కేరళలో మొట్టమొదటి ప్రభుత్వ ఓటీటీ
దేశంలోనే మొదటిదైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఓవర్-ది-టాప్ (ఓటీటీ ) ప్లాట్‌ఫారమ్ ‘సి-స్పేస్’ ని కేరళ ప్రభుత్వం వచ్చే నెలలో ఆవిష్కరించనుందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
దేశంలోనే మొదటిదైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఓవర్-ది-టాప్ (ఓటీటీ ) ప్లాట్‌ఫారమ్ ‘సి-స్పేస్’ ని కేరళ ప్రభుత్వం వచ్చే నెలలో ఆవిష్కరించనుందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల్ని సమీకరించి కేరళ స్టేట్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎస్ఎఫ్ డిసి) ఆధ్వర్యంలో ప్రారంభించే ఈ ఓటీటీ ద్వారా అవార్డులు గెలుచుకున్న మలయాళం సినిమాలు, షార్ట్ ఫిలింలు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్ అవుతాయని తెలిపారు. అలాగే తక్కువ బడ్జెట్ సినిమాలు, ఇండిపెండెంట్ సినిమాలు సైతం ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరుకోవడానికి ఈ ఓటీటీ ఒక వేదిక అవుతుందన్నారు.
‘ఇంతవరకూ మేం నిర్వహిస్తున్న ఫిలిం ఫెస్టివల్స్ లో స్థానిక మలయాళ సినిమాల్ని ఫెస్టివల్స్ కి వచ్చే ప్రతినిధులు మాత్రమే చూస్తున్నారు. తర్వాత థియేటర్లలో విడుదల చేసినా, కేరళలోని ప్రేక్షకులు మాత్రమే వీక్షించగలుగుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళలో అవార్డులు గెలుచుకున్న సినిమాలు, లేదా రాష్ట్ర అవార్డులు గెలుచుకున్న సినిమాలు రాష్ట్రం దాటి ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరాల్సిన అవసరముంది. దీనికి చర్యలు చేపట్టడం మన బాధ్యత’ అని జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు, కెఎస్ఎఫ్ డిసి చైర్మన్, షాజీ ఎన్ కరుణ్ చెప్పారు.
ఈ ఓటీటీ వేదికని 'సమాంతర సాంస్కృతిక ఎత్తుగడ' గా పేర్కొంటూ, మలయాళంలో రూపొందించిన వైవిధ్యభరిత, లేదా విభిన్న చలన చిత్రాలు ప్రపంచ వీక్షకుల్ని చేరుకునేలా అర్హమైన వాటిని ఎంపిక చేసి ప్రసారం చేస్తామని ఆయన చెప్పారు. ‘మా ప్రేక్షకుల కళాభిరుచిని మెరుగుపరచడమే మా లక్ష్యం. ప్రస్తుతం కేరళలో తమిళం, తెలుగు సినిమాలే థియేటర్లలో అత్యధిక వసూళ్ళు రాబడుతున్నాయి. ప్రేక్షకుల ప్రవర్తనా సరళిని మార్చడానికి మేము సహాయం చేయాలనుకుంటున్నాము’ అని వివరించారు. ప్రస్తుతం గల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ ఓటీటీలు అందిస్తున్న సేవల కారణంగా దేశంలో, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, మారు మూలల్లో, మలయాళ సినిమా ప్రతిధ్వనిని పొందుతున్న సమయంలో, ప్రభుత్వ యజమాన్యంలో సి- స్పేస్ ఓటీటీ రావడం ఒక విప్లవాత్మక పరిణామమనే చెప్పాలి. వాస్తవికతకి, ప్రయోగాలకీ పేరుగాంచిన మలయాళ సినిమాలతో ముందుకొస్తున్న కొత్త తరం నటుల, సాంకేతిక నిపుణుల నేతృత్వంలో భాషా అవరోధాల్ని అధిగమించి, కొత్త అభిమానుల్ని పెంచుకునే సువర్ణావకాశం సి- స్పేస్ తో లభిస్తుంది.
సి- స్పేస్ ఇతర ఓటీటీ దిగ్గజాల వలె కాకుండా, కేవలం మలయాళ భాష కంటెంట్ ని మాత్రమే కలిగి వుంటుంది. అది థియేటర్‌లలో విడుదల అయి వుండొచ్చు, లేదా వుండక పోవచ్చు. సి- స్పేస్ లో ఎటువంటి కంటెంట్ ని అనుమతించాలనే నిర్ణయం చరిత్రకారులు, సినిమా నిర్మాతలు, రచయితలు, సినిమా పరిశ్రమలోని విభిన్న కోణాల్లో పని చేసే 60 మంది క్యూరేటర్‌లతో కూడిన అనుభవజ్ఞులైన ప్యానెల్‌పై ఆధారపడి వుంటుంది.
ముగ్గురు సభ్యుల ప్యానెల్ సినిమా లేదా డాక్యుమెంటరీని సిఫారసు చేస్తే, అది అంగీకారం పొందుతుంది. ఇతర ఓటీటీ సైట్‌ల నుంచి సి- స్పేస్‌ని వేరుగా వుంచేది దీని ఆదాయ నమూనా. దీని ద్వారా కంటెంట్ నిర్మాతలు ప్రేక్షకులు సినిమా చూసిన ప్రతిసారీ ఆదాయానికి సంబంధించిన సాధారణ మూలాన్ని పొందుతారు.నిర్మాత తన కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆదాయ వాటాని స్వీకరించడానికి నామినేట్ చేయవచ్చు. ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ ని అప్‌లోడ్ చేసే సమయంలో ఎలాటి రిజిస్ట్రేషన్ ఖర్చులూ వుండవు.
ఆదాయ నమూనా రాబడిలో సినిమా సాంకేతిక అంశాలు, అద్దె ఖర్చులు, నాణ్యతా అప్‌గ్రేడ్‌లు, వెబ్‌సైట్ నిర్వహణ మొదలైన వాటికి దాదాపు 50% ఖర్చు కింద సి- స్పేస్ తీసుకుంటుంది. స్ట్రీమ్ అవుతున్న సినిమా నుంచి వచ్చే ఆదాయంలో మిగిలిన 50% దాని నిర్మాతకి వెళ్తుంది. రాష్ట్ర లేదా జాతీయ అవార్డు పొందిన దర్శకులైతే, సినిమా మేధో హక్కుల కోసం కూడా ఆదాయంలో వాటా ఇవ్వడం జరుగుతుంది.
వీక్షకులకి చెల్లింపు మోడల్ వచ్చేసి పే-పర్-వ్యూ ప్రాతిపదికన వుంటుంది. ఒక ప్రేక్షకుడు ఒక సినిమాని చూడడానికి దాదాపు రూ. 75 ఖర్చు చేయాల్సి వుంటుంది. ఇది థియేటర్లలో చెల్లించే దాని కంటే చాలా తక్కువ. భవిష్యత్తులో ప్రతిస్పందనని బట్టి నెలవారీ లేదా వార్షిక సభ్యత్వ రుసుములు ప్రారంభించే అవకాశముంది.
దేశంలో మొట్టమొదటి చలనచిత్ర అకాడమీ కేరళలో పుట్టినట్టే, సి- స్పేస్ కూడా ఒక విప్లవాత్మక మార్గమని, ఇది స్థానిక కళాత్మక సినిమా కోసం డిజిటల్ ఆర్కైవ్‌గా మారాలనే లక్ష్యంతో కూడా పనిచేస్తున్నామనీ ప్రాజెక్ట్ వెనుక వున్న నిపుణులు చెప్పారు. సి- స్పేస్ లో ఇప్పటికే 100 గంటల కంటెంట్ అప్‌లోడ్ చేశామని, ఇది వచ్చే నెల నుంచి ప్ర్క్షకులకి అందుబాటులో వుంటుందనీ తెలియజేశారు.