పవన్ కల్యాణ్ కు కథ రాసేంత మైండ్ ఇంకా నాకు రాలేదు
ఇంద్రగంటికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. మరి ఈ దర్శకుడు పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నాడు?
ఇంద్రగంటి మోహనకృష్ణ.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకడు. ఇతడిలో టాలెంట్ ఉందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇతడు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు తీయడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టు కూడా కనిపించడు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే, అతడు ఇచ్చే సమాధానం ఒకటే. పెద్ద హీరోలకు కథలు రాసేంత మైండ్ ఇంకా తనకు రాలేదంటున్నాడు.
"స్టార్స్ కు తగ్గ కథ రాయడం నాకు ఇంకా రాలేదు. పెద్ద స్టార్ కు కథ రాయాలంటే కొన్ని హంగులుండాలి. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లేదా పవన్ కల్యాణ్ కు కథ రాయాలంటే ఓ మైండ్ సెట్ ఉండాలి. నాకు ఇంకా అది రాలేదు. నాకు ఎప్పుడూ పక్కింటి వాడు, ఎదురింటి వాడు లాంటి కథలు చెప్పడం ఇష్టం. పొద్దున్నే పాల ప్యాకెట్ వేసే వాడి జీవితం ఎలా ఉంటుందనేది నాకు ఇంట్రెస్ట్. నేను అదే రాయగలను. నేనే మార్కెట్ కు వెళ్తాను, షాపింగ్ చేసుకుంటాను. అక్కడ కనిపించే వ్యక్తుల ప్రవర్తన నాకు చాలా ఇంట్రెస్ట్. అంతే తప్ప, పెద్ద హీరోల కోసం ఎలివేషన్లు రాసే స్థాయి నాకు ఇంకా రాలేదు."
ఇలా స్టార్ హీరోలకు కథలు రాయలేననే విషయాన్ని బయటపెట్టాడు ఇంద్రగంటి. అలా అని ఇంద్రగంటి దగ్గర లార్జర్ దేన్ లైఫ్ స్టోరీలు లేక కాదు. అతడి వద్ద భారీ పాన్ ఇండియా స్టోరీ ఉంది. దాన్ని విజయ్ దేవరకొండకు వినిపించాడు కూడా. అయితే అది కేవలం లైన్ మాత్రమేనని, పూర్తిస్థాయిలో కథను విస్తరించిన తర్వాత, అప్పుడు విజయ్ దేవరకొండకు మరోసారి వినిపిస్తానని అంటున్నాడు ఈ దర్శకుడు.
సుధీర్ బాబు హీరోగా నటించిన "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమా తీశాడు ఇంద్రగంటి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఈ ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తను స్టార్ స్టేటస్ కోసం చూడనని, కేవలం తన కథలు, సినిమాల్లో క్వాలిటీ-కంటెంట్ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే చూస్తానంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు.