Telugu Global
Cinema & Entertainment

''మొత్తం స్తంభించిపోతుందనుకున్నాం'' - విశ్వనాథ్‌ అంత్యక్రియలపై ఆవేదన

విశ్వనాథ్ చనిపోయారు..భారీగా జనసందోహం వస్తుంది.. ఎలా కంట్రోల్ చేయాలి అని తొలుత అనుకున్నాం. ప్రభుత్వానికి అధికార లాంచనాలతో వీడ్కోలు పలకడానికి ఇబ్బంది ఏంటి?

మొత్తం స్తంభించిపోతుందనుకున్నాం - విశ్వనాథ్‌ అంత్యక్రియలపై ఆవేదన
X

దర్శకుడు కె. విశ్వనాథ్‌కు నివాళులర్పించేందుకు సినీ ప్రముఖులు హాజరుకాకపోవడంపై చిత్రపరిశ్రమలోని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సాక్షి మీడియా ప్రత్యేక చర్చా కార్యక్రమం పెట్టింది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు విశ్వనాథ్ అంత్యక్రియలకు ఇంత తక్కువ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. అయితే గొప్ప వ్యక్తి అంత్యక్రియలకు అందరూ వచ్చి ఉండే బాగుండేది. కానీ రానివారిపై విమర్శలకు దిగి చర్చకు తెరలేపవడం ఆసక్తిగా ఉంది.

చాగంటి వంశీ, సినీ నటుడు

విశ్వనాథ్‌ గారి అంత్యక్రియలకు పెద్దగా స్పందన రాకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. చాలా బాధగా ఉంది. భౌతికకాయాన్ని ఇంట్లోనే ఉంచుతామని కుటుంబ సభ్యులు చెబుతుంటే.. అందరూ వస్తే ఇక్కడ మొత్తం కిక్కిరిసిపోతుంది.. అభిమానుల తాకిడిని ఈ ప్రాంతం ఎలా తట్టుకుంటుందని.. ట్రాఫిక్ స్తంభించిపోతుంది.. ఫిల్మ్ చాంబర్‌కు తరలించి ఉంటే బాగుండేది అనుకున్నా.. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులు చేసిందే కరెక్ట్ అనిపించింది. జనం భారీగా వస్తారనుకుని చాంబర్‌ వద్దకు తీసుకెళ్లి ఉంటే ఇబ్బందిగా ఉండేది.

రెంటాల జయదేవ్‌, సాక్షి సినీ విశ్లేషకులు

సినీ పరిశ్రమలు లెక్కలేసుకుని వ్యక్తుల విషయంలో వ్యవహరిస్తోంది. కమలహాసన్, రజనీకాంత్‌, మహేష్‌ బాబు, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, నాని, వరుణ్‌ సందేశ్, శ్రీకాంత్, నితిన్‌, లిఖిల్, అల్లరి నరేష్ వీరు కూడా రాలేదు. విశ్వనాథ్ చనిపోవడంతో షూటింగ్‌లు బంద్ చేశారని పైకి చెప్పారు. కానీ లోపాయికారీగా కొన్ని షూటింగ్‌లు జరిపారు. ఇది అందరూ కదలిరావాల్సిన తరుణం కాదా?. ఆయన వారసత్వం ఉందా లేదా అని చూసుకుంటే ఎలా?. రాజు గారి ఇంట్లో కుక్క చనిపోతే రాజుతో పని ఉంటుంది కాబట్టి అందరూ వెళ్తారు. అదే రాజు గారు చనిపోతే ఆయనే పోయారు... ఇంకేం పని ఉంది అని ఎవరు రారు. ఇక్కడా అలాంటి పరిస్థితే ఉంది.

కుల కోణం కూడా ఇందులో ఉంది. తదుపరి తరంగా మహేష్ బాబు ఉన్నారు కాబట్టి... కృష్ణ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వెళ్తారు.. ప్రభాస్ ఉన్నారు కాబట్టి కృష్ణంరాజు చనిపోతే వెళ్తారు.. కాపు కాసేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి సత్యనారాయణ చనిపోతే అందరూ వెళ్తారు.. అంటే కాపు కాసే వాళ్లు ఉంటే మీరు వెళ్తారు.. వ్యాపార కమ్మని ప్రయోజనాలుంటే మీరు వెళ్తారు. అవేవీ లేవని విశ్వనాథ్ అంత్యక్రియలకు రారు. ఘంటసాల చనిపోయినప్పుడు కూడా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వెళ్లలేదు. బాలసుబ్రమణ్యం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కరోనా కారణం చెప్పారు. బాపు చనిపోతే చాలా కొద్దిమందే వెళ్లారు.

విశ్వనాథ్‌ గారితో పనిచేసినవారు కూడా ఎందుకు రాలేదు. బయటకు మాట్లాడేటప్పుడు మాత్రం విశ్వనాథ్ సినిమాలు చూసి పెరిగామని చెబుతారు. కేవలం ట్విట్టర్‌లో నివాళులర్పిస్తే సరిపోతుందా?. అంతటితో బాధ్యత తీరిపోతుందా?. అనుబంధాలు చచ్చిపోయాయి అనిపిస్తోంది. విశ్వనాథ్ చనిపోయారు..భారీగా జనసందోహం వస్తుంది.. ఎలా కంట్రోల్ చేయాలి అని తొలుత అనుకున్నాం. ప్రభుత్వానికి అధికార లాంచనాలతో వీడ్కోలు పలకడానికి ఇబ్బంది ఏంటి?.

First Published:  5 Feb 2023 4:39 PM IST
Next Story