Telugu Global
Cinema & Entertainment

ఉపాధికి ఎప్పుడూ సరికొత్త ద్వారాలే ఇక్కడ!

సినిమా, టెలివిజన్ పరిశ్రమలు 2.4 మిలియన్ ఉద్యోగాలని సృష్టిస్తున్నాయి. వేతనాల రూపంలో 186 బిలియన్ డాలర్లని చెల్లిస్తున్నాయి.

ఉపాధికి ఎప్పుడూ సరికొత్త ద్వారాలే ఇక్కడ!
X

ఉపాధికి ఎప్పుడూ సరికొత్త ద్వారాలే ఇక్కడ!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చలనచిత్ర పరిశ్రమ అత్యంత ముఖ్యమైన అంగంగా వుంటూ వస్తోంది. బలమైన ఆర్థిక వ్యవస్థ బలమైన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి వుంటుంది. ఇదంతా ఒక స్క్రిప్టుతో మొదలవుతుంది. సినిమా, టెలివిజన్ పరిశ్రమలు 2.4 మిలియన్ ఉద్యోగాలని సృష్టిస్తున్నాయి. వేతనాల రూపంలో 186 బిలియన్ డాలర్లని చెల్లిస్తున్నాయి. అంతే కాదు, ఈ పరిశ్రమలు 1,22, 000 వ్యాపారాలని కలిగివున్నాయి. మనదేశం విషయానికే వస్తే, సినిమా- టీవీ రంగాల విలువ 349 వేల కోట్ల రూపాయలుగా వుంది (49.9 బిలియన్ డాలర్లు). 26.6 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇదంతా దేశ ఆర్ధిక వ్యవస్థకి తోడ్పాటే.

అయితే లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ అతలాకుతలమయింది. అయినా కోలుకుని నేటికి 77.2 బిలియన్ల డాలర్ల పరిశ్రమగా ఎదిగి ముందుకు దూసుకుపోతోంది. సినిమా పరిశ్రమ సృజనాత్మక రంగానికి చెందినది కాబట్టి, ప్రపంచ స్థాయిలో సంవత్సరానికి మిలియన్ల మంది ప్రజలు ఏసింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, రైటింగ్ మొదలైనవాటిలో ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా రంగానికి సంబంధించిన గణాంకాలేమిటో చూడడం ఆసక్తికరంగా వుంటుంది. ఈ గణాంకాలు 2021, 2022 సంవత్సరాలని పరిగణనలోకి తీసుకుని రూపొందించినవి. ఆసక్తి కల్గించే ఈ గణాంకాలపై ఓ లుక్...

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీసు చలనచిత్రాలలో అత్యధికంగా ఆక్రమించిన భాష ఇంగ్లీషు. సినిమా పరిశ్రమ అంటే - సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ స్టూడియోలు, నిర్మాణ సంస్థలు, ఫిల్మ్ ప్రొడక్షన్, యానిమేషన్, ప్రీ-అండ్ పోస్ట్ ప్రొడక్షన్, ఫిల్మ్ ఫెస్టివల్స్, డిస్ట్రిబ్యూషన్ మొదలైన వాణిజ్య, సాంకేతిక శాఖల సమ్మేళనం. నేడు సినిమా పరిశ్రమ కేవలం థియేటర్‌లకి మాత్రమే పరిమితం కాకుండా, ఓటీటీ పరిశ్రమ నుంచి కూడా భారీ రాబడిని పొందుతోంది.

2025 నాటికి సినిమా రంగం నుంచి అత్యధిక ఆదాయాన్ని పొందే దేశాలుగా అమెరికా, చైనా వుంటాయి. గణాంకాల ప్రకారం 2022 లో ప్రపంచవ్యాప్తంగా సినిమా బాక్సాఫీసు ఆదాయం 26 బిలియన్ డాలర్లు.

వాల్ట్ డిస్నీ 2022 సంవత్సరంలో అతిపెద్ద చలనచిత్ర పంపిణీదారుగా నిలిచింది. కంపెనీ దాదాపు 600 సినిమాల్ని విడుదల చేసి, మార్కెట్‌లో 17.01 శాతం వాటాతో మొదటి ర్యాంకులో వుంది. అలాగే వార్నర్ బ్రదర్స్ 15.11 శాతం మార్కెట్ వాటాతో రెండో ర్యాంకులో, 12.46 శాతం వాటాతో సోనీ పిక్చర్స్ మూడో ర్యాంకులో వున్నాయి.

ఈ మహానుభావులు థియేటర్ కెళ్ళలేదు!

సినిమాల రన్నింగ్ టైమ్ పరంగా చూస్తే - 59.8 శాతం సినిమాలు 76 నుంచి 120 నిమిషాల వరకు రన్నింగ్ టైమ్ ని కలిగి వున్నాయి. విడుదలైన సినిమాల్లో 20. 6 శాతం 60 నిమిషాల నిడివితో, 18.4 శాతం 121 నుంచి 180 నిమిషాల స్క్రీనింగ్ సమయంతో వున్నాయి. 0.6 శాతం సినిమాలు 61 నుంచి 75 నిమిషాల నిడివితో వున్నాయి.

ఇక సిబ్బంది విషయానికొస్తే, 51.8 శాతం మంది పురుషులు, 48.2 శాతం మహిళలూ వున్నారు. బ్యాచిలర్ డిగ్రీలు వున్నవారు 37 శాతం వున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 36 శాతం మంది హైస్కూల్ డిప్లొమాతో, 17 శాతం మంది అసోసియేట్ డిగ్రీలతో వున్నారు.

పోతే, 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 61 శాతం మంది పెద్దలు ఏడాది పొడవునా సినిమా థియేటర్‌కి వెళ్ళలేదని వెల్లడైంది. మరోవైపు, 31 శాతం మంది థియేటర్‌లో 1 నుంచి 4 సార్లు సినిమాలు చూశారని, 9 శాతం మంది సినిమా హాళ్ళని 5 సార్లు కంటే ఎక్కువ సార్లు సందర్శించారనీ చెప్పారు.

జానర్స్ విషయానికొస్తే, 2022 లో యాక్షన్ సెగ్మెంట్‌లో 54 హాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. 28 అడ్వెంచర్, 59 కామెడీ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు జానర్‌లు మార్కెట్‌లో వరుసగా 13.15 శాతం, 9.27 శాతం మార్కెట్ వాటాని పొందాయి. ఇతర జానర్స్ లో హార్రర్ 37 సినిమాలు, 8.51 మార్కెట్ వాటాతో; డ్రామా 144 సినిమాలు 15.3 శాతం మార్కెట్ వాటాతో వున్నాయి. థ్రిల్లర్/సస్పెన్స్ సినిమాలు 46, కేవలం 3.35 శాతం మార్కెట్ వాటాతో వున్నాయి. రోమాంటిక్ కామెడీలు 11, మ్యూజికల్ సినిమాలు 6 విడుదలైతే, వీటి మార్కెట్ వాటా 1.41 శాతం, 0.83 శాతంగా వున్నాయి. అదేవిధంగా, రియాలిటీ జానర్ 1 సినిమా, 0.77 మార్కెట్ వాటా; బ్లాక్ కామెడీ జానర్ 3 సినిమాలు, 0.60 శాతం మార్కెట్ వాటా పొందాయి.

వెయ్యి సినిమాలతో మన దేశం!

2022 లో హాలీవుడ్ 449 సినిమాలని నిర్మిస్తే, ఇండియా 1000 నిర్మించింది. చైనా 326, బ్రిటన్ 220 నిర్మించాయి. 2022 లో అవతార్: ది వే ఆఫ్ వాటర్ అంతర్జాతీయ బాక్సాఫీసులో అతిపెద్ద ఆదాయాన్ని ఆర్జించిన చలన చిత్రంగా నిలిస్తే, దీని తర్వాతి స్థానాన్ని టాప్ గన్: మావెరిక్ పొందింది. జాబితాలో ర్యాంక్ పొందిన ఇతర సినిమాలు జురాసిక్ వరల్డ్ డొమినియన్, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్, మినియన్స్: ది రైజ్ ఆఫ్ గ్రూ, బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్, ది బ్యాట్‌మాన్, థోర్: లవ్ అండ్ థండర్, చాంగ్ జిన్ హు జి షుయ్ మెన్ కియోవా మొదలైనవి.

భాషల పరంగా చూస్తే, ఇంగ్లీషు సినిమాల తర్వాత, మాండరిన్ భాష రెండవ అతిపెద్ద భాష. ఫ్రెంచ్ భాష మూడవ స్థానంలో నిలిచింది. ప్రొడక్షన్ పరంగా, లైవ్-యాక్షన్ ప్రొడక్షన్ మెథడ్‌తో కూడిన సినిమాలు మార్కెట్‌లో అత్యధిక వాటాని (77.13 శాతం). డిజిటల్ యానిమేషన్ 13.49 శాతం వాటాతో వుంది.

దేశం, ప్రాంతం, భాష, జానర్- ఎలా వర్గీకరించినా సినిమాలు బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించడానికి సహాయపడుతున్నాయి. మహమ్మారి ప్రభావాలతో సంబంధం లేకుండా, సినిమా రంగం ప్రతి సంవత్సరం మరింత సాంకేతికాభివృద్ధితో పురోగతి సాధిస్తోంది. వినోద రంగం నశించేది కాదు. అందువల్ల ఉద్యోగావకాశాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అతి ముఖ్య రంగంగా నిపుణుల దృష్టిలో వుంటోంది. అంతే కాదు, సినిమా రంగంపై ఆధార పడ్డ మీడియాలో కూడా ఎందరికో వివిధ ఉపాధులు లభిస్తున్నాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రమే కాదు, మన దేశ సినిమాలు కూడా మార్కెట్లో ప్రధాన వాటాని సొంతం చేసుకుంటున్నాయి. 2022 లో విడుదలైన హిందీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ విధంగా సినీ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా వినోద రంగంలో నిరంతరం ట్రెండింగ్ అయ్యే పరిశ్రమ.

First Published:  19 July 2023 6:44 AM GMT
Next Story