NTR Simhadri - మొన్న అమెరికా, ఈసారి లండన్ లో రచ్చ
NTR Simhadri - లండన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించాడు. ఏకంగా థియేటర్లలో బాణసంచా కాల్చారు. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు.
ఈమధ్య ఓవర్సీస్ లో కూడా ఫ్యాన్స్ కొంతమంది రెచ్చిపోతున్నారు. అత్యుత్సాహంతో తెలుగు ప్రజల పరువు తీస్తున్నారు. మొన్నటికిమొన్న అమెరికాలోని వర్జీనియాలో ఏం జరిగిందో చూశాం. వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శన సమయంలో బాలకృష్ణ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు అలాంటిదే మరో రచ్చ లండన్ లో జరిగింది.
వెస్ట్ లండన్ లోని సినీ వరల్డ్ లో సింహాద్రి సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసేందుకు భారీ స్థాయిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకొని, జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ థియేటర్లలోకి వెళ్లారు. అప్పటివరకు అంతా ఓకే. సినిమా స్టార్ట్ అయింది.
అంతే ఒక్కసారిగా.. థియేటర్లలో కేకలు మొదలయ్యాయి. అవి కామన్ అనుకున్నారు, ఆ తర్వాత కాగితాలు ఎగిరాయి, ఈసారి మాత్రం కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగలేదు ఫ్యాన్స్. థియేటర్లలో ఏకంగా బాణసంచా కాల్చారు. దీంతో అంతా థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. జరిగిన ఘటనపై థియేటర్ యాజమాన్యం, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మొన్నటికిమొన్న వర్జీనియాలో బాలయ్య సినిమా విషయంలో ఇలానే జరిగింది. వీరసింహారెడ్డి ప్రదర్శితమౌతుంటే.. కాగితాలు చించి గాల్లో ఎగరేశారు. మిగతా ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశం కూడా ఇవ్వకుండా గోల చేశారు. దీంతో సినిమాను మధ్యలోనే ఆపేశారు. నిర్వహకులతో పాటు, పోలీసులు థియేటర్ లోకొచ్చి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు లండన్ లో ఇలాంటిదే మరో ఘటన పునరావృతం అయింది. చూస్తుంటే.. ఓవర్సీస్ ఫ్యాన్స్ కూడా ఈమధ్య గతితప్పుతున్నారు.