Tholi Prema - అమ్మ, నాన్న, పవన్ కల్యాణ్
Karunakaran Tholi Prema - దర్శకుడు కరుణాకరణ్, తను తీసిన తొలిప్రేమ సినిమాపై మరోసారి స్పందించాడు. పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
తొలిప్రేమ సినిమాపై, పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు దర్శకుడు కరుణాకరన్. తనకు అమ్మా, నాన్న తర్వాత పవన్ కల్యాణ్ అంటేనే ఇష్టమని ప్రకటించుకున్నాడు.
"వర్షం భూమ్మీద ఎక్కడైనా పడొచ్చు. కానీ సరైన చోటులో పడితేనే ఆ వాన చినుకులకు విలువ వస్తుంది. నా కథ కళ్యాణ్ చేతిలో పడింది. అందువల్లే ఇంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమా చేయడం నా అదృష్టం. సినిమా గురించి మాట్లాడుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నాను. ఈ ఒక్క చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎప్పుడు ఎక్కడికెళ్లినా నా అమ్మనాన్న పవన్ కళ్యాణ్ అని చెబుతుంటాను. నా అన్నయ్య పవన్ కళ్యాణ్ వల్లే తొలిప్రేమ ఇంత పెద్ద హిట్ అయింది."
విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్బంగా తొలిప్రేమ సినిమాను, రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి కొత్తగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరుణా కరణ్ పైవిధంగా స్పందించాడు. ఇదే కార్యక్రమంలో దిల్ రాజు కూడా పాల్గొన్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను తొలి ప్రేమ సినిమా నిలబెట్టిందన్నాడు.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అతడి సరసన కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించింది. వాసుకి, పవన్ కు చెల్లెలిగా కనిపించింది. వాసుకి భర్త ఆనంద్ సాయి (తొలిప్రేమ టైమ్ కి వీళ్లకి పెళ్లి కాలేదు) ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేశాడు. ఈ సినిమా కోసం అతడు వేసిన తాజ్ మహల్ సెట్ అందరి ప్రశంసలు అందుకుంది.