మొదటిసారి.. పబ్లిక్‌లో.. నా తరఫున మాట్లాడటం చూసి ఏడ్చేశా - ఎమోషనల్ అయిన సినీ నటి రేణూదేశాయ్
`ఒకరు నాకు వీడియో పంపారు. అందులో మాట్లాడిన మహిళ ఎవరో నిజంగా నాకు తెలియదు. నా గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ మొదటిసారి పబ్లిక్‌లో ఒకరు నా తరఫున మాట్లాడటం విని ఏడ్చేశా. ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది.`
బద్రి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. 2009లో పెళ్లి చేసుకున్న వీరు.. రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రేణూ దేశాయ్ సినిమాలు చేయలేదు. తాజాగా టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల తన కుమారుడు అకీరా విషయంలో ఓ నెటిజన్ చేసిన పోస్టింగ్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ మాజీ భార్యగా తనను సంబోధించడం రేణూ దేశాయ్‌కి అస్సలు ఇష్టముండదు. అయితే అకీరాను తమ అన్న కొడుకు అంటూ ఆ మెసేజ్‌లో సంబోధించడంపై రేణూ మండిపడ్డారు. ఆ నెటిజన్‌కి ఈ విషయంలో ఆమె ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. అకీరా మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు.. అంటూ స్పష్టం చేశారు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడటం నేర్చుకోండి అంటూ ఘాటుగా రియాక్టయ్యారు.
తాజాగా తనకు మద్దతుగా ఒక మహిళా సామాజిక వేత్త మాట్లాడిన విషయంపై ఆమె స్పందించారు. ఆమె మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. `ఒకరు నాకు ఈ వీడియో పంపారు. అందులో మాట్లాడిన మహిళ ఎవరో నిజంగా నాకు తెలియదు. నా గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు. కానీ మొదటిసారి పబ్లిక్‌లో ఒకరు నా తరఫున మాట్లాడటం విని ఏడ్చేశా. నేను ఏదైనా చెబితే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయానంటారు. ఎన్నికలు వస్తున్నాయంటారు. కానీ ఈ వీడియో చూశాక నా బాధ అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారని ధైర్యం వచ్చింది. ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది.` అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరో హీరోయిన్ల జంట విడిపోయినప్పుడు సమాజం మహిళ నుంచే రెస్పాన్సిబిలిటీ కోరుకుంటోందని తెలిపారు. ఆమెనే బాధ్యురాలిని చేస్తున్నారని చెప్పారు. రేణూ దేశాయ్‌లాంటి వారికి సమాజం నుంచి భరోసా, మద్దతు కావాలని స్పష్టం చేశారు. ఆమె ఎవరినో పెళ్లి చేసుకుంటారనే వార్తలు బయటికి రాగానే.. ఈ కసాయి లోకం ఆమెపై దుమ్మెత్తిపోసిందని మండిపడ్డారు. నువ్వు మా వదినవి.. నువ్వు మరో పెళ్లి ఎలా చేసుకుంటావు.. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.. అంటూ ఆమెను ప్రశ్నించారని విమర్శించారు. మా అన్న అయితే ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చని పేర్కొన్నారని తెలిపారు. ఇదే అభిమానులు. తమ్ముళ్లు.. వదినతో విడిపోయిన నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే ఎలా అన్నయ్యా.. సీతమ్మకు దూరమైన శ్రీరాముడు.. సీతాదేవి కాంస్య విగ్రహాన్ని తన పక్కన పెట్టుకున్నట్టుగా నువ్వు కూడా వదిన విగ్రహాన్ని తయారు చేయించి పెట్టుకోవచ్చు కదా అని అడిగారా అని నిలదీశారు. నువ్వు మరో పెళ్లెందుకు చేసుకున్నావంటూ అడిగారా అని ప్రశ్నించారు. సమాజం వైపు నుంచి వచ్చే వేళ్లన్నీ కూడా స్త్రీల వైపే చూపుతున్నాయి.. అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సమంత విషయంలోనూ సమాజం అలాగే వ్యవహరిస్తోందని ఆమె చెప్పారు.