ఈ వారం 11 సినిమాలతో చలన చిత్రోత్సవాలు!
ఈ వారం 14,15 తేదీల్లో 11 సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో మూడు తప్ప మిగిలినవి చిన్న చిన్న సినిమాలు.
పెద్ద సినిమాలు విడుదల కాని వారం టోకున చిన్న సినిమాలు విడుదలై పోవడం ఓ ట్రెండ్ గా మారింది. అదేదో చలన చిత్రోత్సవాలు జరుగుతున్నట్టుగా 8- 10 చిన్న చిన్న సినిమాలు థియేటర్స్ ని అలంకరిస్తున్నాయి. ఒక్కో సినిమాకి పట్టుమని 8-10 మంది ప్రేక్షకులు కూడా వుండడం లేదు. రెండో రోజు సినిమా కూడా వుండదు. వీటిని 200 రూపాయల టికెట్టుతో ఎవరు చూస్తారు. చిన్న సినిమాలకి 100 రూపాయలకి తగ్గిస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో. హిందీలో చిన్న సినిమాలకి సంబంధించి మల్టీప్లెకుల యాజమాన్యాలు ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. దీన్ని తెలుగులో కూడా అమలు చేస్తే తప్ప చిన్న సినిమాల చలన చిత్రోత్సవాలకి అర్ధముండదు.
ఈ వారం 14,15 తేదీల్లో 11 సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో మూడు తప్ప మిగిలినవి చిన్న చిన్న సినిమాలు. ముందుగా 15వ తేదీ విడుదలవుతున్న సినిమాలేమిటో చూద్దాం...
1. కాంతార : ఇది కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కాంతార అంటే మాయా అడవి అని అర్ధం. ఇందులో ప్రకృతికీ, మనిషికీ మధ్య పోరాటం. సంచలన దర్శకుడు హీరో వృషభ్ శెట్టి దీన్ని అనితర సాధ్యంగా రూపొందించాడు. ఇందులో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు ఇతర తారాగణం. సంగీతం అజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం అరవింద్ కశ్యప్. నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల్ని నిర్మాత అల్లు అరవింద్ పొంది గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నారు.
2. రెబల్ : ప్రభాస్ నటించిన రెబల్ రీ రిలీజ్ అవుతోంది. స్టార్స్ పుట్టిన రోజుకి వాళ్ళ హిట్స్ రీ రిలీజ్ చేస్తున్న క్రమంలో భాగంగా ఇది ప్రభాస్ పుట్టిన రోజు కానుక. అయితే 2012 లో ఇది విడుదలైనప్పుడు ఫ్లాపయ్యింది. దీనికి లారెన్స్ దర్శకత్వం వహించాడు. తమన్నా హీరోయిన్ గా నటించింది. కృష్ణం రాజు ఒక ముఖ్య పాత్ర పోషించారు. సంగీత లారెన్స్, ఛాయాగ్రహణం రామ్ ప్రసాద్. బ్యానర్ శ్రీ బాలాజీ సినీ మీడియా. నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు.
14 వ తేదీ విడుదలలు :
1. రారాజు : ఇక కేజీఎఫ్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన, కన్నడలో 2016లో విడుదలైన సినిమా 'సంతు - స్ట్రెయిట్ ఫార్వర్డ్' తెలుగులో 'రారాజు' టైటిల్ తో డబ్బింగ్ అయింది. ఇందులో యశ్ భార్య రాధిక పండిట్ కథానాయికగా నటించింది. పద్మావతి పిక్చర్స్ బ్యానర్‌పై వీఎస్. సుబ్బారావు విడుదల చేస్తున్నారు. దీనికి మహేష్ రావు దర్శకుడు. 2. క్రేజీ ఫెలో : ఆది సాయి కుమార్ మరో మూవీతో అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇటీవలే 'తీస్ మార్ ఖాన్' తో కూడా పరాజయాన్ని చవిచూశాక, 'క్రేజీ ఫెలో' తో మరో బాక్సాఫీసు పరీక్షకి సిద్ధమయ్యాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మాత. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటించారు.
3. గీత : కొత్త దర్శకుడు విశ్వారావు దర్శకత్వంలో ఆర్. రాచయ్య నిర్మాతగా 'గీత' ఒక ప్రేమ కథ. చాలా కాలంగా విడుదల ఆగి వుంది. ఇందులో సునీల్, హెబ్బా పటేల్, సప్తగిరి నటవర్గం.
4. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ : యంగ్ హీరో విశ్వంత్, మాళవిక సతీశన్ జంటగా నటిస్తోన్న 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' రోమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్. దీనికి సంతోష్ కంభంపాటి దర్శకుడు. మధు నందన్, సుదర్శన్, హర్ష వర్ధన్ ఇతర తారాగణం. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
5. నిన్నే పెళ్ళాడుతా : ఈశ్వరీ ఆర్ట్, అంబికా ఆర్ట్ పతాకాలపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా, 'పైసా' మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్‌గా వైకుంఠ బోను దర్శకత్వంలో వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించిన మూవీ 'నిన్నే పెళ్లాడతా'. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్.
6. రుద్రనేత్రి : తిరుపతి వర్మ దర్శకత్వంలో అమ్మోరి కథతో 'రుద్రనేత్రి' తెరకెక్కింది. శ్యామ్, వృశాలి హీరోహీరోయిన్లు. జి. ఈశ్వర్ నిర్మాత.
7. నీతో : బాలూ శర్మ దర్శకత్వంలో ఇది ప్రేమ కథ. ఇందులో అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో హీరోయిన్లు. రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్, రవివర్మ, సంజీత్ ఇతర తారాగణం. జంగాల స్నేహల్, ఎవిఆర్ స్వామి నిర్మాతలు.
8. నా వెంటపడుతున్న చిన్న వాడెవడమ్మా : రెగ్యులర్ స్టోరీ లా కాకుండా డిఫరెంట్ కథతో భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో అందమైన, పవిత్ర మైన ప్రేమ ఎలా వుంటుందో ఈ సినిమాలో కూడా అంతే అందమైన పవిత్రమైన ప్రేమని చూపించామని కొత్త దర్శకుడు వెంకట్ వందెల ప్రకటన. . జి వి ఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై 'హుషారు' లాంటి సూపర్‌హిట్ లో నటించిన తేజ్ కూరపాటి హీరోగా, అఖిల హీరోయిన్ గా తెరకెక్కింది. ఎం. నాగేశ్వరావు, ఎం. కమలాక్షి, జి. వేంకటేశ్వరావు లు నిర్మాతలు.
9. అడవి : జి రమేశ్ దర్శకత్వంలో వినోద్ కిషన్, అమ్ము అభిరామి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇది ఫారెస్ట్ అడ్వెంచర్.