తర్వాత జైలులో నాథూరామ్ గాడ్సేని కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ తీవ్ర చర్చకి దారి తీస్తుంది. భావజాలాల ఆ వాగ్యుద్ధంలో ఎవరు నెగ్గారనేది కథ. గాడ్సే ఏమని వాదిస్తాడో తెలిసిందే, గాంధీ ఏం చెప్తాడనేది రాజ్ కుమార్ సంతోషి లోని రచయిత చెప్తాడు.

దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి చారిత్రాత్మక సంఘటనల్ని ట్రేస్ చేస్తూ ఇద్దరి భావజాలాల వ్యత్యాసాన్ని చిత్రీకరించాడు. ప్రెస్ మీట్ లో నాథూరామ్ గాడ్సేని కీర్తించేందుకు ఈ సినిమా చేస్తున్న ప్రయత్నమా అని సంతోషిని ప్రశ్నించారు. గాడ్సే కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడనీ, దాన్ని ప్రజలకి తెలియకుండా దాచిపెట్టారనీ, తను భావిస్తున్నట్టూ, గాడ్సేకి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టేందుకు తానెందుకు భయపడాలనీ సంతోషీ చెప్పాడు.

హంతకుడిని సమర్థించడం నైతికంగా సరైనదేనా అని అడిగినప్పుడు- గాడ్సే వైఖరిని సమర్థించడం సరైనదేననీ, ఒక వ్యక్తిని ఉరితీసే ముందు అతని ఆఖరి కోరిక తీరుస్తామనీ, గాడ్సే ఆఖరి కోరిక తన వాయిస్ ప్రజలకి చేరువ కావాలన్నదేననీ, అది మేము ప్రజలకి వినిపిస్తే తప్పేమిటనీ తన పాయింటుని వివరించాడు సంతోషీ.

ఇందులో మహాత్మా గాంధీగా దీపక్ అంతానీ నటిస్తే, గాడ్సేగా చిన్మయ్ మండ్లేకర్ నటించాడు. అయితే గాడ్సేని బతికించడానికి ఇలాటి సినిమాలతో గాంధీని పదేపదే చంపుతున్నారు. రాజ్ కుమార్ సంతోషీ అసలేం చేశాడనేది రిపబ్లిక్ డే నాడు తెలుస్తుంది.



First Published:  24 Jan 2023 1:23 PM
Next Story