డల్లాస్‌లో అట్టహాసంగా 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్
ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా చేయని విధంగా విదేశాల్లో వేడుకగా ప్రీరిలీజ్
రామ్‌చరణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. కియా అద్వానీ హీరోయిన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా చేయని విధంగా విదేశాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. డల్లాస్ వేదికగా జరిగిన ఈ వేడుకకు భారీస్థాయిలో అభిమానులు తరలివచ్చారు. రామ్‌చరణ్ ఎంట్రీ సందర్భంగా ఆడిటోరయం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. స్టార్.. స్టార్.. గ్లోబల్ స్టార్ అంటూ మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మూవీలో కీలకపాత్ర పోషించిన నటుడు ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిజంగా కింగ్. ఎందుకంటే ఆయన ప్రవర్తన, మనసు, వ్యవహారశైలి, నడక, నటన అంతా కింగ్‌లా ఉంటుంది. నా మొబైల్‌లోఆయన నంబర్ 'ఆర్.సి. ది కింగ్' అని ఉంటుంది. నేను ఏది ఫీల్ అవుతానో అదే మాట్లాడుతాను. రాస్తాను. ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు.
రామ్ చరణ్ ఇందులో డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నారు. రామ్ నందన్ అనే యువ ఐఏఎస్ అధికారిగా కనిపించడంతో పాటు తండ్రి అప్పన్న పాత్రనూ ఆయనే చేశారు. అంజలి, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్, నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.