Telugu Global
Cinema & Entertainment

Sir Movie: ప్రచారంలో స్పీడ్ పెంచిన ధనుష్

Dhanush's Sir movie song released : సార్ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఇది కూడా బాగుంది.

Sir Movie: ప్రచారంలో స్పీడ్ పెంచిన ధనుష్
X

శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ. మూడు దశాబ్దాల సినీ జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. 'నేను సైతం' అంటూ ఆవేశాన్ని రగిలించగలరు.. 'సారంగ దరియా' అంటూ కాలు కదిపేలా చేయగలరు. ఆయన తన కలంతో ఎన్నో భావాలు పలికించగలరు. తాజాగా ఆయన కలం నుంచి మరో మధుర గీతం జాలు వారింది.

నాగవంశీ నిర్మాణంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వస్తున్న సినిమా 'సార్'. ధనుష్ హీరోగా నటిస్తున్న తెలుగు సినిమా ఇది. 'సార్' లో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్.

వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు) ‌'వాతి',(తమిళం) నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా, మరోవైపు పాటలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్రానికి సంబంధించి 'బంజారా' అనే గీతం విడుదలైంది.

"ఏదీ మన సొంతం కాదు. కష్టాలు, సుఖాలు శాశ్వతం కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం" అనే అర్థమొచ్చేలా పదునైన మాటలతో, లోతైన భావంతో సుద్దాల కలం నుంచి జాలువారిన అక్షరాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సుద్దాల అద్భుతమైన సాహిత్యానికి అంతే అద్భుతమైన జి వి ప్రకాష్ సంగీతం, అనురాగ్ కులకర్ణి స్వరం తోడై పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

తాజాగా విడుదలైన 'బంజారా' లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. అందులోని లోకేషన్లు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. ఊరిలో వాళ్ళతో కలిసి హీరో డాన్స్ చేయడం, అలాగే హోటల్ లో స్నేహితులతో కలిసి తిని బయటకు వచ్చాక అక్కడున్న చిన్నారికి డబ్బు సాయం చేయడం వంటివి అతని పాత్ర తీరుని, స్వభావాన్ని తెలియజేస్తున్నాయి.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు‘ గీతం 'సార్‘ పై అంచనాలు పెంచాయి. విద్యావ్యవస్థ తీరుతెన్నుల మీద ఈ సినిమా తీశారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న సినిమా రాబోతోంది.



First Published:  17 Jan 2023 10:01 PM IST
Next Story