Double Ismart | డబుల్ ఇస్మార్ట్ ట్రయిలర్ రివ్యూ
Double Ismart Trailer Review - రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం.
డబుల్ ఇస్మార్ట్ టీజర్ హిట్టయిన తర్వాత ట్రయిలర్ కోసం ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. అలా భారీ అంచనాల మధ్య ఈరోజు డబుల్ ఇస్మార్ట్ ట్రయిలర్ రిలీజైంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎలాంటి సస్పెన్స్ లేదు, దాదాపు కథ మొత్తం చెప్పేశారు ట్రయిలర్ లో. ఇంకా చెప్పాలంటే ట్రయిలర్ చూస్తే, సినిమా చూసిన ఫీలింగ్.
హీరోకు బ్రెయిన్ లో చిప్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈసారి ఆ చిప్ ఎవరిదనే ఉత్సుకత అందర్లో ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ దాన్ని సస్పెన్స్ లో ఉంచాలనుకోలేదు. విలన్ సంజయ్ దత్ మెమొరీని చిప్ లో పెట్టి దాన్ని హీరోకు తగిలించాడు.
అంటే, విలన్ బ్రెయిన్ హీరోకు ట్రాన్సఫర్ అయిందన్నమాట. సినిమాలో అత్యంత కీలకమైన ఈ పాయింట్ ను ట్రయిలర్ లోనే చెప్పేశాడు దర్శకుడు. ఈ పాయింట్ ను ముందుగానే రివీల్ చేయాలని అతడికి ఎందుకనిపించిందో..? బహుశా, ఇంతకంటే పెద్ద ట్విస్టులు సినిమాలో ఉన్నాయేమో.
ఇస్మార్ట్ శంకర్ లో హీరో క్యారెక్టర్ ను యాజ్ ఇటీజ్ గా డబుల్ ఇస్మార్ట్ లో కొనసాగించారు. అది సహజం. సినిమాలో మాంఛి గ్లామర్ డోస్ ఉందనే విషయాన్ని ట్రయిలర్ లో కావ్య థాపర్ ను హాట్ గా చూపించి చెప్పకనే చెప్పారు.
ఇలా హీరోహీరోయిన్ల బాండింగ్ తో పాటు.. హీరో-విలన్ మధ్య కాన్ ఫ్లిక్ట్ ను కూడా ట్రయిలర్ లో చెప్పేశారు. అదనంగా అలీ ట్రాక్ ఎలా ఉండబోతోందో కూడా చూపించేశారు. చూస్తుంటే, పూరీ టీమ్ కావాలనే ఈ ఎత్తుగడతో ప్రేక్షకుల ముందుకొచ్చినట్టు కనిపిస్తోంది. సినిమాపై లేనిపోనివి ఊహించుకోకుండా, సరైన అంచనాల్ని సెట్ చేసిందనే అనుకోవాలి.