Telugu Global
Cinema & Entertainment

మణిరత్నం ఇంత‌మంది స్టార్స్‌ని మార్చారా!

ఆ నవల 'పొన్నియిన్ సెల్వన్'. ఇప్పుడు దర్శకుడు మణిరత్నంతో వార్తలకెక్కిన చోళ రాజుల చరిత్ర! ఎన్టీఆర్ బదులు కృష్ణ ఏం చేశారో, ఎంజీఆర్ బదులు మణిరత్నం అది చేయాలనుకున్నారు.

మణిరత్నం ఇంత‌మంది స్టార్స్‌ని మార్చారా!
X

1957 నుంచీ మహానటుడు నందమూరి తారక రామారావు కన్నకల అల్లూరి సీతారామ రాజు జీవిత చరిత్ర తీయాలనుకోవడం. కానీ అల్లూరి చరిత్ర సినిమాకి ఫక్తు డ్రై సబ్జెక్టు అవుతుంది కదాని దశాబ్దం పైబడి తాత్సారం చేస్తూంటే, 1974 లో హీరో కృష్ణ తీసేశారు! ఎన్టీఆర్ అనుకున్న ఆ డ్రై నెస్ ని కాస్తా భక్తిరస పారవశ్యాలతో సస్యశ్యామలం చేస్తూ! అల్లూరి సీతారామ రాజు అనే విప్లవ వీరుడుకి దైవత్వాన్ని కూడా ఆపాదించి, రచయిత త్రిపురనేని మహారధి నడిపిన అద్భుత సన్నివేశాలే సినిమాకి జీవం పోసి డ్రై నెస్ ని వెళ్ళగొట్టాయి. సినిమా చరిత్రలో నిలిచిపోయింది.

1958లో రామచంద్రన్ కల్కి కృష్ణమూర్తి రాసిన ఓ ప్రసిద్ధ చారిత్రక నవల తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లోనే పదివేల రూపాయలు వ్యయం చేసి రచయిత నుంచి హక్కులు కొన్నారు. తనే నిర్మాత, తనే దర్శకుడు, తనే హీరోగా సినిమా రూపొందించేందుకు సిద్ధమైపోయారు. వైజయంతిమాల, జెమినీ గణేశన్, పద్మిని, సావిత్రి, బి. సరోజాదేవి, నంబియార్, వి. నాగయ్య మొదలైన పాపులర్ నటీనటులతో షూటింగ్ ప్రారంభించబోతున్నారనగా, ఎంజీఆర్ ప్రమాదానికి గురై ఆరు నెలలు మంచాన పడ్డారు. తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత నవల హక్కులు పునరుద్ధరించిన తర్వాత కూడా సినిమాని నిర్మించలేక వదిలేశారు. ఆ నవల 'పొన్నియిన్ సెల్వన్'. ఇప్పుడు దర్శకుడు మణిరత్నంతో వార్తలకెక్కిన చోళ రాజుల చరిత్ర! ఎన్టీఆర్ బదులు కృష్ణ ఏం చేశారో, ఎంజీఆర్ బదులు మణిరత్నం అది చేయాలనుకున్నారు. అయితే కృష్ణలాగా డేరింగ్ కాదేమో, దశాబ్దాల తరబడి 'పొన్నియిన్ సెల్వన్' తో తటపటాయిస్తూ వచ్చారు.

1994 నుంచే ఆ నవలని సినిమాగా తీయాలని మణిరత్నం కల. ఈ కలలోకి ఎందరో స్టార్లు వచ్చారు, పోయారు, వచ్చారు, పోయారు. చివరికిప్పుడు మనం ట్రైలర్లో చూస్తున్న స్టార్లు మిగిలారు. మణిరత్నం మారుస్తూ వచ్చిన స్టార్ల బారులు చూస్తే, అనంతంగా సాగే ఏదో పెళ్ళిచూపుల సీరియల్ లాగా అనిపిస్తుంది.

1994 లోనే మణిరత్నం కమల హాసన్ తో కలిసి స్క్రిప్ట్ మీద పని కూడా చేశారు. అయితే ఆ సమయంలో ప్రాజెక్ట్ ఆర్థికంగా భారమన్పించడంతో విరమించుకున్నారు. తిరిగి 2010 లోగానీ మరో ప్రయత్నం మొదలు పెట్టలేదు. ప్రధాన పాత్ర వల్లవరాయన్ వంద్యదేవన్‌గా తమిళ మాస్ స్టార్ విజయ్ ని తీసుకున్నారు. అరుళ్ మోళీ వర్మ గా మన స్టార్ మహేష్ బాబుని తీసుకున్నారు. ఇంకా ఇతర పాత్రల్లో తమిళ స్టార్ ఆర్యని, సీనియర్ నటుడు సత్యరాజ్ నీ తీసుకున్నారు. ఇంకా తమిళ స్టార్స్ విక్రమ్, సూర్య, విశాల్ లని కూడా తీసుకోవాలని ప్లాన్ చేశారు. జ్యోతిక, అనుష్క‌, ప్రియాంక చోప్రాలతో కూడా చర్చలు మొదలు పెట్టారు.

ఇక వారం రోజుల్లో షూటింగ్ ప్రారంభిస్తారనగా ఆనాడు ఎంజీఆర్ లాగే అవాంతరం వచ్చి సినిమా ఆగిపోయింది. మైసూర్ ప్యాలెస్, లలితా మహల్ లలో విజయ్, మహేష్ బాబులతో ఫొటో షూట్ ప్లాన్ చేస్తే, లొకేషన్ పర్మిషన్లు క్యాన్సిలయ్యాయి. సినిమా షూటింగులకి చారిత్రక స్థలాలు ఇచ్చేది లేదని ప్రభుత్వం చెప్పేసింది. ఒక్క‌ దేవాలయంలో కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఈ లొకేషన్స్ సెట్స్ వేయాలంటే బడ్జెట్ సరిపోదని సినిమా క్యాన్సిల్ చేసేశారు.

2019 లో మూడో ప్రయత్నం ప్రారంభించారు. ఇప్పుడు స్టార్లు మారిపోయారు. విక్రమ్, విజయ్ సేతుపతి, జయం రవి, సిలాంబరాసన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ లని బుక్ చేసుకున్నారు. ఇంతలో విజయ్ సేతుపతి డేట్లు కుదరడం లేదని వెళ్ళిపోయాడు. అతడి స్థానంలో మరో స్టార్ కార్తీని బుక్ చేసుకున్నారు. చెన్నైలోనూ, థాయ్ లాండ్ లోనూ షూటింగ్ ప్లాన్ చేశారు. ఇంతలో అమితాబ్ బచ్చన్ వెళ్ళిపోయారు, అనుష్క కూడా వెళ్ళిపోయింది. త్రిష, పార్టీబన్ లని తీసుకున్నారు. కీర్తీ సురేష్, అమలా పాల్, జయరాం లని కూడా తీసుకున్నారు.

మళ్ళీ థాయిలాండ్ వెళ్ళే ముందు కీర్తీ సురేష్, అమలా పాల్ లు డేట్లు కుదరక ఔట్ అయిపోయారు. ఐశ్వర్యా లక్ష్మి, విక్రమ్ ప్రభులు వచ్చారు. ఇలా స్టార్స్ కూడికలు తీసివేతలు జరుగుతూ వచ్చి, చివరికి మిగిలిన తారాగణమిదే.. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ప్రకాష్ రాజ్, నాజర్, రెహ్మాన్, రియాజ్ ఖాన్, అజ్మత్ ఖాన్, పార్టీబన్, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం, నీలంగల్ ర‌వి మొదలైన వారు.

ఇంతటితో అయిపోలేదు. సూపర్ స్టార్ రాజనీకాంత్ కూడా ఓ లుక్కేశారు. చాలా కాలం క్రితం నవలలోని పెరియ పళ వట్టు రాయర్ పాత్ర తనకు కేటాయించమని మణిరత్నంని నోరు విడిచి అడిగారు రజనీ కాంత్. ఆ నిడివి తక్కువ పాత్రలో మిమ్మల్ని చూపిస్తే మీ ఫ్యాన్స్ నా వెంటపడతారని నో చెప్పేశారు మణిరత్నం!

ఇలా ఎంజీఆర్ నుంచీ రజనీ కాంత్ వరకూ ఎందరో కలలు గన్న చోళ చారిత్రక కళా రూపం మొదటి భాగం, మణిరత్నం చేతిలో అత్యద్భుతంగా రూపకల్పన జరిగి, సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

First Published:  11 Sept 2022 1:30 PM IST
Next Story