Telugu Global
Cinema & Entertainment

90 ఏళ్ళ ఇరోస్ సినిమా మళ్ళీ ప్రారంభం!

ఒకవైపు పాత సినిమా హాళ్ళని కూల్చడం, షాపింగ్ కాంప్లెక్సులు కట్టడం, లేదా మల్టీప్లెక్సులు నెలకొల్పడం, ఇంకా లేదా రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు నిర్మించడం వంటివి చేస్తూంటే, మరోవైపు అతి పురాతన థియేటర్ ని కాపాడుకుంటూ వచ్చి ఆధునీకీకరించడమనే ఆలోచనకి శ్రీకారం చుడుతున్నారు.

90 ఏళ్ళ ఇరోస్ సినిమా మళ్ళీ ప్రారంభం!
X

ఒకవైపు పాత సినిమా హాళ్ళని కూల్చడం, షాపింగ్ కాంప్లెక్సులు కట్టడం, లేదా మల్టీప్లెక్సులు నెలకొల్పడం, ఇంకా లేదా రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు నిర్మించడం వంటివి చేస్తూంటే, మరోవైపు అతి పురాతన థియేటర్ ని కాపాడుకుంటూ వచ్చి ఆధునీకీకరించడమనే ఆలోచనకి శ్రీకారం చుడుతున్నారు. గత వారమే కోయంబత్తూరు లో 110 ఏళ్ళుగా నడుస్తున్న పురాతన డిలైట్ థియేటర్ ని కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం ప్రారంభించారు. ఇలా ఎన్నో ప్రసిద్ధ పాత థియేటర్లు అదృశ్యమైపోతున్నాయి. సికిందరాబాద్ లో ల్యాండ్ మార్క్ సంగీత్ థియేటర్ మల్టీప్లెక్స్ కోసం అదృశ్యమైంది. ఏళ్ళు గడుస్తున్నా ఆ మల్టీప్లెక్స్ కూడా జాడలేదు. ఇలావుంటే, ముంబాయిలో 90 ఏళ్ళ చారిత్రక, సుప్రసిద్ధ ల్యాండ్‌మార్క్ థియేటర్ ‘ఇరోస్ సినిమా’ ని, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ద్వారాలు తెరచి, అత్యాధునిక ఐమాక్స్ థియేటర్లోకి ఆహ్వాహ్నం పలుకుతున్నారు.

పునరుద్ధరించిన ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ పాత సౌందర్యాకర్షణని మార్చలేదు. అదే సమయంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కొత్త యుగం సాంకేతిక విలువల్ని చేకూర్చి పెట్టారు. ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చివరి సినిమాగా ప్రదర్శించిన తర్వాత మూసివేసి, ఆధునికంగా తీర్చిదిద్ది ఇప్పుడు ఏడేళ్ళ తర్వాత, షాహిద్ కపూర్- కృతీ సానన్ లు నటించిన ‘తేరీ బాతోమే మే ఐసా ఉల్జా జియా’ కొత్త సినిమాతో గత శుక్రవారం ప్రేక్షకులకి స్వాగతం పలికారు.

ఒరిజినల్ గా వున్న 1200-సీట్ల పాత థియేటర్ ని రెండవ అంతస్తుకి మార్చి, 305-సీట్ల ఇమాక్స్ థియేటర్ గా ప్రారంభించింది పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు. 1935లో పార్సీ వ్యాపారవేత్త షియావాక్స్ కవాస్జీ కంబాటా దక్షిణ ముంబాయిలోని చర్చి గేట్ దగ్గర ఈ థియేటర్ ని నిర్మించారు. అప్పట్లో ఆర్కిటెక్ట్ సోహ్రాబ్జీ భేద్వార్ ఇటాలియన్ శైలిలో రూపకల్పన చేశారు. దీనికి ఇరోస్ అని గ్రీకు దేవుడి పేరు పెట్టారు. ఫిబ్రవరి 10, 1938న ప్రారంభమైంది. 2018 లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చారు.

రెండవ అంతస్తులో ఐమాక్స్ థియేటర్, దిగువ అంతస్తులో రెస్టారెంట్లు, రిటైల్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేశారు. ఆరు సంవత్సరాల క్రితం పని చేయడం ప్రారంభించారు. ఒక ఐకానిక్ భవనంగా ఈ థియేటర్ దక్షిణ ముంబాయి స్మారక చిహ్నంగా వుంది. ఇందులో లేజర్ టెక్నాలజీతో ఇమాక్స్ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ఇది అసమానమైన వీక్షణాను భవాన్ని అందిస్తుంది. 4కె లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్ తో బాటు మల్టీ-ఛానల్ సౌండ్ ఏర్పాటుతో మెరుగైన రిజల్యూషన్, శక్తివంతమైన కలర్ స్కీము ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తగలవు.

పీవీఆర్ -ఐనాక్స్ యాజమాన్యంలో ముంబాయిలో ఇది ఐదవ ఐమాక్స్ స్క్రీన్‌. జాతీయంగా ఇరవై మూడవ స్క్రీన్‌. ఇరోస్ థియేటర్ విలక్షణ ఆర్ట్ డెకో డిజైన్‌ చెక్కుచెదరకుండా ఐమాక్స్ టెక్నాలజీని మిళితం చేశారు. బ్రాడ్‌వే-ప్రేరేపిత వాతావరణాన్ని పోలి ఉండే లాబీలో ఇప్పుడు లైవ్ కుకింగ్ ఫుడ్ కౌంటర్‌ ని ఏర్పాటు చేశారు. ఇది సినిమాటిక్ అనుభవానికి పాకశాస్త్ర ఆనందాన్ని జోడిస్తుంది. హెరిటేజ్ ఎలిమెంట్స్ ని కళాత్మకంగా ఏకీకృతం చేసి, చరిత్ర ఔత్సాహికుల్ని, సినిమా ప్రేక్షకుల్నీ ఒకే విధంగా ఆకర్షించే ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ ని సృష్టించేశారు.

ఇప్పుడు ఐనాక్స్- ఇరోస్ లో అద్వితీయ సినిమా మాయాజాలాన్ని మళ్ళీ ఆవిష్కరించేందుకు తరలి రావాలని ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది రాబోయే తరాలకి తరగని మరపురాని అనుభవాలని అందించడం గ్యారంటీ ఆని నొక్కి చెబుతున్నారు.

First Published:  12 Feb 2024 4:19 PM IST
Next Story