Telugu Global
Cinema & Entertainment

Lucky Bhaskar | లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Lucky Bhaskar Movie - దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమాకు విడుదల తేదీ లాక్ అయింది.

Lucky Bhaskar | లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

ప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్, తక్కువ టైమ్ లోనే అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి, సీతారామం సినిమాలతో టాలీవుడ్ కూడా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు దుల్కర్ "లక్కీ భాస్కర్" అనే సాధారణ మనిషికి చెందిన అసాధారణ కథతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ "లక్కీ భాస్కర్" సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా "లక్కీ భాస్కర్" చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

తొలిప్రేమ, రంగ్ దే, మిస్టర్ మజ్ను, సార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రచయిత-దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ నూలి పని చేస్తున్నారు.

1980- 1990 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. సాధారణ బ్యాంకు క్యాషియర్ లక్కీ భాస్కర్ ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.

ఇక ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

First Published:  31 May 2024 5:23 PM GMT
Next Story